ఆదిపురుష్‌


తారాగణం: ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్, దేవదత్త నాగే, సోనాల్ చౌహాన్
ఎడిటింగ్: అపూర్వ మోటీవాలే సాహి, అశిష్ మాత్రే
నేపథ్య సంగీతం: సంచిత్ మల్హారా, అంకిత్ బల్హారా
పాటలు : అజయ్ అతుల్ – సచేత్ – పరంపర

సినిమాటోగ్రఫీ: కార్తీక్ పలని
నిర్మాతలు: భూషణ్ కుమార్, కిషన్ కుమార్, ప్రసాద్ సుతారియా, రాజేశ్ నాయర్, వంశీ, ప్రమోద్
దర్శకత్వం: ఓమ్ రౌత్

భారతదేశంలోరామాయణ కావ్యానికి ఉన్న విశిష్టత గురించి అందరికీ తెలుసు. దేశవ్యాప్తంగా రాముడిని ఆరాధ్య దైవంగా కొలుస్తారు. ఆ పేరు మీద రాజకీయాలు కూడా చేస్తున్నారు. అయితే వెండితెరకు వస్తే రాముడి కథలన్నీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఇలాంటి కథలు తీయాలంటే తెలుగువారి తర్వాతే ఎవరైనా అని దేశమంతా ఒప్పుకుంటుది. ఈ తరుణంలో బాలీవుడ్ నుంచి మన తెలుగు స్టార్ ప్రభాస్ ను రాముడుగా పెట్టి రామాయణం ఆధారంగా ఆదిపురుష్‌ ను అనౌన్స్ చేసినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. అనేక విమర్శలు, వివాదాలు దాటుకుని ఈ సినిమా విడుదలైంది. మరి ఎలా ఉంది అనేది చూద్దాం.

కథ :
కథగా చెప్పాల్సిన అవసరం లేని కావ్యం ఇది. అయినా రామాయణంలోని అరణ్యకాండం, సుందరకాండం, యుద్ధకాండాల నుంచి కథను తీసుకున్నారు. మొత్తం రామాయణం చెప్పుకుండా ఈ పాయింట్ ను మాత్రమే చూపించే ప్రయత్నం చేశారు. సీతా లక్ష్మణ సమేతంగా అరణ్యవాసం చేస్తోన్న రాఘవుడు(ప్రభాస్)సంతోషంగా ఉన్న తరుణంలో శూర్పణక ముక్కు కోశాడనే కోపంతో పాటు.. జానకి అతిలోక సౌందర్య గురించి ఆమె చెప్పింది విని, రావణుడు(సైఫ్‌ అలీఖాన్) తన మాయ దూతను బంగారు లేడీ రూపంలో పంపిస్తాడు. సీత ఆ లేడీ కావాలని కోరగా రాఘవుడిని కుటీరం నుంచి బయటకు వెళ్లేలా చేస్తాడు. మాయలేడీ అరుపులు విని అన్న కోసం వెళతాడు లక్ష్మణుడు. ఇదే అదనుగా రావణుడు ఓ సాధువు వేషంలో వచ్చి సీతను అపహరించుకుని వెళతాడు. మరి రాముడు సీత జాడను ఎలా తెలుసుకున్నాడు. రావణ లంకపై యుద్ధం చేసి సీతను మళ్లీ ఎలా సొంతం చేసుకున్నాడు అనేది కథ.

విశ్లేషణ :
మనదేశంలో చూచాయగా అయినా రామాయణం గురించి తెలియని వారు ఉండర. మూడు ముక్కల్లోచెప్పమన్నా చెబుతారు. అలాంటి గాథను వెండితెరపై చూపిస్తున్నప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. పైగా ఈ గాథ మొదటిసారిగా సినిమాగా రావడం లేదు. అనేక సార్లు వచ్చిందే. అప్పుడు ఆ రిఫరెన్స్ లు కూడా చూసుకుని మరీ రావాల్సి ఉంటుంది. కథగా ఇందులో మార్పులు చేసే అవకాశం లేదు. కాబట్టి కథనంతోనే ఆకట్టుకోవాలి. నిజానికి రామాయణంలో ఈ మూడు కాండలు అత్యంత ఎమోషనల్ గా ఉంటాయి. కావాల్సినంతగా ప్రేక్షకలను కూడా ఆ ఎమోషన్ కు గురి చేయొచ్చు.

