ఈవారం థియేటర్లలో సినిమాల సందడి

వారం వారం థియేటర్లలో కొత్త సినిమాల సందడి కొనసాగుతూనే ఉంది. ఈ వారం ఉగాది, రంజాన్ పర్వదినాలు కలిసి రావడం.. సమ్మర్ సీజన్ స్టార్ట్ అవ్వడంతో థియేటర్లలో సినిమాల సందడి మామూలుగా లేదు. చిన్నా, చితకా చిత్రాలన్నీ వరుసగా సినిమా హాళ్లకు క్యూ కడుతున్నాయి.

ఈ వారం థియేటర్లలోకి వస్తోన్న చిత్రాలలో ముందుగా చెప్పుకోవాల్సింది ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. సూపర్ హిట్ ‘గీతాంజలి’కి సీక్వెల్ గా రూపొందిన చిత్రమిది. పైగా.. అంజలి కెరీర్ లో 50వ చిత్రం. కోన వెంకట్ నిర్మాణంలో రూపొందిన ఈ సీక్వెల్ మొదటి భాగానికి మించిన రీతిలో డబుల్ డోస్ ఫన్ తో పాటు.. హారర్ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ కు మంచి ఎంటర్ టైన్ మెంట్ పంచుతుందని చిత్రబృందం కాన్ఫిడెంట్ గా చెబుతోంది. టైటిల్ రోల్ లో అంజలి కనిపించబోతున్న ఈ మూవీలో శ్రీనివాస్ రెడ్డి, సునీల్, సత్యం రాజేష్, సత్య, ఆలీ, రవిశంకర్, షకలక శంకర్ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి శివ తుర్లపాటి దర్శకుడు. ఏప్రిల్ 11న ‘గీతాంజలి మళ్లీ వచ్చింది‘ విడుదలకు ముస్తాబవుతోంది.

ఈవారం థియేటర్లలోకి వస్తోన్న చిత్రాలలో సుహాస్‌, కార్తీక్‌ర‌త్నం,రుహానిశ‌ర్మ‌, విరాజ్ అశ్విన్‌ ముఖ్య‌తార‌లుగా రూపొందిన ‘శ్రీ‌రంగనీతులు’ కూడా ఉంది. ప్ర‌వీణ్‌కుమార్ వీఎస్ఎస్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. రాధావి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాని ప్ర‌ముఖ పంపిణీదారుడు, నిర్మాత ధీర‌జ్ మొగిలినేని ప్ర‌పంచవ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు.

తెలుగు నుంచి రాబోతున్న చిత్రాలలో ‘రోటీ కపడా రొమాన్స్, మెర్సి కిల్లింగ్’ వంటివి కూడా ఈ వారం లిస్టులో ఉన్నాయి. అయితే.. తెలుగుతో పాటు తమిళ అనువాదాలు ఈ వారం థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. వీటిలో ముందుగా చెప్పుకోవాల్సింది ‘లవ్ గురు’. పలు అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన చిత్రమిది. ఈ సినిమాలో విజయ్ ఆంటోని రొమాంటిక్ అవతార్ లో అలరించబోతున్నాడు. అతనికి జోడీగా మృణాళిని రవి నటించింది. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ విడుదల చేస్తుంది.

ప్రముఖ సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ కుమార్ హీరోగానూ దుమ్మురేపుతుంటాడు. ఈ టాలెంటెడ్ మ్యూజిషియన్ కమ్ హీరో నటించిన లేటెస్ట్ మూవీ ‘డియర్’. ఈ సినిమాలో జి.వి.ప్రకాష్ కి జోడీగా ఐశ్వర్య రాజేష్ నటించింది. ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఏప్రిల్ 12న విడుదలకు ముస్తాబవుతోంది.

మరోవైపు.. హిందీ నుంచి కూడా రెండు సినిమాలు ఈ వారం థియేటర్లలోకి వస్తున్నాయి. అవే.. అజయ్ దేవగణ్ ‘మైదాన్’, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ‘బడే మియా చోటే మియా’. ఈద్ కానుకగా ‘మైదాన్’ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వస్తే.. అక్షయ్, టైగర్ మల్టీస్టారర్ ‘బడే మియా చోటే మియా’ రేపు విడుదలవుతోంది. ‘బడే మియా చోటే మియా’ మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా కనిపించబోతుండడం విశేషం.

Related Posts