ఆకట్టుకునే కాన్సెప్ట్ తో సోలో ఆఫ్ సత్య

సాయితేజ్, స్వాతిరెడ్డి ప్రధాన పాత్రల్లో రూపొందిన వీడియో సాంగ్ “సోల్ ఆఫ్ సత్య”.దిల్ రాజు వారసులు హర్షిత్, హన్సిత నిర్మించిన ఈ సాంగ్ ప్రోమోగానే ఆసక్తిని రేకెత్తించింది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా విడుదల చేసిన ఈ పాట ఆకట్టుకుంటోంది.

ఒక చిన్న కాన్సెప్ట్ తో బలమైన సందేశాన్ని మేళవించారు. చిన్నతనం నుంచి కాబోయే వాడి కోసం కలలు కంటూ ఎలాంటి వాడు వస్తాడో అనుకుంటూ పెరిగిన ఓ అమ్మాయి.. పెళ్లి తర్వాత అత్తింటికి వెళుతుంది.మెల్లగా భర్తతో కలిసిపోతూ.. మంచి బంధంగా మారిపోతుంది. ఓ రోజు తన భర్తను అడుగుతుంది.. “నిన్నొకటి అడగనా సూర్య.. నీకసలు కోరికలేం లేవా..” అని.. దానికి “మన పిల్లలతో నేనూ ఓ పిల్లాడిలా మారిపోయి ఆడుకోవాలి.మనం పడ్డ కష్టాలు వాళ్లు పడకూడదు సత్యా.. నాకు అంతకన్నా ఇంకేం కావాలి చెప్పు” అంటాడు.అంతలోనే ఆర్మీలో పనిచేసే అతను దేశ రక్షణ కోసం యుద్ధభూమిలో అడుగుపెడతాడు. ఇటు భార్య నిండు గర్భిణిగా ఉంటుంది. అతను యుద్ధ క్షేత్రంలో శతృవులతో తలపడుతుంటే ఇక్కడ హాస్పిటల్ లో ఆమె పురిటి నొప్పులతో ఓ బిడ్డకు జన్మనిచ్చేందుకు యుద్ధం చేస్తుంది. అతను గెలుస్తాడు. ఆమె గెలుస్తుంది. కానీ వీరిత్యాగానికి గుర్తింపు ఉందా.. అంటే లేదు అనే చెప్పాలి. ఆ విషయాన్నే ఓ అందమైన పాటలో అద్భుతంగా, ప్రభావవంతంగా చెప్పింది దర్శకురాలు శృతి రంజని.


ఈ కాన్సెప్ట్ లో నటించేందుకు ఒప్పుకున్న సాయితేజ్ కు స్వాతిరెడ్డికి కంగ్రాట్స్ చెప్పాల్సిందే. మామూలుగా ఇలాంటి వాటిలో యాక్ట్ చేయడానికి స్టార్స్ అంతగా ఇంట్రెస్ట్ చూపించరు. బట్ వీరు ఒప్పుకుని.. ఆ కాన్సెప్ట్ కు అదనపు బలంగా నిలిచారు. ఏదేమైనా సరిహద్దుల్లో సైనికుడే కాదు.. అతనితో జీవితాన్ని కలలు కన్న అతని కుటుంబం చేసేది కూడా త్యాగమే.ఆ త్యాగానికీ గుర్తింపు కావాలని చెప్పడమే ఈ సోల్ ఆఫ్ సత్య లక్ష్యంలా ఉంది.

Related Posts