రివ్యూ – స్కైలాబ్

నటీనటులు – సత్య దేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ, తులసి, తనికెళ్ల భరణి తదితరులు

సాంకేతిక నిపుణులు – సినిమాటోగ్రఫీ – ఆదిత్య జవ్వాది, ఎడిటింగ్ – రవితేజ గిరిజాల, సంగీతం – ప్రశాంత్ ఆర్ విహారి, సహ నిర్మాత – నిత్యా మీనన్, నిర్మాత – పృథ్వీ పిన్నమరాజు, రచన దర్శకత్వం – విశ్వక్

కథేంటంటే

అది తెలంగాణలోని బండలింగంపల్లి అనే ఊరు. ఈ ఊర్లో దొర కూతురు గౌరి (నిత్యా మీనన్). జర్నలిస్ట్ గా పేరు తెచ్చుకోవాలన్నది ఆమె లక్ష్యం. ప్రతిబింబం అనే పత్రికలో పనిచేస్తూ ఇంటి దగ్గర నుంచే వార్తలు రాస్తుంటుంది. కానీ ఆమె కోరుకున్నట్లు పేరు రాదు. ఇదే ఊరిలో క్లినిక్ పెట్టాలని ప్రయత్నిస్తుంటాడు ఆనంద్ (సత్యదేవ్). ఇతనికి ఊరి సుబేదారు రామారావు (రాహుల్ రామకృష్ణ) సహకరిస్తాడు. గౌరి, ఆనంద్ ప్రయత్నాలు వేటికవి సమాతంరంగా సాగుతుంటాయి. ఇంతలో ఊరిలో స్కైలాబ్ పడుతుందనే వార్తలు కలకలం సృష్టిస్తాయి. ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవడం అసాధ్యం గనుక ఎవరికి నచ్చినట్లు వాళ్లు ప్రవర్తిస్తుంటారు. ఈ పరిస్థితుల్లో స్కైలాబ్ నిజంగానే ఊరి మీద పడిందా, ఆనంద్ క్లినిక్ పెట్టాడా, గౌరి జర్నలిస్ట్ గా పేరు తెచ్చుకుందా అనేది మిగిలిన కథ.

ఫ్లస్ పాయింట్స్

70 దశకపు సెటప్
నిత్యా మీనన్, సత్యదేవ్ నటన
కొన్ని ఎమోషనల్ సీన్స్

మైనస్ పాయింట్స్

నెమ్మదించిన కథనం
కామెడీ లేకపోవడం

ఎలా ఉందంటే

1970లో అమెరికా ఉపగ్రహం స్కైలాబ్ భూమ్మీద పడిన సంఘటన నేపథ్యంగా రాసుకున్న కథ ఇది. రేపు మనం ఉండం అని తెలిసిన పరిస్థితుల్లో మనుషులు ఎలా ప్రవర్తిస్తారు అనే పాయింట్ ఆధారంగా సాగుతుంది. ఈ కీ పాయింట్ చుట్టూ మూడు ప్రధాన పాత్రలను నడిపిస్తూ కథను లాగించాడు దర్శకుడు విశ్వక్. స్కైలాబ్ చిత్రంతో ఈ కొత్త దర్శకుడు సరికొత్త ప్రయత్నమే చేశాడు. ఇప్పటిదాకా తెలుగులో ఇలాంటి కథతో సినిమా రాలేదు. అయితే ఈ కొత్త కథను తెరపై ఆకట్టుకునేలా ప్రెజెంట్ చేయడంలోనే విశ్వక్ తడబడ్డాడు. సినిమాలో ప్రధాన పాత్రల పరిచయం, ఆ పాత్రల టేకాఫ్ కే దాదాపు సగం సమయం గడుస్తుంది. స్కైలాబ్ పడుతుందనే వార్తలతో కథలో వేగం పెరిగినా, ప్రేక్షకుడు అప్పటికే విసిగిపోయి ఉంటాడు. అంతగా కథనం నెమ్మదించింది.

ఆనంద్ పాత్రలో సత్య దేవ్, గౌరి క్యారెక్టర్ లో నిత్యా మీనన్, సుబేదారు రామారావుగా రాహుల్ రామకృష్ణ తమదైన శైలిలో చక్కగా నటించారు. నిత్యా మీనన్ తెలంగాణ యాసను కుమ్మేసింది. నిజంగా గౌరిని చూస్తే ఓ దొర బిడ్డను చూసినట్లే అనిపిస్తుంది. క్లినిక్ పెట్టుకోవాలనుకునే యువ వైద్యుడు ఆనంద్ పాత్రలో సత్యదేవ్ మెప్పించాడు. తన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ చూపించాడు. రాహుల్ రామకృష్ణ తన క్యారెక్టర్ కు న్యాయం చేశాడు. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ లాంటి టెక్నీషియన్స్ వర్క్ కూడా బాగుంది.

70 దశకపు వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో స్కైలాబ్ సినిమా టీమ్ సక్సెస్ అయ్యింది. అప్పటి మనుషుల వ్యవహారం, వాళ్లు రియాక్ట్ అయ్యే విధానం, సామాజిక పరిస్థితులు ఇవన్నీ సహజంగా అనిపిస్తాయి. మూడు ప్రధాన పాత్రలు, వాటిని అద్భుతంగా పోషించే నటీనటులు ఉన్నా, వాటి ద్వారా కావాల్సినంత వినోదాన్ని రాబట్టలేకపోయాడు దర్శకుడు విశ్వక్. ఈ పాత్రల ద్వారా కామెడీ జెనరేట్ చేసి ఉంటే, స్కైలాబ్ రిజల్ట్ మరోలా ఉండేది.

రేటింగ్ 2/5

Related Posts