సెకండ్ సాంగ్ జాణవులే ఓకే ‘బ్రో’

పవన్ కళ్యాణ్‌, సాయితేజ్ హీరోలుగా ఫస్ట్ టైమ్ నటించిన సినిమా బ్రో. సముద్రఖని దర్శకత్వంలో డిఫరెంట్ పాయింట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఈ నెల 28న విడుదల కాబోతోంది. పవన్ తో పాటు ప్రియా ప్రకాష్‌ వారియర్ నటించగా.. సాయితేజ్ సరసన కేతిక శర్మ నటించింది. ఈ మూవీపై ప్రస్తుతం భారీ అంచనాలున్నాయి.

పైగా గోపాలా గోపాలా తర్వాత పవన్ కళ్యాణ్ దేవుడుగా నటించిన సినిమా కావడంతో అభిమానుల్లో ఓ రకమైన క్యూరియాసిటీ ఉంది. దీనికి తోడు ఇప్పటి వరకూ మనకు నటుడుగానే తెలిసిన సముద్రఖని డైరెక్ట్ చేయడంతో ఆసక్తిగానూ చూస్తున్నారు. అఫ్‌ కోర్స్ తెలుగుకు తగ్గట్టుగా స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ను ఇచ్చింది త్రివిక్రమ్ శ్రీనివాస్.

ఇక ఆ మధ్య విడుదల చేసిన టీజర్ కు మంచి స్పందన వచ్చింది కానీ.. మై డియర్ మార్కండేయ పాట మాత్రం తేలిపోయింది. ఈ విషయంలో సంగీత దర్శకుడు తమన్ పై చాలా విమర్శలు కూడా వచ్చాయి. అయితే కథ డిమాండ్ మేరకే ట్యూన్ ఉంటుందని చెప్పిన తమన్ లేటెస్ట్ గా మరో పాటతో వచ్చాడు.

సాయితేజ్, కేతిక శర్మ డ్యూయొట్ లా ఉన్న ఈ పాటను తమన్ తో పాటు ప్రణతి పాడింది. జాణవులే అనే పాటకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆదిత్య 369లో ఈ పదంతో సాగే పాటకు నేటికీ అభిమానులున్నారు. బట్ బ్రో సినిమలోని ఈ మాటను ఆ పాటతో పోల్చినప్పుడు ఖూనీ చేశారు అనిపించినా.. ఓవరాల్ గా పాట ఓకే అనేలా ఉంది. మరీ తీసిపడేసే ట్యూన్ కాదు. ముఖ్యంగా మేల్ వెర్షన్ కంటే ఫీమేల్ వెర్షన్ ట్యూన్ తో పాటు సింగింగ్ కూడా బావుంది.

కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాట ఇప్పటి వరకూ అతను రాసిన వాటికి భిన్నంగా ఉంది. పాటలో కేతిక శర్మ అందాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. చూస్తోంటే సినిమాకు ఇదొక్కటే డ్యూయొట్ లా ఉంది. మరి సినిమా ఎలా ఉంటుందో కానీ.. ఇప్పటికైతే బ్రో పై భారీ అంచనాలున్నాయి. అందుకే నైజాం ఏరియాలో ఏకంగా 32 కోట్లకు మైత్రీ మూవీస్ వాళ్లు తీసుకున్నారు. ఇక త్వరలోనే ప్రమోషన్స్ స్టార్ట్ కాబోతోన్న బ్రో కు ఈ పాట ప్లస్ అవుతుందనే చెప్పాలి.

Related Posts