రివ్యూ : హత్య
తారాగణం : విజయ్ ఆంటోనీ, రితికా సింగ్, మీనాక్షి చౌదరి, రాధిక, మురళీశర్మ, సిద్ధార్థ్ శంకర్, అర్జున్ చిదంబరం తదితరులు
ఎడిటింగ్ : ఆర్కే సెల్వ
సినిమాటోగ్రఫీ : శివకుమార్ విజయన్
సంగీతం : గిరీష్ గోపాలకృష్ణన్
నిర్మాతలు : కమల్ బోరా, ధనంజయన్ గోవిందన్
దర్శకత్వం : బాలాజీ కుమార్

కథ :
లైలా(మీనాక్షి చౌదరి) ఓ అప్ కమింగ్ మోడల్, సింగర్. ఓ రోజు తన ఇంట్లోనే హత్యకు గురవుతుంది. ఆ కేస్ ను ఛేదించేందుకు కొత్త ఐపీఎస్ ఆఫీసర్ సంధ్య(రితికా సింగ్)ను నియమిస్తారు.తన ఎక్స్ పీరియన్స్ కు ఆ కేస్ లో కాంప్లికేటెడ్ లా కనిపిస్తుంది. దీంతో ఆమె మాజీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వినాయక్(విజయ్ ఆంటోనీ)సాయం తీసకుంటుంది.అతని కూతురు కోమాలో ఉంటుంది. ముందు నో చెప్పినా తర్వాత ఒప్పుకుంటాడు. మరి ఈ ఇద్దరూ కలిసి ఆ కేస్ ను ఛేదించారా..? లైలాను చంపింది ఎవరు..ఎందుకు..? అనేది మిగతా కథ.

విశ్లేషణ :
మర్డర్ మిస్టరీ అంటే ఎప్పుడూ సేఫ్ గానే ఉంటుంది.కాస్త జాగ్రత్తగా స్క్రీన్ ప్లే రాసుకుని.. హంతకుడు గురించి సీక్రెట్ ను మెయిన్టేన్ చేయగలిగితే ఆ క్యూరియాసిటీ వల్ల కొన్ని మైనస్ లు ఉన్నా పట్టించుకోరు. ఈ సినిమా విషయంలో అదే చేశాడు దర్శకుడు బాలాజీ కుమార్. బట్ ఈ తరంలో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ అనగానే కథనం పరుగులు పెడుతుంది. ఈ విషయంలో హత్య సినిమా కాస్త .. కాదు.. చాలా నెమ్మదిగా సాగుతుంది. అయినా ఎంగేజ్ చేస్తుంది. అందుకు కారణం దర్శకత్వ ప్రతిభ. ఈ చిత్రాన్ని నాన్ లీనియర్( ముందు, వెనకా సాగే సన్నివేశాలు) స్క్రీన్ ప్లేలో చెప్పాడు బాలాజీ. దీంతో మనకు హత్యకు గురైన లైలానే ఈ కథ చెబుతున్నట్టుగా మొదలుపెడతాడు. ఇది కాస్త కొత్తగా ఉంటుంది.


సంధ్య, వినాయక్ లైలా జీవితంలో ఎవరున్నారు అనే కోణంలో విచారణ మొదలుపెడతారు.ముందు బాయ్‌ఫ్రెండ్, మోడలింగ్ ఏజెంట్, ఫోటోగ్రాఫర్‌తో సహా కొంతమందిని గుర్తించి అనుమానిస్తారు. ఆ కోణంలో ఇన్వెస్టిగేషన్ సాగుతున్నప్పుడు వీరిలో హంతకుడు ఎవరా అనే క్యూరియాసిటీ ఉంటుంది.పైగా కథనం ముందుకు, వెనకకు సాగుతూ ఉండటం వల్ల ఆ డీటెయిలింగ్ అంతా బాగా రాసుకున్నాడు దర్శకుడు. మెడలింగ్ ఏజెన్సీల్లోఉండే వేధింపులే కాకుండా బిజినెస్ యాంగిల్ లో కనిపించే ఒత్తిడిలు కూడా బాగా చూపించాడు. అంటే లైలాకు ఓ ఇంటర్నేషనల్ బ్రాండ్ కు అంబాసిడర్ గా అవకాశం వస్తుంది. కాంట్రాక్ట్ పై సైన్ చేయించమని ఏజెన్సీ హెడ్(రాధిక) చెబుతుంది. అతను ఆ కాంట్రాక్ట్ ను చూపించి తన కోరిక తీర్చమంటాడు. అందుకు లైలా ఒప్పుకోదు. కానీ ఎలాగైనా లైలాతో కాంట్రాక్ట్ చేయించకపోతే అతని లైఫ్ నే నాశనం చేస్తా అని ఏజెన్సీ హెడ్ బెదిరిస్తుంది. అంటే ఏజెంట్స్ కుట్రలతో పాటు ఏజెన్సీల నిజాయితీ కూడా కనిపిస్తుంది. ఇక ఆమె లైఫ్ లో ఒక బాయ్ ఫ్రెండ్, ఫోటోగ్రాఫర్ తో పాటు మరో చిన్న కుర్రాడు కూడా ఉంటాడు. ఈ మొత్తం కథలో అసలు హంతకుడిని పోలీస్ లకు తెలిసినా అరెస్ట్ చేయలేరు.కానీ అతన్ని విధి చంపుతుంది అనే జస్టిఫికేషన్ ఇచ్చారు.ఇది కాస్త ఇబ్బందిగా ఉన్నా.. దాన్ని విజయ్ ఆంటోనీ పర్సనల్ లైఫ్ లాస్ కు ముడిపెట్టి చూపడం దర్శకుడి తెలివిని చూపుతుంది.

