తారాగణం : అశ్విన్ బాబు, నందిత శ్వేత, మకరన్ దేశ్ పాండే, రఘు కుంచె, రాజీవ్ కనకాల, శ్రీనివాస రెడ్డి తదితరులు
ఎడిటింగ్ : ఎమ్ఆర్ వర్మ
సంగీతం : వికాస్ బాడిస
సినిమాటోగ్రఫీ : రాజశేఖర్
నిర్మాత : శ్రీధర్ గంగపట్నం
రచన, దర్శకత్వం : అనీల్ కన్నెగంటి
రిలీజ్ డేట్ : 20.07.2023

టివిషోస్ ద్వారా యాంకర్ గా తిరుగులేని పాపులారిటీ తెచ్చుకున్నాడు ఓంకార్.

ఈ పాపులారిటీతోనే దర్శకుడూ అయ్యాడు. అతని తమ్ముడుగా బుల్లితెర నుంచి వెండితెర వరకూ ఎదిగాడు అశ్విన్ బాబు. అయితే ఇప్పటి వరకూ ఓ సాలిడ్ సక్సెస్ కానీ, మంచి బ్రేక్ కానీ రాలేదు.

బట్ ఫస్ట్ టైమ్ ఫస్ట్ లుక్ నుంచే ఇంప్రెస్ చేస్తూ.. హిడింబ అనే మూవీతో వచ్చాడు. టైటిల్ నుంచి ట్రైలర్ వరకూ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ పాత్ర కోసం అశ్విన్ మేకోవర్ మార్చుకున్నాడు. మంచి ఫిజిక్ తెచ్చుకున్నాడు. గతంలో మిస్టర్ నూకయ్య, అసాధ్యుడు, రన్ వంటి చిత్రాలు డైరెక్ట్ చేసిన అనీల్ కన్నెగంటి ఈ సారి కొత్త కంటెంట్ తో వస్తున్నాడు అనిపించాడు. మొత్తంగా కంప్లీట్ పాజిటివ్ బజ్ తో విడుదలైన హిడింబ ఆ బజ్ ను క్యాష్‌ చేసుకుందా లేదా అనేది చూద్దాం.

కథ :
హైదరాబాద్ సిటీలో వరుసగా అమ్మాయిలు కిడ్నాప్ అవుతుంటారు. కానీ ఏ ఒక్కరినీ పోలీస్ వాళ్లు ట్రేస్ చేయలేకపోతారు. కిడ్నాప్ ల వెనక ఉన్నవాళ్లు ఎవరో కనిపెట్టలేకపోతారు. ఈ కేస్ ను ఏసిపి అభయ్(అశ్విన్ బాబు)కు ఇచ్చినా అతనూ పై అధికారుల తీరు వల్ల కేస్ ను సాల్వ్ చేయలేడు.

దీంతో ఈ తరహా కేస్ లు కేరళలో ఛేదించిన ఆద్య(నందిత శ్వేత) అనే ఐసీఎస్ ఆఫీసర్ ను అపాయింట్ చేస్తారు. అభయ్ ని ఆద్యకు అసిస్ట్ చేయమని చెబుతారు. వీరు గతంలో ట్రెయినింగ్ లో కలుసుకుని ఉంటారు. ప్రేమలోనూ పడతారు. కొన్ని కారణాల వల్ల విడిపోతారు. ఇద్దరూ కలిసి ఎన్నో ప్రయత్నాలు చేసి కేస్ ను ఛేదిస్తారు.

కానీ వీళ్లు కిడ్నాప్ ముఠాను పట్టుకున్న రోజే మరో కిడ్నాప్ జరుగుతుంది. అవి తర్వాత కూడా కొనసాగుతాయి. దీంతో మళ్లీ మొదటికి వస్తుంది. ఈ గ్యాంగ్ ఎవరో తెలుసుకునే క్రమంలో రెడ్ డ్రెస్ అనే పాటర్న్ అర్థం అవుతుంది. ఆ పాటర్న్ వెనక ఇన్వెస్టిగేషన్ చేస్తూ వెళుతున్నా కొద్దీ వారికి ఒళ్లు గగుర్పొడిచే విషయాలు తెలుస్తాయి. ఈ కిడ్నాప్ లు చేసింది ఓ నరమాంస భక్షుకుడు అని అర్థం అవుతుంది. మరి అతనెవరు..? అతని నేపథ్యం ఏంటీ..? ఇన్ని కిడ్నాప్ లు ఎలా చేశాడు.. అతన్ని ఆద్య, అభయ్ కలిసి పట్టుకున్నారా లేదా అనేది మిగతా కథ.

