మెప్పిస్తున్న ‘మార్టిన్ లూథర్ కింగ్‘ ట్రైలర్

రెండేళ్ల క్రితం తమిళం నుంచి వచ్చిన ‘మండేలా‘ చిత్రం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. కమెయడిన్ యోగిబాబు హీరోగా రూపొందిన ఈ పొలిటికల్ సెటైరికల్ డ్రామా.. డైరెక్ట్ ఓటీటీ లో రిలీజై పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. గ్రామ పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో ఎంతో అద్భుతంగా ఈ సినిమాని తెరకెక్కించాడు మడోన్ అశ్విన్. ఇప్పుడు ఇదే సినిమా తెలుగులో సంపూర్ణేష్ బాబు హీరోగా ‘మార్టిన్ లూథర్ కింగ్‘ పేరుతో రీమేక్ అయ్యింది.

ఒరిజినల్ ని ప్రొడ్యూస్ చేసిన వైనాట్ స్టూడియోస్ నుంచే ఈ చిత్రం వస్తోంది. పూజా అపర్ణా కొల్లూరు ఈ సినిమాకి డైరెక్టర్. సంపూర్ణేష్ బాబు టైటిల్ రోల్ లో కనిపించబోతున్న ఈ మూవీలో నరేష్, శరణ్య ప్రదీప్, వెంకటేష్ మహా ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. అక్టోబర్ 27 నుంచి థియేటర్లలో సందడి చేయబోతున్న ‘మార్టిన్ లూథర్ కింగ్‘ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

గ్రామ పంచాయితీ ఎన్నికల నుంచి ఎమ్.పి. ఎలక్షన్స్ వరకూ ఎన్నికలు వస్తున్నాయంటే చాలు రాజకీయ నాయకులు చేసే హడావుడి ఎలా ఉంటుందన్నది తెలిసిందే. వారు గుప్పించే హామీలు.. పంచే డబ్బులు.. ఇతివృత్తంగా ఆద్యంతం హాస్య భరితంగా ఈ సినిమాని రూపొందించినట్టు ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. ఒక గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు వస్తాయి. కులాల వారీగా ఊరు ఊరంతా రెండుగా చీలిపోతుంది. రెండు పార్టీలకు సమానంగా ఓట్లు ఉంటాయి. అలాంటి సమయంలో.. వారికి ఒకే ఒక ఓటు అవసరమవుతోంది. ఆ ఓటు ‘మార్టిన్ లూథర్ కింగ్‘ది అయితే. ట్రైలర్ అయితే ఆద్యంతం మెప్పిస్తుంది. మరి.. తమిళ చిత్రం ‘మండేలా‘ తరహాలోనే ‘మార్టిన్ లూథర్ కింగ్‘ కూడా మంచి విజయాన్ని సాధిస్తుందేమో చూడాలి.

Related Posts