కాస్త స్లో నెరేషన్ ఉన్నా.. రిచ్ విజువల్స్‌తో డీసెంట్‌గా రూపొందించిన ఈ మర్డర్ మిస్టరీ.. థ్రిల్లర్‌ను ఇష్టపడే వారికి కొత్త ఫీలింగ్ ఇస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాకు వాడిన కలరింగ్ ఓ డిఫరెంట్ మూడ్ ను క్రియేట్ చేస్తుంది. షాట్స్, గ్రాఫిక్స్ మెస్మరైజ్ చేస్తాయి.హత్యకు సంబంధించి ఒక్కో పాయింట్ రివీల్ అవుతున్నప్పుడు దానికి ఇంటర్ లింక్ గా మరో కథ మొదలవుతుంది. ఇది ఖచ్చితంగా ఇక్కడ కొత్త ప్రయోగమే. ఆ ప్రయోగం అర్థమైన వారికి ఈ సినిమా నచ్చుతుంది. లేదంటే కొంత ఇబ్బంది పడతారు.
నటన పరంగా తక్కువ పాత్రలే ఉన్నాయి. విజయ్ ఆంటోనీ మాజీ ఆఫీసర్ గా బాగా సెట్ అయ్యాడు. రితికా సింగ్ కొత్త ఐపీఎస్ ఆఫీసర్ గా ఫిట్ అయిపోయింది. ఇతర పాత్రల్లో జాన్ విజయ్, మురళీ శర్మ, అర్జున్ చిదంబరం, సిద్ధార్థ్ శంకర్ బాగా చేశారు. ఇక లైలాగా మీనాక్షీ చౌదరి పాత్రకు తగ్గట్టుగా ఒదిగిపోయింది. ఈ మూవీలో ఎక్స్ ప్రెషన్స్ కంటే యాక్షన్ కే ఎక్కువ ప్రాధాన్యం ఉంది. దీంతో కళ్లకంటే బాడీ లాంగ్వేజ్ ఎలివేట్ అవుతుంది.

టెక్నికల్ గా చాలా బ్రిలియంట్ గా ఉందీ మూవీ. సినిమాటోగ్రఫీ హైలెట్, లైటింగ్, డిఐ అదిరిపోయాయి. సినిమాకు ఓ మంచి మూడ్ ను క్రియేట్ చేసేది ఈ సినిమాటోగ్రఫీయే. పాటలు తెలుగులో బాలేదు. కానీ తమిళ్ లోఆకట్టుకునే అవకాశాలున్నాయి. నేపథ్య సంగీతం కొత్తగా ఉంటుంది. ఎడిటింగ్ పరంగా ముందే చెప్పినట్టు సాగదీత సన్నివేశాలు అక్కర్లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బావున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ దర్శకుడి ఊహాశక్తిని ప్రతిబింబించే విధంగా ఉన్నాయి. దర్శకుడుగా బాలాజీ కుమార్.. మర్డర్ మిస్టరీ అనే రొటీన్ పాయింట్ ను తీసుకున్నా.. దాన్ని ఇప్పుడు మనం చూస్తోన్న మిస్టీరియస్ మూవీస్ స్క్రీన్ ప్లేకు పూర్తి భిన్నంగా రాసుకుని ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కాకపోతే స్లో నెరేషన్ తో పాటు టైటిల్ ఈ సినిమాకు పెద్ద మైనస్. మరి ఈ మైనస్ లను ఈ మూవీ ఎలా అధిగమిస్తుందో చూడాలి.

ఫైనల్ గా : ఆకట్టుకునే సస్పెన్స్, మిస్టరీ

రేటింగ్ : 2.5/5

                - బాబురావు. కామళ్ల

Related Posts