పెళ్లి చేసుకుంటే అది ఉండదు

ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అంటారు. కానీ ఇప్పుడు ఈ సామెతను ఎవరూ ఫాలో అవడం లేదు. అచ్చట్లు, ముచ్చట్లకు వయసుతో పనేముందీ అని రివర్స్ లో అడుగుతున్నారు. ఇక సెలబ్రిటీస్ విషయంలో అయితే ఈ ప్రశ్నలు ఇంకాస్త ఎక్కువగా వినిపిస్తుంయి. చాలామంది హీరోయిన్లు పెళ్లి వయసు దాటినా మూడు ముళ్లెప్పుడూ అంటే అప్పుడేనా అంటూ అక్కడికి తామేదో ఇంకా పదారేళ్ల పడుచుల్లాగే బిల్డప్ ఇస్తారు.

మరికొందరేమో నచ్చినవాడు రావాలి కదా అంటూ దాటవేస్తుంటారు. ఎలాంటి వాడు కావాలి అన్నమా.. ఇంక అంతే చాంతాడంత లిస్ట్ చెబుతారు. తీరా ఇలాంటి వాళ్లు అలాంటి వాడే దొరికాడు అని పెళ్లి చేసుకుంటారా.. పట్టుమని పదేళ్లు కూడా కాపురం చేయరు. అందుకే మనీ కలిసిన పెళ్లిల్ల కంటే మనసులు కలిసిన పెళ్లిల్లే ఎక్కువ కాలం ఉంటాయి.

అయితే కొంతమంది మనసులు కూడా కలిశాయని పెళ్లాడతారు. వాళ్లూ విడిపోతున్నారీ మధ్య. కారణాలేమైనా కానీ సెలబ్రిటీస్ లో విడాకుల పంచాయితీలు బాగా పెరిగిపోతున్నాయి. ఇండి విడ్యూవాలిటీ కావాలంటారు ఆడంగులు. కుదరదు పాతకాలంలానే మొగుడికి పూజలు చేయాలంటారు మగంగులు. కట్ చేస్తే మనస్ఫర్థలు. ఇంకా కట్ చేస్తే పెళ్లి బంధం రెండు ముక్కలు. అందుకే నేను పెళ్లి చేసుకోను అంటోంది జయంతో విజయవంతంగా తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టిన సదా.


జయం మూవీతో ఓవర్ నైట్ స్టార్డమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ ఆ స్టార్డమ్ ను స్టార్ హీరోయిన్ అనేలా పెంచుకోలేకపోయింది. అయినా తనదైన అందంతో తెలుగుతో పాటు తమిళ్ లోనూ చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.అమ్మడు ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికే ఇరవైయేళ్లవుతోంది. ప్రస్తుతం నాలుగు పదుల వయసులో ఉంది.

కొన్నాళ్లుగా సినిమాల కంటే డ్యాన్స్ షోలు, రియాలిటీ షోస్ లోనే ఎక్కువగా కనిపిస్తోన్న ఈ సీనియర్ మిల్కీ బ్యూటీని పెళ్లెప్పుడూ అంటే చాలు.. ”నేను పెళ్లి చేసుకోను. పెళ్లి చేసుకుంటే ఫ్రీడమ్ ఉండదు. ఫ్రీడమ్ కావాలంటే పెళ్లి చేసుకోకూడదు. అయినా ఈ మధ్య ఇలా పెళ్లి చేసుకుని అలా విడిపోతున్నారు కదా..? అందుకే నాకు ఆ బంధం వద్దు. లైఫ్‌ లాంగ్ ఇలాగే ఉంటా.. ” అని చెప్పింది.

అంటే అమ్మడికి బాగా ఫ్రీడమ్ కావాలన్నమాట. పెళ్లైతే అది ఉండదు కాబట్టే.. నో మ్యారేజ్ బోర్డ్ పెట్టేసింది. మరి మ్యారేజ్ వరకే నో చెప్పిందా లేక పిల్లలకు కూడానా అంటారా..? అన్నా తప్పు లేదులెండి.. ఈ మధ్య పిల్లల కోసం పెళ్లెందుకు అని కూడా అంటున్నారు. పైగా ఇలియానా ఏకంగా పెళ్లి లేకుండానే తల్లి కాబోతోంది కూడా. ఇంకా చెబితే ఆయనెవరో కూడా ఎవరికీ తెలియదు. ఏదైనా.. సదా మంచి నిర్ణయమే తీసుకుందంటారా..?

Related Posts