సంగీత సాహిత్యాల మేలు కలయిక కె విశ్వనాథ్ సినిమాలు..

సంగీత సాహిత్య సమలంకృతే అని నారాయణరెడ్డి అమ్మవారి గురించి రాశారు గానీ.. నిజానికి ఆ చిత్ర దర్శకుడు విశ్వనాథ్ కూడా సంగీత సాహిత్యాల మేలుకలయికే. తన చిత్రాలకు తనే కథను సమకూర్చుకుంటారు. మాటలు, పాటలు మాత్రం దగ్గరుండి రాయించుకుంటారు. ఆ రాసిన పాటలకు సంగీత దర్శకుడితో కలసి తనకు నచ్చిన పద్దతిలో స్వరాలు సమకూరుస్తారు. అంతగా మమేకం కావడం వల్లే విశ్వనాథుడు తీసిన చిత్రాలు అపురూపంగా రూపొందాయి. 92 సంవత్సరాల విశ్వనాథ్ వృద్ధాప్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు.


తెలుగు సినిమాను సంగీత సాహిత్యాలతో సుసంపన్నం చేసిన అభిరుచి ఉన్న దర్శకుడు కె.విశ్వనాథ్. అనుకోకుండా సినిమా రంగంలో ప్రవేశించిన ఆయన తామరాకు మీద నీటిబొట్టులానే గడిపేశారు. తనదైన పద్దతిలోనే సినిమాలు తీశారు. తన అభిరుచి మేరకు పని చేసే అవకాశం ఉంటేనే చేశారు తప్ప రాజీపడలేదు. ఆయన పేరు కాశీనాథుని విశ్వనాథ్. తెలుగువారు కళాతపస్వి అని పిలుచుకున్న ఆ దిగ్దర్శకుడు విశ్వనాథ్.


విశ్వనాథ్ పుట్టింది రేపల్లె దగ్గరి పెదపులివర్రు. చదువుకున్నది కొంత విజయవాడలో. డిగ్రీ పూర్తి కాగానే…విజయా వాహినీ స్టూడియోలో సౌండ్ విభాగంలో ఉద్యోగం. తండ్రి సుబ్రహ్మణ్యం విజయా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ విజయవాడ కార్యాలయంలో ఉద్యోగి కావడంతో విశ్వనాథ్ ను కూడా అక్కడే ఉద్యోగానికి కుదిర్చేశారు. ఆ తర్వాత నెమ్మదిగా ఆదుర్తి సుబ్బారావు దగ్గర శిష్యరికం చేశారు.. అన్నపూర్ణ మధుసూదనరావుగారి సాహచర్యం దొరికి ఆత్మగౌరవం చిత్రానికి పూర్తి స్థాయి దర్శకుడయ్యారు విశ్వనాథ్.


భారతీయ తెర మీద శాంతారామ్ ఒక ప్రత్యేక ముద్ర వేశారు. భారతీయత ను చెప్పేందుకు మాత్రమే సినిమాలు తీశారు. విశ్వనాథ్ కూడా ఆ దిశగా కొన్ని ప్రయత్నాలు చేశారు. నా సినిమాలు పదిమందిలో ముగ్గురికే నచ్చుతాయి. ఎప్పుడైనా ఆ సంఖ్య ఐదు అవుతుంది. అప్పుడు ఆ సినిమా హిట్ అని జనం అంటారు అని చాలా నిర్మొహమాటంగా చెప్పేసే విశ్వనాథ్ ను దర్శకుడుగా తెలుగువారికి పరిచయం చేసిన ఘనత మాత్రం దుక్కిపాటి వారికే దక్కుతుంది.


విశ్వనాథ్ మొదటి నుంచి కాస్త అంతర్ముఖుడే. పెద్దగా కలిపించుకుని పనిచేసే మనిషి కాదు. తన మనసుకు అనిపించింది పద్దతిగా చేసుకెళ్లడమే తెలుసు. తను ఒక కథ అనుకుని…దాంతో నిర్మాత కన్విన్స్ అయితేనే సినిమా తీసేవారు లేకపోతే లేదు. అదే పద్దతి చివర వరకు కొనసాగించారు. జనం మెప్పుకోసం చవకబారు సినిమాలు తీయనక్కర్లేదని ఆయన నమ్మకం. దాన్ని నమ్మిన నిర్మాతలకే సినిమాలు తీశారు. అలాంటి వారిలో క్రాంతికుమార్ కూడా ఒకరు.