బట్ ఈ సినిమాలో ప్రధానంగా అదే మిస్ అయింది. ఫక్తు కమర్షియల్ సినిమా ఫార్మాట్లో చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ మూడు కాండలకు ముందున్న కాండల గురించి వాయిస్ ఓవర్ తో పాటు కొన్ని ఫోటోస్ తో పూర్తి చేశాడు. భరతుడు చెప్పులు తీసుకువెళ్లే సన్నివేశం కూడా వాయిస్ ఓవర్లోనే ముగుస్తుంది. ఇక జానకి సమేతంగా వనవాసం చేస్తోన్న రాముడిని ఇంట్రడక్షన్ ఫైట్ సీన్ తో పరిచయం చేస్తారు. ఇది ఏ మాత్రం రామాయణంలోని పాయింట్ లా అనిపించదు. దీన్నే కావ్యంలోని కథకు తగ్గట్టుగా సహజంగానూ తీసి ఉండొచ్చు. ఇక జానకిని రావణుడు అపహరించుకు పోవడానికి ప్రధాన కారణమైన శూర్పణక ఎపిసోడ్ ను అత్యంత పేలవంగా చిత్రీకరించాడు.

పైగా కేవలం రావణుడిని ప్రోవోక్ చేయడానికే శూర్పణక పాత్రను వాడుకున్నాడు. ఇక రావణుడు జానకి పై మోహాన్ని ప్రదర్శించే సీన్స్ సైతం తేలిపోయాయి. జానకి జాడను వెదుకుతున్న రాముడి కోసం శబరి రావడం.. రాముడిని చూసి పళ్లు ఇచ్చిన తర్వాత తను అగ్నికి ఆహుతి అయ్యి సుగ్రీవుడి గురించి చెప్పే సన్నివేశం దక్షిణాది ప్రేక్షకులకు మింగుడు పడని అంశం. ఇక రాముడు, జానకి కోసం తపిస్తున్న తీరును కేవలం ఓ “డ్యూయొట్” తో సరిపెట్టాడు. అయినా మొదటి సగం ఆకట్టుకున్నట్టుగానే అనిపిస్తుంది. అతిశయోక్తులు, అభూత కల్పనలు ఉన్నా.. సినిమాటిక్ గా మెప్పించినట్టే అనిపిస్తుంది.


ఇక భజరంగ్(హనుమంతుడు) ఎంట్రీ కూడా ఏమంత ఎఫెక్టివ్ గా ఉండదు. ఆల్రెడీ ఆయనకు రాముడు తెలిసినట్టుగానే చూపించారు. వాలి, సుగ్రీవుల యుద్ధం హాస్యాస్పదంగా ఉన్నా.. రాముడు వాలిని చంపడానికి పెట్టిన సీన్ బాహుబలిని గుర్తుకు తెస్తుంది. ఇదే కాదు.. రావణుడిపై యుద్ధం అప్పుడు కూడా రావణ సేనాధిపతి బాహుబలిలో ప్రభాస్, రానాల్లాగా సైనికులకు ఆయుధాలకు సంబంధించిన సంజ్ఞలు ఇవ్వడం చూస్తే దర్శకుడిపై జాలి కలుగుతుంది.


ఇక జానకిని వెదుకుతూ వెళ్లిన హనుమంతుడు లంకాదహనం చేయడం సీన్ బావుంది. సముద్రంపై వారథి కట్టడం అక్కడి నుంచి రావణలంకకు వెళ్లడం.. యుద్ధం, సీతను చెర నుంచి విడిపించడం ఇవన్నీ అందరికీ తెలిసినవే.
ఈ సినిమాలో ప్రధాన లోపం ఏంటంటే.. ఇది దక్షిణాది ప్రేక్షకులకు ఏ మాత్రం కనెక్ట్ కాని రామాయణం. పేర్లతో సహా కేవలం ఉత్తరాది వారి కథలే కనిపిస్తాయి. ఎక్కడా ఒక్క చిన్న ఎమోషన్ కనెక్ట్ కాదు. ఇంకా చెబితే అసలు ఎమోషన్సే లేవు ఈ సినిమాలో. తెరంగా గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ తో నింపేశారు. పోనీ అవేమైనా క్వాలిటీగా ఉన్నాయంటే అత్యంత నాసిరకంగా ఉన్నాయి. కొన్ని సీన్స్ లో ప్రభాస్ ను చూస్తే ఈయన రాముడా లేక పరశురాముడా అనిపించక మానదు. అలా ఉన్నాడు.

ఇక రావణ పాత్రను దారుణంగా మార్చారు. అతను రావణుడిలా కాక ఇప్పుడు దేశంలో కొందరికి విలన్స్ గా కనిపిస్తున్న మరో వర్గం వ్యక్తులకు ప్రతినిధిలా కనిపిస్తే ఆశ్చర్యం లేదు. నిజానికి ఏ రామాయణంలో చూసినా రావణుడు అందగాడు అనే ఉంటుంది. కేవలం తన వక్రబుద్ధివల్లే రామాయణం జరిగింది తప్ప. రాజుగా రావణుడు అత్యంత గొప్పవాడు. పరాక్రమవంతుడుగానే చదివాం. అలాంటి వ్యక్తిని అవెంజర్స్ అనే హాలీవుడ్ మూవీలో థోర్ లా మార్చారు.


