‘బిగ్ బాస్’ని వాడేస్తోన్న దివాళి సినిమాలు

దీపావళి సీజన్ అంటే తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దగా ఆసక్తి చూపించదు. అందుకు అమావాస్య సమయంలో సినిమాలు విడుదల చేయకూడదు అనే సెంటిమెంట్ కూడా కారణం. కానీ.. దివాళి సీజన్ లోనే తమ సినిమాలను విడుదల చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు తమిళులు. ఈకోవలోనే ఈ వారం తెలుగు నుంచి పెద్దగా సినిమాలు లేకపోయినా.. తమిళం నుంచి మాత్రం రెండు చిత్రాలు అనువాద రూపంలో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించడానికి వచ్చేస్తున్నాయి.

వీటిలో ముందుగా చెప్పుకోవాల్సింది ‘జపాన్’. వరుస విజయాలతో మంచి జోష్ మీదున్న కార్తీ నటించిన సినిమా ఇది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలతో ‘జపాన్’పై క్రేజ్ అయితే మామూలుగా లేదు. ఇక.. కార్తీకి తమిళంలో ఎంత క్రేజుందో.. తెలుగులోనూ అంతకు మించి అన్నట్టుంది. అందుకే.. తెలుగులో ప్రమోషన్స్ యాక్టివిటీస్ లో జోరు పెంచాడు. ఇప్పటికే మీడియాతో పలుమార్లు ముచ్చటించిన కార్తీ.. రీసెంట్ గా ‘బిగ్ బాస్’ హౌజ్ లో సందడి చేశాడు. మరో విశేషమేమిటంటే ‘జపాన్’ చిత్రాన్ని తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ రిలీజ్ చేస్తోంది.

‘జపాన్’కి తాము ఏమాత్రం తక్కువ కాదన్నట్టు ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’ టీమ్ కూడా తెలుగు ప్రమోషన్స్ లో స్పీడు పెంచింది. హీరోలిద్దరూ లారెన్స్, ఎస్.జె.సూర్య హైదరాబాద్ లో సందడి చేస్తున్నారు. నిన్న ‘జపాన్’ సినిమాకోసం కార్తీ ‘బిగ్ బాస్’ హౌజ్ కి వెళ్తే.. ఈరోజు ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’ కోసం లారెన్స్, ఎస్.జె. సూర్య ‘బిగ్ బాస్’ హౌజ్ లో సందడి చేశారు.

Related Posts