ఆదుర్తి స్కూల్ లో కె.వి.మహదేవన్ తో విశ్వనాథ్ కు సాన్నిహిత్యం ఎక్కువ. అయితే ఆత్మగౌరవం చిత్రానికి నిర్మాత దుక్కిపాటి మధుసూధనరావు. అన్నపూర్ణాలో ఎక్కువ చిత్రాలకు సాలూరి వారే సంగీతం అందించారు. దీంతో అనివార్యంగా తన తొలి చిత్రానికి మహదేవన్ ను కాదని.. రాజేశ్వరర్రావుతో సంగీతం చేయించుకున్నారు విశ్వనాథ్. అందులో రాజేశ్వర్రావు మాత్రమే చేయగల ట్యూనొకటి ఉంది. దాశరథి రాసిన ఆ పాటను పి.సుశీల భావయుక్తంగా ఆలపించారు. దాన్ని విశ్వనాథుడు ఆహ్లాదకరంగా తెరకెక్కించారు. కథలు ఎంచుకోవడంలో కూడా ఆయనకో పద్దతి ఉంది.

కె.రామలక్ష్మి రాసిన ఆడది అనే నవలను డీవిఎస్ రాజు కోసం జీవనజ్యోతిగా తీశారు విశ్వనాథ్. ఆ కథ ఎన్టీఆర్ తోనే చేద్దామనుకున్నారు. ఎన్టీఆర్ తాను చేయనని చెప్పడమే కాదు…శోభన్ బాబు అయితే బాగుంటుందని సలహా చెప్పారు. అలా శోభన్ తో ప్రారంభమైన అనుబంధం చాలా కాలం కొనసాగింది. శోభన్ రికమండేషన్ తో మురారికి సినిమా చేయడానికి అంగీకరించారు విశ్వనాథ్. మల్లీశ్వరి కథనే ఇంకోలా తీయాలనుకున్నారు. అక్కడ హీరోయిన్ రాణివాసానికి వెళ్లితే…ఇక్కడ సీతామాలక్ష్మి సినిమాల్లోకి వెళ్లి తిరిగొస్తుంది. కథను విషాదంతం చేయాలని విశ్వనాథ్ ఆలోచన.

నిర్మాత కుదరదని హ్యాపీ ఎండింగే ఇచ్చారు. అందులో మల్లీశ్వరి తరహాలోనే దేవులపల్లివారితోనే పాటలు రాయించుకున్నారు. విశ్వనాథ్ లో స్వతహాగా కవి ఉన్నాడు. సంగీతకారుడూ ఉన్నాడు. అంతకన్నా ముందు మంచి చదువరి ఉన్నాడు. వేటూరి ప్రభాకరశాస్త్రి రాసిన ఓ కథ ప్రేరణతో విశ్వనాథ్ తీసిన చిత్రం శంకరాభరణం. ఎన్టీఆర్, ఎఎన్నార్ లు స్టెప్పులతో భారీ డైలాగులతో మాస్ ఆడియన్స్ హృదయాలను ఉర్రూతలూగిస్తున్న వేళ కొడవటిగంటి అన్నట్టు తెలుగుతెర మీద పడ్డ బాంబు శంకరాభరణం.

తను తీసే కథ సహజంగా ఉండాలనుకుంటారు విశ్వనాథ్. తనకు ఎదరైన అనుభవాలే ఉంటాయి. తాను తప్పని భావించిన అంశాలనే సర్వజనామోదంగా తీర్చిదిద్దాలనుకుంటారు. తాను నమ్మిన ఆదర్శాలను చెప్పాలనుకుంటారు. పైగా విశ్వనాథ్ ది దుక్కిపాటి వారి స్కూలు. తీసేది కమర్షియల్ సినిమానే అయినా…అందులోనూ మంచే చెప్పాలనుకునే మనిషాయన.


1981 సంవత్సరం తెలుగు తెర మీద ప్రేమ పెళ్లి అనే అంశం మీద ఓ చర్చ నడిచింది. భాగ్యరాజా కథతో బాపు తీసిన రాథాకళ్యాణంలో పెళ్లైన అమ్మాయి ఆ భర్తతోనే జీవితాన్ని కొనసాగించాలని తీర్మానిస్తారు. అదే సంవత్సరం విడుదలైన సప్తపదిలో విశ్వనాథ్ మనసులు కలవని చోట మాంగల్యానికి విలువ లేదని తేల్చేస్తారు. వేరే వ్యక్తిని మనసులో ఉంచుకుని శోభనం గదిలోకి వచ్చిన నవవధువు లో అమ్మవారిని చూస్తాడో పెళ్లికొడుకు. ఫైనల్ గా ప్రేమించిన వ్యక్తికే ఆ అమ్మాయిని అప్పగించేస్తారు. విశ్వనాథ్ సినిమాల్లో పాత్రలన్నీ ఆదర్శవంతంగానే ఉంటాయి. ఇదో విమర్శ స్థాయిలో ఉన్నప్పటికీ… సినిమా చూస్తున్నంత సేపూ ఆహ్లాదంగా ఉంటుంది. చిరంజీవిని స్క్రీన్ మీద ప్రజంట్ చేసే విషయంలోనూ విశ్వనాథ్, బాపుల మధ్య ఓ డిఫరెన్స్ కనిపిస్తుంది. బాపు మంత్రిగారి వియ్యంకుడులో ఫైట్స్ డాన్సులతో హడావిడి చేసేస్తే…విశ్వనాథ్ మాత్రం తనదైన పద్దతిలోనే చూపించారు.


