రఘుబాబు కారు ఢీకొని బీఆర్‌ఎస్‌ నాయకుడు మృతి.. ఏమైందంటే?

ప్రముఖ హాస్యనటుడు రఘుబాబు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో భారత రాష్ట్ర సమితి నాయకుడు మృతి చెందడం విషాదంగా మారింది. ప్రస్తుతం ప్రమాదానికి సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి.

నల్గొండ టూటౌన్‌ ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ పట్టణంలోని శ్రీనగర్‌ కాలనీకి చెందిన భారాస పట్టణ కార్యదర్శి సందినేని జనార్దన్‌రావు సమీపంలోని లెప్రసీకాలనీ ప్రాంతంలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రం వద్దకు బుధవారం సాయంత్రం వాకింగ్‌ కోసం పానగల్‌ బైపాస్‌ మీదుగా ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. వ్యవసాయ క్షేత్రం వద్ద యూటర్న్‌ తీసుకుంటున్న క్రమంలో హైదరాబాద్‌ నుంచి గుంటూరుకు కారును స్వయంగా నడుపుతూ వెళ్తున్న రఘుబాబు.. వెనక నుంచి ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టారు. దీంతో జనార్దన్‌రావు ఎగిరి డివైడర్‌ మీద పడ్డారు. తల, ఛాతి భాగంలో బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. ఆయనకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. జనార్దన్‌రావు భార్య నాగమణి ఫిర్యాదుతో రఘుబాబును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.

రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ నేత మరణించారనే విషయం తెలుసుకొన్న పార్టీ కార్యకర్తలు, గ్రామస్థులు అక్కడికి భారీగా చేరుకొన్నారు. అనంతరం రఘుబాబుకి వ్యక్తిగత పూచీకత్తుపై షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసినట్లు సీఐ డానియేల్‌ తెలిపారు.

Related Posts