మరోసారి కలిసి నటించనున్న కాబోయే వధూవరులు

‘రాజావారు రాణిగారు’ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించిన కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ త్వరలో వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ జంట నిశ్చితార్థం కూడా పూర్తయ్యింది. త్వరలో వీరిద్దరూ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటారనే ప్రచారం జరుగుతుంది. ఇదిలావుంటే.. పెళ్లికి ముందో తర్వాతో కానీ.. మరోసారి కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ కలిసి నటించనున్నారట.

వీరి రహస్య ప్రేమాయణం మొదలైనప్పుడే మనమిద్దరం కలిసి మరో సినిమా చేద్దామని ప్రేయసి రహస్యతో మాట తీసుకున్నాడట కిరణ్ అబ్బవరం. అలాగే.. వీరిద్దరూ నటించే చిత్రానికి కిరణ్ అబ్బవరం స్వయంగా కథ సమకూరుస్తున్నాడట. త్వరలోనే ఆ సినిమాకి సంబంధించిన విషయాలను వెల్లడించనున్నట్టు ఇటీవల ఓ ఇంటర్యూలో తెలిపాడు కిరణ్ అబ్బవరం.

కెరీర్ పరంగా చూస్తే కిరణ్ అబ్బవరం ప్రస్తుతం ‘దిల్ రూబా’ సినిమాతో పాటు 1970వ దశకం నేపథ్యంతో సాగే ఓ పీరియాడిక్ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రాల పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తారు. మరోవైపు రహస్య ‘రాజావారు రాణిగారు’ తర్వాత సినిమాలపై ఎక్కువ ఆసక్తి చూపించలేదు. మరి.. త్వరలోనే కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ నటించే సినిమాపై అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.

Related Posts