రాముడుగా ప్రభాస్ ఏ మాత్రం నప్పలేదు. ఆయన ఆజానుబాహుడే. కానీ రాముడు ఎంతటి పరాక్రమవంతుడో అంతటి సుకుమారుడు. ఎంతటి బలశాలో అందటి అందగాడు. బట్ ప్రభాస్ లో రాముడు కంటే అమరేంద్ర బాహుబలే ఎక్కువగా కనిపించాడు. ప్రభాస్ తో పాటు సైఫ్ అలీఖాన్ కు సంబంధించిన కొన్ని సీన్స్ చూస్తే వీటిని వారు లేకుండానే మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తీశారు అని స్పష్టగా తెలుస్తుంది. ఈ విషయంలో దర్శకుడితో పాటు నిర్మాతల నిర్ణయాన్ని ఖచ్చితంగా ఖండించాల్సిందే.

ఇక సీతగా కృతి సనన్ ఆ పాత్రలో ఒదిగిపోయింది. తను ప్రభాస్ చెప్పినట్టుగా బాగా చేసింది. కానీ ఆ పాత్రకు ఉన్న ఎమోషన్స్ ను దర్శకుడు అస్సలు పట్టించుకోలేదు.

ఇక లక్ష్మణ పాత్రధారి సింగిల్ ఎక్స్ ప్రెషన్ లో లాగించాడు. ఉన్నంతో సైఫ్ అలీఖాన్ మెప్పించాడు. కానీ ఆ పాత్ర తీరు అది కాదు. ఆ రావణుడి వేషమూ అది కాదు.
టెక్నికల్ గా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు బావున్నాయి. సినిమాటోగ్రఫీ బావుంది. ఎడిటింగ్ పరంగా చూస్తే చాలా స్లోగా ఉంది కథనం. ప్రొడక్షన్ వాల్యూస్ ఎంత పూర్ గా ఉన్నాయో ఈ మూవీ గ్రాఫిక్స్ చూస్తే అర్థం అవుతుంది. దర్శకుడుగా ప్రభాస్ షాట్స్ పై పెట్టిన శ్రద్ధ కథపై పెట్టలేదు. ప్రస్తుతం కొంతమంది ఎమోషన్స్ ను పట్టించుకున్నట్టుగా పాత్రలు, ఈ గాథతో ప్రేక్షకులకు ఉండే ఎమోషన్ ను ఏ మాత్రం పట్టించుకోలేదు అని స్పష్టంగా తెలుస్తోంది. ఏదేమైనా ఆదిపురుష్ అస్సలే మాత్రం మెప్పించలేకపోయిన సినిమా అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అది పూర్తిగా దర్శకుడి తప్పిదమే తప్ప మరోటి కాదు.

రామాయణం భారత ఇతిహాసాల్లోనే ఓ గొప్ప కావ్యంగా ఖ్యాతితెచ్చుకుంది. అందుకే అది మతంగా మారి భారత్ లో విరాజిల్లుతోంది. అలాంటి కథలు చెబుతున్నప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. ఈ విషయంలో ఓమ్ రౌత్ అవేం పట్టించుకోలేదు. ఎంత సేపూ జై శ్రీరామ్ అనిపించడమే లక్ష్యంగా స్క్రీన్ ప్లే రాసుకున్నట్టు కనిపిస్తుంది. ఎలా చూసినా ఆది పురుష్‌ దక్షిణాది ప్రేక్షకులకు నచ్చుతుంది అనుకోలేం. దారుణమై గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ వల్ల అసలు కథ కనెక్ట్ కాదు. నార్త్ వారిని మెప్పిస్తుందాఅంటే అదీ డౌటే అనుకోవచ్చు. మనకు సీతారాములు, నార్త్ వారికి రాఘవ జానకి ఓ ఎమోషన్. అత్యంత పవిత్రమైన జంటగా కొలుస్తారు. తలుస్తారు. అలాంటి వారి గాథను అస్సలే మాత్రం సహజత్వం లేకుండా అత్యంత పేలవంగా చెప్పాడు ఓమ్ రౌత్.

ఫైనల్ గా ఆది పురుష్‌ : పూర్ గ్రాఫిక్స్ అండ్ విఎఫ్ఎక్స్, లెస్ ఎమోషన్స్, హై యాక్షన్ సీన్స్

                - బాబురావు. కామళ్ల

Related Posts