చార్లీ చాప్లిన్ సిటీలైట్స్, గురుదత్ కాగజ్ కా ఫూల్ చిత్రాల కలబోత విశ్వనాథుడి సాగరసంగమం. ఓ కళాకారుడి జీవన చిత్రం. ప్రతి సన్నివేశాన్నీ ఆఖరి నిమిషం వరకు ఇంప్రవైజ్ చేసుకుంటూ తీసిన చిత్రం అది. కమల్ హసన్, జంధ్యాల, వేటూరి సహకారంతో కళాతపస్వి తీర్చిన అజరామర దృశ్యకావ్యం సాగరసంగమం.
కమల్ తో విశ్వనాథ్ తీసిన రెండో చిత్రం స్వాతిముత్యం. పూర్తిగా ముందే అనుకున్న పద్దతిలో నడచిపోయే సినిమా ఇది. విశ్వనాథ్ సృష్టించిన పాత్రలు సున్నిత మనస్కులై ఉంటాయి. ప్రజ్ఞావంతులు అయి ఉంటాయి. తప్పనిసరిగా మన సంస్కృతిని గౌరవించేవై ఉంటాయి. అనుభవంతో నేర్చుకున్న జ్ఞాన సంపన్నులు గా కనిపిస్తారు. ఈ లక్షణాలన్నీ స్వాతిముత్యంలో కమల్ పాత్రలో పుష్కలంగా కనిపిస్తాయి.


శంకరాభరణం తర్వాత వచ్చిన విశ్వనాథ్ చిత్రాలన్నీ దాదాపు సంగీతానికి పెద్ద పీట వేస్తూ సాగేవే. సిరివెన్నెల చిత్రంలో సీతారామశాస్త్రి కలం చాలా తక్కువగానే స్వతంత్రిస్తుంది. పాత్రల స్వరూప స్వభావాలను వదలకుండా…దర్శకుడి ఆలోచనలను కూడా పట్టించుకుని రాసిన పాటలవి. ఆది భిక్షువు వాడినేది కోరేదీ…బూడిదిచ్చేవాడినేది అడిగేది.


శుభసంకల్పం తర్వాత విశ్వనాథ్ మెగాఫోన్ పక్కన పెట్టి నటనకు పదును పెట్టుకున్నారు. శుభసంకల్పంతో తెలుగు తెరకు ఓ అద్భుతమైన కారక్టర్ ఆర్టిస్టును అందించిన ఘనత మాత్రం బాలసుబ్రహ్మణ్యానికే దక్కుతుంది. నటన కొనసాగిస్తూనే తన కోసం వచ్చిన ఓ నిర్మాతకు స్వరాభిషేకం అంటూ తనదైన బాణీలో ఓ చిత్రం చేశారు విశ్వనాథ్. ఈ చిత్రానికి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా విద్యాసాగర్ కు నేషనల్ అవార్డ్ లు వచ్చాయి. అటుపై శుభప్రదం అనే మరో సినిమాతోనూ ఆకట్టుకున్నారు. ఆ తర్వాత దర్శకత్వానికి ఫుల్ స్టాప్ పెట్టేశారిక.


సంగీత సాహిత్యాల మేలుకలయికతో సినిమాలు తీసి తెలుగు వారి హృదయాల్లో అంతులేని గౌరవాభిమానాలకు పాత్రులయ్యారు విశ్వనాథ్.. తెలుగులో 50కిపైగా సినిమాలకు దర్శకత్వం వహించిన విశ్వనాథ్ బాలీవుడ్‌లో 9 సినిమాలకు దర్శకత్వం వహించారు. పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. కళాతపస్వి మరణం.. తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటే అయినా.. ఎన్నో మరపురాని చిత్రాలు అందించిన ఆయన నిజంగా అజరామరుడు.

Related Posts