నలుగురు స్టార్ హీరోలకు రెడ్ కార్డ్ జారీ

స్టార్ హీరో అంటే దైవాంశ సంభూతుడుగా చూస్తుంటారు తెలుగు సినిమా పరిశ్రమలో. వాళ్లేదో పై నుంచి దిగివచ్చినట్టుగా చూస్తుంటారు. అఫ్ కోర్స్ అది వారికి ఉండే క్రేజ్ ను బట్టి వచ్చే రెస్పెక్ట్ అనుకోండి. అయితే కోలీవుడ్ లో అలాకాదు. ఇప్పటికీ హీరోల పట్ల నిర్మాతలు స్ట్రాంగ్ గానే ఉంటారు. వారి నుంచి సరైన సమాధానం లేకపోతే కోర్ట్ లు మాత్రమే కాదు.. నిర్మాతల మండలి నుంచి రెడ్ కార్డ్స్ ఇష్యూస్ చేస్తుంటారు.

అలా ఇప్పుడు ఏకంగా నలుగురు స్టార్ హీరోలకు రెడ్ కార్డ్ ఇష్యూ చేశారు. వీరిలో కోలీవుడ్ కాంట్రవర్శీయల్ స్టార్ శింబు ఎప్పట్లానే ఉన్నాడు. శింబు తను చేయాల్సిన ”ఏఏఏ” అనే సినిమాకు రెమ్యూనరేషన్ మొత్తం తీసుకుని.. 60 రోజులు షూటింగ్ చేయాల్సి ఉండగా కేవలం 27 రోజులు మాత్రమే షూటింగ్ చేశాడని సదరు చిత్ర నిర్మాత మైఖేల్ రాయప్పన్ గతంలోనే పోలీస్ లకూ కంప్లైంట్ చేశాడు.

అప్పట్లో అతను నటించేలా రాజీ చేశారు. బట్ ఆ సినిమా పూర్తి చేయలేదు. దీని వల్ల తాము కోట్లలో నష్టపోయామనేది నిర్మాత ఆరోపణ. ఈ కారణంగా శింబు నుంచి సరైన ఎక్స్ ప్లెనేషన్ కోరుతూ రెడ్ కార్డ్ ఇష్యూ చేసింది కోలీవుడ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.


ఇక నెక్ట్స్ ఇలాంటి సంఘటనతోనే మరో స్టార్ హీరో ధనుష్ కూ రెడ్ కార్డ్ ఇష్యూ చేశారు. తేనాండల్ ఫిల్మ్స్ బ్యానర్ ధనుష్ పై చేసిన ఆరోపణ ఏంటంటే.. తమ బ్యానర్ లో హీరోగా నటిస్తూ దర్శకత్వం చేస్తానని ప్రామిస్ చేశాడు. కొంత షూటింగ్ తర్వాత ఆ సినిమాను వదిలేశాడు. ఆ తర్వాత ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవడం లేదు అని. విశేషం ఏంటంటే.. ఇదే వ్యవహారంలో శింబు, ధనుష్ కు గతంలోనూ రెడ్ కార్డ్ ఇష్యూ చేశారు.
మూడో వ్యక్తి అధర్వ మురళి. మథిళకన్ అనే బ్యానర్ నుంచి అథర్వ కూడా దాదాపు ఇదే సమస్య క్రియేట్ చేశాడు. కమిట్ అయిన సినిమాను పూర్తి చేయలేదు అనే ఆరోపణతో అతనూ రెడ్ కార్డ్ అందుకోక తప్పలేదు.


ఈ కేస్ లో కాస్త ఆశ్చర్యంగా అనిపించేది విశాల్. అతను ఏకంగా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ డబ్బులను దుర్వినియోగం చేశాడు అనే ఆరోపణతో విశాల్ కు రెడ్ కార్డ్ ఇష్యూ చేశారు. ఒకప్పుడు విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ స్థాపించి నిర్మాతల సంఘంలో చురుకుగా ఉన్నాడు విశాల్. మధ్యలో దర్శకుడు మిస్కిన్ తో వచ్చిన విభేదాలతో నిర్మాణానికి కాస్త బ్రేక్ ఇచ్చాడు. ఆ టైమ్ లోనే అతను నిర్మాతల మండలి నిధులను దుర్వినియోగం చేసి దానికి ఎటువంటి రశీదులూ చూపించలేదట. ఈ విషయం కూడా చాలాకాలంగా కోలీవుడ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో నలుగుతూనే ఉంది.


మొత్తంగా కోలీవుడ్ లో ఇలా చేయడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. ఇంతకుముందు కూడా స్టార్ కమెడియన్ వడివేలుపై రెడ్ కార్డ్ ఇష్యూ చేశారు. ఆయన్నుంచి సరైన సమాధానం లేకపోవడంతో కొన్నాళ్ల పాటు బ్యాన్ చేశారు. యోగిబాబు, ఎస్జే సూర్య, ఏఆర్ రహ్మాన్ వంటి వారు కూడా ఈ రెడ్ కార్డ్ ఇష్యూ ఫేస్ చేశారు.


మరి రెడ్ కార్డ్ ఇష్యూ చేస్తే ఏమౌతుందీ అంటే.. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఈ కార్డ్ జారీ చేసిన వారి నుంచి సరైన సమాధానాన్ని ఆశిస్తుంది. అదీ లేకపోతే వారిపై బ్యాన్ విధిస్తాం అంటుంది. అలా ఇప్పటి వరకూ బ్యాన్ ను ఎదుర్కొన్నవారిలో వడివేలు మాత్రమే కాదు.. ప్రకాష్ రాజ్ లాంటి వారూ ఉన్నారు. అదీ మేటర్. మరి ఈ ఎర్రముక్క యవ్వారం ఎటు తేలుతుందో..

Related Posts