ఈ వారం థియేటర్లలో చిన్న సినిమాల సందడి

వారం వారం థియేటర్లలో కొత్త సినిమాల సందడి కొనసాగుతూనే ఉంది. సంక్రాంతి సీజన్ తర్వాత రిపబ్లిక్ డే కానుకగా పలు అనువాద సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తే.. ఈ వారం మాత్రం దాదాపు ఎనిమిది తెలుగు సినిమాలు థియేటర్లలకు క్యూ కడుతున్నాయి. ఇవన్నీ చిన్న చిత్రాలు కావడం ఓ విశేషం.

ఈ వారం రాబోతున్న చిత్రాలలో మంచి అంచనాలున్న మూవీ ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు‘. సుహాస్ హీరోగా దుశ్యంత్ కటికనేని తెరకెక్కించిన ఈ చిత్రంపై పాజిటివ్ బజ్ ఉంది. గీతా ఆర్ట్స్ వంటి పెద్ద బ్యానర్ అండదండలతో రాబోతున్న ఈ సినిమా ప్రచార చిత్రాలకు మంచి పేరొచ్చింది. ఈ వారం హాట్ ఫేవరెట్ గా రంగంలోకి దిగుతోన్న ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు‘ మూవీకోసం స్పెషల్ పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల ‘హనుమాన్‘ వంటి సినిమాల విషయంలో పెయిడ్ ప్రీమియర్స్ బాగా కలిసొచ్చాయి.

ఈ వారం వస్తోన్న చిత్రాల్లో సోహెల్ ‘బూట్ కట్ బాలరాజు‘ మరొకటి. హీరోగానే కాకుండా ఈ సినిమాతో నిర్మాతగానూ తన లక్ ను పరీక్షించుకోబోతున్నాడు. ‘బిగ్ బాస్‘తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న సోహెల్ కి ‘బూట్ కట్ బాలరాజు‘ చాలా కీలకంగా మారింది. ఇంకా.. ‘ధీర, మెకానిక్, గేమ్ ఆన్, కిస్మత, హ్యాపీ ఎండింగ్‘ వంటి మరో అరడజను సినిమాలు ఈ వారం థియేటర్లలో సందడి చేయబోతున్నాయి.

Related Posts