రీమేక్ వర్సెస్ డబ్బింగ్.. విన్నర్ ఎవరు..

టాలీవుడ్ కు ఈ వారం పెద్ద పరీక్ష కాబోతోంది. ఇద్దరు టాప్ స్టార్స్ మూవీస్ విడుదల కాబోతున్నాయి. వీటిలో మెగాస్టార్ చిరంజీవి మూవీ భోళా శంకర్ రీమేక్. సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ డబ్బింగ్. జైలర్ 10న విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. మల్టీప్లెక్స్ ల్లో ఎంత రేట్ ఉన్నా టికెట్ హాట్ కేక్స్ లా అమ్ముడవుతున్నాయి. ఆ మధ్య వచ్చిన తమన్నా నువ్వు కావాలయ్యా పాటతో పాటు ట్రైలర్ ఈ మూవీకి ఊహించని హైప్ తెచ్చాయి. చూస్తోంటే రజినీకాంత్ కూడా కమల్ హాసన్ విక్రమ్ లాగా ఓ బ్లాస్టింగ్ బ్లాక్ బస్టర్ చూడబోతున్నాడా అంటున్నారు. ఆ స్థాయిలో ఈ మూవీకి హైప్ వచ్చింది. ఇక రజినీ సినిమాకు తెలుగులోనూ తిరుగులేని క్రేజ్ ఉంటుంది. దీనికి తోడు ఒకే రోజు విడుదల కావడం లేదు. అందుకే ఫస్ట్ డే రికార్డ్స్ కూడా క్రియేట్ అయ్యే అవకాశాలున్నాయి.


ఇక మెగాస్టార్ మూవీ 11న విడుదలవుతోంది. తమన్నా హీరోయిన్ గా కీర్తి సురేష్ ఆయనకు చెల్లిగా నటించిన ఈ సినిమాపై ఇప్పటి వరకైతే భారీ అంచనాలు లేవు అనేది నిజం. ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత కూడా బజ్ క్రియేట్ కాలేదు. కారణాలేవైనా మెగా ఫ్యామిలీ నుంచి వస్తోన్న రీమేక్ లు ఈ మధ్య ఇబ్బంది పెడుతున్నాయి. ఆ కారణంగానే అభిమానులు కూడా అంతగా ఆసక్తి చూపించడం లేదు. బట్ మెగా మూవీ అంటే రిలీజ్ డే ఉండే హంగామా వేరే ఉంటుంది. అది ఈ సినిమాకు కూడా ఖచ్చితంగా ఉంటుంది. అయితే రిలీజ్ కు ముందు ఉండాల్సినంత హడావిడీ మాత్రం లేదు అనే చెప్పాలి. భోళా శంకర్ తమిళ్ లో వచ్చిన వేదాళంకు రీమేక్. ఈ మూవీ అదే పేరుతో తెలుగులోనూ డబ్ అయింది. అయినా ఓటిటిలో రాలేదు కదా అని చిరంజీవి ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. దీంతో పాటు ఇదే సినిమాను కాస్త అటూ ఇటూగా రజినీకాంత్ కూడా పెద్దన్న అంటూ చేశాడు. ఆ మూవీలోనూ కీర్తి సురేష్ హీరోయిన్. అదీ తెలుగులో వచ్చింది. భోళాలో ఆ పోలికలూ కనిపిస్తున్నాయి. ఇవన్నీ కలిపి సినిమాపై అంచనాలు తగ్గించాయి. మెగాస్టార్ మూవీస్ కు ఇలా జరగడం ఆశ్చర్యమే. అందుకే ఇప్పుడు అందరూ సూపర్ స్టార్ వర్సెస్ మెగాస్టార్ గా చూస్తున్నారు. అంటే సింపుల్ గా డబ్బింగ్ వర్సెస్ రీమేక్ గా మారింది వ్యవహారం.

Related Posts