సితార లైనప్ మామూలుగా లేదు!

హారిక అండ్ హాసినికి అనుబంధ సంస్థగా మొదలైన సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఇప్పుడు తెలుగులో ఒన్ ఆఫ్ ది లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్. చిన్న హీరోలు మొదలుకొని.. అగ్ర కథానాయకుల వరకూ వరుస సినిమాలను లైన్లో పెడుతోంది. సితారకి తోడు త్రివిక్రమ్ కు చెందిన ఫార్చూన్ ఫోర్ సినిమాస్ కూడా ఇందులో భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం సితార నుంచి వస్తోన్న లైనప్ మామూలుగా లేదు.

ఇటీవలే ‘డీజే టిల్లు’ సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’తో సూపర్ హిట్ ను తమ ఖాతాలో వేసుకుంది సితార సంస్థ. ఇక.. మే నెలలో విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ విడుదలకు ముస్తాబవుతోంది. ఇంకా.. దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’, గౌతమ్ తిన్ననూరి ‘మ్యాజిక్’ వంటి సినిమాలు అండర్ ప్రొడక్షన్ లో ఉన్నాయి.

సితార నుంచి రాబోతున్న పెద్ద చిత్రాలలో ‘ఎన్.బి.కె. 109’ ఒకటి. నటసింహం బాలకృష్ణ-బాబీ కాంబినేషన్ లో రూపొందుతోన్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇటీవల విడుదలైన స్పెషల్ గ్లింప్స్ ఆ అంచనాలను మరింత రెట్టింపు చేసింది. ఈ సినిమా టైటిల్, ఇందులో నటించే హీరోయిన్ పై త్వరలోనే క్లారిటీ ఇవ్వనుందట సితార ఎంటర్ టైన్ మెంట్స్.

సాయి దుర్గా తేజ్-సంపత్ నంది ‘గాంజా శంకర్’, విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్స్ సితారలో అనౌన్స్ అయ్యాయి. ‘గాంజా శంకర్’ నుంచి స్పెషల్ గ్లింప్స్ కూడా వచ్చింది. అయితే.. ఈ సినిమాల ప్రోగ్రెస్ కి సంబంధించి ఇంకా అప్డేట్స్ రావాల్సి ఉంది. అలాగే.. ‘డీజే టిల్లు’లో మూడో భాగం ‘టిల్లు క్యూబ్’, ‘మ్యాడ్’ సీక్వెల్ ‘మ్యాడ్ మ్యాక్స్’లకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తవుతోందట.

ఇంకా.. సితార లిస్ట్ లో అశోక్ గల్లా చిత్రమొకటి, మాస్ మహారాజ రవితేజ, రుక్మీణీ వసంత్ కలిసి నటించే సినిమా కూడా ఉంది. మొత్తంమీద.. దాదాపు పది సినిమాలతో సితార సంస్థ ఇప్పుడు టాలీవుడ్ లో ఓ రేంజులో దూసుకెళ్తుంది.

Related Posts