విశ్లేషణ :
ఇప్పటి వరకూ సినిమాను ఇంటర్వెల్ కు ముందు ఇంటర్వెల్ కు తర్వాత అని చూశాం. ఈ రెండు భాగాల్లోనూ ఒకే కథ కనిపిస్తుంది. బట్ హిడింబలో రెండో భాగం నుంచి రెండో కథ మొదలవుతుంది. మొదటి కథలో.. కిడ్నాప్ లు, హత్యలు, ఇన్వెస్టిగేషన్ అనే ప్రాసెస్ అంతా సో సో గా కనిపిస్తుంది. ఈ తరహా కథలు ఇప్పటికే ఎన్నో చూశాం కదా అనిపిస్తుంది.

అయినా కాలాబండా అనే ప్రాంతంలో వచ్చే ఎపిసోడ్ ఒక్కసారిగా మాస్ ఆడియన్స్ కు హై మూమెంట్ ఇస్తుందనే చెప్పాలి. అయినా మొదటి సగాన్ని మరీ ఆసక్తికరంగా ఏం చెప్పలేదు. దీంతో సినిమా గురించి ఒక అంచనాకు వస్తాం. అందుకు తగ్గట్టే సెకండ్ హాఫ్ కు ప్రిపేర్ అవుతాం. బట్ సెకండ్ హాఫ్‌ నుంచి కొత్త కథ స్టార్ట్ చేశాడు దర్శకుడు. దీనికోసం చరిత్రలోకి వెళ్లాడు. చాలామందికి తెలిసిందే అయినా.. ఓ కొత్త తరహా పాయింట్ పట్టుకున్నాడు. ఆ పాయింట్ చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు చాలా వరకూ ఆకట్టుకునేలానే ఉంటాయి. కాకపోతే మితిమీరిన హింస, రక్తం కాస్త ఇబ్బంది పెడుతుంది. కానీ తను ఎంచుకున్న నేపథ్యానికి అది అవసరం.


నరమాంస భక్షకులు అనగానే ఇప్పటి వరకూ హాలీవుడ్ నుంచి డబ్ అయిన సినిమాల్లోనే ఎక్కువగా చూశాం. కానీ ఇండియాలో కూడా అలాంటి వారు ఉన్నారు. వారి పూర్వీకుల నుంచి ఈ తరం వరకూ వాళ్లు ఎలా విస్తరించారు అనే పాయింట్ ను చాలా విశ్లేషణాత్మకంగా చెప్పాలనుకున్నాడు దర్శకుడు. కాకపోతే ఇది మరీ సాగదీతగా ఉంటుంది. ఒకే పాయింట్ ను రెండుసార్లు చెప్పించడం వల్ల అనవసరం కూడా అనిపిస్తుంది. ఈ నరమాంస భక్షకుల గురించి ఇన్వెస్టిగేట్ చేస్తూ కథ కేరళకు వెళుతుంది.ముఖ్యంగా ఆద్య తండ్రి (సిజ్జు) ఎపిసోడ్ ను సుదీర్ఘంగా చూపించారు. ఇక్కడ దర్శకుడు తను చేసిన రీసెర్చ్ ను మరీ వివరంగా చెప్పాలనుకున్నాడు కానీ.. అంత అవసరం లేకుండానే ఆడియన్స్ కు సులభంగా అర్థం అవుతుంది. దీంతో ఈ ఎపిసోడ్ సినిమాకు కొంత మైనస్ అవుతుందే తప్ప ప్లస్ కాదు. అయితే ప్రీ క్లైమాక్స్ దర్శకుడు ఆడియన్స్ కు ఓ భారీ షాక్ ఇచ్చాడు. ఇది ఈ మధ్య కాలంలో వచ్చిన ఓ మంచి ట్విస్ట్ గానే చెప్పాలి. ఊహించగలిగిన వారిని కూడా ఆశ్చర్యపరిచే ట్విస్ట్ ఇది. బట్ మళ్లీ ఫైనల్ షాట్ రొటీన్ గానే ఉంది. అక్కడ ఇంకేదైనా ట్విస్ట్ ఇచ్చి ఉంటే దీనికి సీక్వెల్ కూ అవకాశం ఉండేదే.

ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్‌ యావరేజ్ గా ఉన్నా.. సెకండ్ హాఫ్‌ లో అబౌ యావరేజ్ గా కనిపిస్తుందీ హిడింబ. అయితే సినిమాలో హ్యూమన్ ఆర్గన్ మాఫియా అనే పాయింట్ టచ్ చేశారు కానీ దానికి సరైన ముగింపు ఇవ్వలేదు. దీనివల్ల అసలు విలన్ తనపై సింపతీ వస్తుందనుకుంటే రాలేదు.నటన పరంగా అశ్విన్ బాబు ఒన్ మేన్ షో లా ఉంది.

అతని పై ఆఫీసర్ నందిత అయినా.. అతని డామినేషనే అంతా. యాక్షన్ ఎపిసోడ్స్ లో అయితే అదరగొట్టాడు. ఓ ఎలివేటెడ్ మాస్ హీరో లెవల్లో ఇరగదీశాడు. ఐపీఎస్ ఆఫీసర్ పాత్రకు నందిత సూట్ కాలేదు. ఆమె కటౌట్ మైనస్ అయితే.. ఆహార్యం కూడా అంతంత మాత్రంగా ఉండటంతో ఆ పాత్రకు తగ్గ స్టేచర్ ఆమెలో కనిపించలేదు. ఇతర పాత్రల్లో మకరన్ దేశ్ పాండే భయపెట్టాడు. అతను మాత్రమే చేయదగ్గ పాత్ర ఇది అనిపిస్తుంది. నందిత తండ్రిగా సిజ్జు సెటిల్డ్ గా కనిపించాడు. రాజీవ్ కనకాల, రఘు కుంచెతో పాటు ఇతర పాత్రలన్నీ వెరీ రొటీన్.

టెక్నికల్ గా హిడింబకు అసలు హీరో సంగీత దర్శకుడు. చాలా సాధారణ సన్నివేశాలను కూడా నెక్ట్స్ లెవల్ అనేలా మరిపించాడు. అద్భుతమైన నేపథ్య సంగీతంతో అదరగొట్టాడు. ఓ సిగ్నేచర్ ఆర్ఆర్ కనిపిస్తుంది. ఇలాంటి సినిమాలను ఇవి మరింత బాగా ఎలివేట్ చేస్తాయి. రెండు మూడు పాటలున్నా.. అవి ఆకట్టుకోలేదు. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. రిపీటెడ్ సీన్స్ వల్ల కేవలం 2 గంటల 10 నిమిషాలే ఉన్నా.. సినిమా చాలాసేపు చూసిన ఫీలింగ్ వస్తుంది. ఇంకా ఎడిట్ చేయొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. కాస్ట్యూమ్స్, మేకప్ మెప్పిస్తాయి. ఇక మ్యూజిక్ తర్వాత పెద్ద హైలెట్ ఫైట్స్. అన్ని ఫైట్స్ సూపర్బ్ అనేలా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి.

దర్శకుడు అనీల్ కన్నెగంటి ఎంచుకున్న రెండో నేపథ్యం బావుంది. నరమాంస భక్షకులు అనే మాటే భయంకరంగా ఉంటుంది. దాన్ని ఈ కాలానికీ అన్వయించడం అభినందనీయం. దర్శకుడి ఊహాశక్తికి నిదర్శనం ఇది. కానీ ఇంకాస్త బాగా ఎగ్జిక్యూట్ చేయాల్సింది అనిపిస్తుంది. బట్ ఈ ఏ సెంటర్ ఆడియన్స్ ఈ చిత్రాన్ని భరించడం కష్టమే. బి, సి ఆడియన్స్ కు కనెక్ట్ అయితే హిట్ గ్యారెంటీ.

ప్లస్ పాయింట్స్ :
సెకండ్ హాఫ్‌
నేపథ్య సంగీతం
యాక్షన్ ఎపిసోడ్స్
అశ్విన్
క్లైమాక్స్ ట్విస్ట్

మైనస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్‌
సాంగ్స్
హింస, రక్తపాతం

ఫైనల్ గా : రక్తపాతంతో భయపెట్టిన హిడింబ

రేటింగ్ : 2.5/5

              - బాబురావు. కామళ్ల

Related Posts