వెంకటేష్ ప్రేమకథా చిత్రానికి పాతికేళ్లు

తెలుగు చిత్ర పరిశ్రమలో విక్టరీనే ఇంటిపేరుగా మార్చుకున్న కథానాయకుడు వెంకటేష్. 90లలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో మాస్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ లో సెపరేటు క్రేజ్ ఏర్పరచుకున్నాడు వెంకీ. తన చిత్రాలతో కొన్నిసార్లు హ్యాట్రిక్, మరికొన్ని సార్లు డబుల్ హ్యాట్రిక్ హిట్స్ తో అప్పట్లో వెంకీ క్రేజ్ మామూలుగా ఉండేది కాదు. ఇక.. ఒకవైపు సీరియస్ మూవీస్ చేస్తూనే.. మరోవైపు ప్రేమకథా చిత్రాల్లోనూ నటిస్తూ తన ప్రత్యేకతను చాటుకున్నాడు వెంకటేష్. ఈకోవలోనే వెంకటేష్ నటించిన ప్రేమకథా చిత్రం ‘ప్రేమంటే ఇదేరా‘. అక్టోబర్ 30, 1998వ సంవత్సరంలో ‘ప్రేమంటే ఇదేరా‘ సినిమా విడుదలైంది.

అంతకుముందు వెంకటేష్ హీరోగా ‘ప్రేమించుకుందాం రా‘ వంటి సూపర్ హిట్ అందించిన జయంత్ సి.పరాన్జీ ఈ సినిమాకి దర్శకుడు. బూరుగుపల్లి శివరామకృష్ణ, కె.అశోక్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. ధీన్ రాజ్ కథ అందించగా.. పరుచూరి బ్రదర్స్ మాటలు సమకూర్చారు. కథ, కథనాలతో పాటు ‘ప్రేమంటే ఇదేరా‘ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించినవి పాటలు. రమణ గోగుల స్వరపర్చిన ఈ చిత్రంలోని పాటలన్నీ సూపర్ హిట్. ముఖ్యంగా ‘నైజాం బాబులు‘ సాంగ్ అప్పట్లో ఓ ఊపు ఊపేసింది.

అప్పటికే మణిరత్నం హిందీలో తీసిన ‘దిల్ సే‘ సినిమాలో సెకండ్ లీడ్ లో నటించిన ప్రీతి జింటా ను కథానాయికగా పరిచయం చేసిన చిత్రం ‘ప్రేమంటే ఇదేరా‘. ఈ సినిమా తర్వాతే తెలుగులో మహేష్ బాబు మొదటి చిత్రం ‘రాజకుమారుడు‘లో హీరోయిన్ గా నటించింది ప్రీతి జింటా. శ్రీహరి, సత్యనారాయణ, రంగనాథ్, లక్ష్మీ, గిరిబాబు, చంద్రమోహన్, రమాప్రభ, బ్రహ్మానందం, ఆలీ ఇతర కీలక పాత్రలు పోషించారు.

Related Posts