రామ్ చరణ్ నో చెప్పాడు.. విజయ్ దేవరకొండ ఎస్ అన్నాడు

హిట్ ఇచ్చే కిక్ ఎలా ఉంటుందో.. ఫ్లాప్ ఇచ్చే షాక్ కూడా అలాగే ఉంటుంది. అందుకే విజయానికి పొంగిపోవద్దు అంటారు పెద్దలు. పొంగిపోయాడా లేక లేని యాటిట్యూడ్ ను ప్రదర్శించాలని ప్రయత్నించాడా అనేది చెప్పలేం కానీ కొన్నాళ్ల క్రితం వరుస విజయాలు పడేసరికి విజయ్ దేవరకొండ ఓ రేంజ్ లో రెచ్చిపోయాడు. తర్వాత అదే స్థాయిలో ఫ్లాపులు పడ్డాయి. అయినా అతను తగ్గలేదు. దీంతో ఇది మనోడి ఒరిజినల్ యాటిట్యూడేమో అనుకున్నారు చాలామంది. ఇక రీసెంట్ గా వచ్చిన లైగర్ టైమ్ లో అతను చేసిన అతికి, హడావిడీకి అప్పటి వరకూ అభిమానించిన వాళ్లు కూడా ఇబ్బంది పడ్డారంటే అతిశయోక్తి కాదు. దీనికి తోడు సినిమా డిజాస్టర్ కావడంతో ఆ తర్వాత ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. ఓ రకంగా ఈ సినిమా విజయ్ కి కళ్లు తెరిపించిందనే చెప్పాలి. ఎందుకంటే లైగర్ తర్వాత ఫస్ట్ టైమ్ పబ్లిక్ లో వచ్చిన ప్రిన్స్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నాడు. ఆ ఈవెంట్ లో అతను మాట్లాడిన విధానం చూస్తే చాలామందికి లైగర్ ఎఫెక్ట్ కనిపించింది. ఫస్ట్ టైమ్ చాలా కూల్ గా మాట్లాడే ప్రయత్నం చేశాడు విజయ్ దేవరకొండ.
ఈ క్యారెక్టర్ గొడవ ఎలా ఉన్నా.. ఇప్పుడు అతనికి అర్జెంట్ గా ఓ సాలిడ్ హిట్ కావాలి.

అలాంటి హిట్ ఇస్తుందని నమ్ముకున్న ఖుషీ సినిమా సమంత వల్ల ఆలస్యం అవుతోంది. ఫ్రెష్ లవ్ స్టోరీగా ఈ ఖుషీ సినిమా ఉంటుందని చెప్పారు. ఈ డిసెంబర్ లోనే విడుదల అని రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. బట్.. సమంత హెల్త్ ఇష్యూస్ వల్ల షూటింగ్ లేట్ అయింది. మిగిలిన భాగాన్ని నవంబర్ నుంచి చిత్రీకరిస్తారట. దీంతో డిసెంబర్ రిలీజ్ సాధ్యం కాదు. అయితే సమ్మర్ లేదా మార్చిలో ఈ మూవీ విడుదలయ్యే అవకాశం ఉంది.ఖుషీ తర్వాత సుకుమార్ తో సినిమా ఉంటుందనుకున్నారు. కానీ సుక్కూ నుంచి ఏ అప్డేట్ లేకపోవడంతో మరో ప్రాజెక్ట్ కు కమిట్ అయ్యాడు దేవరకొండ విజయ్. ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు.

మళ్లీ రావా, జెర్సీ సినిమాలతో ఆకట్టుకున్న గౌతమ్ తిన్ననూరి ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడు. నిజానికి గౌతమ్ హిందీలో జెర్సీని రూపొందించిన తర్వాత రామ్ చరణ్ తో సినిమా చేయాలి. చరణ్ కూడా రెడీగా ఉన్నాడు. బట్ అతను చెప్పిన కథ చరణ్ కు నచ్చలేదు. దీంతో ఏకంగా ప్రాజెక్ట్ నే ఆపేశారు. ఈ టైమ్ లో గౌతమ్.. మరో ఫీల్ గుడ్ స్టోరీ లైన్ రెడీ చేసుకుని విజయ్ కి వినిపించాడు. అతను ఓకే చెప్పాడు. కట్ చేస్తే ప్రస్తుతం ఈ మూవీ బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో గౌతమ్ ఉన్నాడు. అటు విజయ్ కూడా సమంత రాగానే ఖుషీ సినిమా షూటింగ్ ఫినిష్‌ చేసుకుంటాడు. సో.. వచ్చే యేడాది ఆరంభంలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుంది. మరి ఖుషీ మంచి విజయం సాధిస్తే.. ఈ మూవీకి మంచి హైప్ వస్తుంది. లేదంటే ఈ చిత్రానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది.

Related Posts