క్లాసిక్ టైటానిక్ మళ్లీ విడుదలవుతోంది..

క్లాసిక్ మూవీస్ అని చాలా కొన్ని సినిమాల గురించే చెబుతాం. ఏ భాష అయినా.. అన్ని భాషల ఆడియన్స్ ను మెప్పిస్తే అది క్లాసిక్ అవుతుంది. ఒకప్పుడు మన శంకరాభరణం ఇండియాలోనే కాక ఇతర దేశాల ప్రేక్షకులను కూడా మెస్మరైజ్ చేసింది. అలా హాలీవుడ్ సినిమాలూ మనవారిని ఇన్ స్పైర్ చేసినవీ ఉన్నాయి. అయితే ప్రతి సినిమాకూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఫిదా చేసే ఏకైక దర్శకుడు జేమ్స్ కేమెరూన్. రీసెంట్ గా అవతార్ కు సీక్వెల్ తో వచ్చిన జేమ్స్ రూపొందించిన క్లాసిక్ టైటానిక్ ఇప్పుడు రీ రిలీజ్ కు రెడీ అవుతోంది.


టైటానిక్ .. 1997లో విడుదలైన చిత్రం. హాలీవుడ్ సినిమాలు తెలుగులో డబ్ అవడం ఎప్పుడూ ఉన్నదే. అయితే టైటానిక్ లాగా అన్ని వర్గాల ప్రేక్షకలను మెస్మరైజ్ చేసిన సినిమాలు అరుదుగా ఉంటాయి. అంతకు ముందు జురాసిక్ పార్క్ వచ్చినా.. ఈ మూవీ కాస్త డిఫరెంట్. నిజంగానే అట్లాంటిక్ మహా సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ అనే షిప్‌ ను తన కథా వస్తువుగా చేసుకుని జేమ్స్ కేమరూన్ ఓ అద్భుతమైన ప్రేమకథను చెప్పాడు. ఇది రెగ్యులర్ కమర్షియల్ కథే.

ఓ మాస్ కుర్రాడు. ఓ క్లాస్ అమ్మాయి. ఊహించని ఓ సందర్భంలో కలుసుకోవడం.. ఒకరికి ఒకరు నచ్చడం.. వీరి ప్రేమ సదరు పెద్ద ఇంటి వారికి నచ్చకపోవడం.. ఆ క్రమంలో ఆ షిప్ లోనే ఇద్దరి మధ్య సరస సల్లాపాలు.. అద్భుతమైన ప్రేమ భావనలతో నిండిపోతుంది. మరోవైపు ఆ మాస్ కుర్రాడితో తిరగొద్దని వారించే తల్లి.. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తి ఈ కుర్రాడిపై చూపే అహంకారం.. అన్నీ సగటు సినిమానే తలపించినా.. అంతా షిప్ లో జరుగుతుండటం కొత్త అనుభూతి.

ఇక చివర్లో ఆ షిప్ ఓ మంచు కొండను ఢీ కొని కూలిపోవడం.. తన ప్రేయసిని బ్రతికించి ఆ మాస్ హీరో మరణించడం అనేది కథ. అలా బ్రతికిన ఆ హీరోయిన్ తన చివరి రోజుల్లో కొందరికి చెప్పినట్టుగా కనిపించే కథ. టైటానిక్ నిజం.. కానీ ఈ ప్రేమకథ అబద్ధం. అయినా ఆ కథ అందరికీ నచ్చింది. అద్భుతం అనేశారు. ఎప్పుడు చూసినా ఫ్రెష్ గా అనిపించే ఈ చిత్రాన్ని ఇప్పటి ట్రెండ్ లో రీ రిలీజ్ చేస్తున్నాడు. ఈ కొత్త టెక్నాలజీకి అప్డేట్ చేసి ఈ నెల 9న టైటానిక్ ను మళ్లీ విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం చాలా పిచ్చి ప్రేమకథలను చూస్తోన్న ఈ తరం కుర్రాళ్లు కూడా ఈ కథకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు.అప్పటి టైటానిక్ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. మరి ఈ టైటానిక్ కూడా కొత్త రికార్డులు ఏమైనా క్రియేట్ చేస్తుందా అనేది చూడాలి.

Related Posts