డబుల్ ఇస్మార్ట్ అంత వీజీ కాదు పూరీ

పూరీ జగన్నాథ్.. ఒకప్పుడు మాస్ హీరోలకు కూడా డ్రీమ్ డైరెక్టర్. ఒక్కసారైనా అతని డైరెక్షన్ లోసినిమా చేయాలని కోరుకోని హీరో లేడు. అందుకు మెగాస్టార్ కూడా మినహాయింపు కాదు అంటే అతని రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. మొదటి సినిమా బ్రదితోనే ఓ సంచలనం.

అది తెలుగు సినిమా పరిశ్రమపై తన తొలి సంతకం. తన హీరోలు ఎలా ఉంటారో అనేందుకు ఓ టీజర్. ఆ తర్వాత వచ్చిన ఇడియట్, అమ్మా నాన్నా ఓ తమిళ అమ్మాయి, పోకిరి, దేశముదురు, నేనింతే, బిజినెస్ మేన్, టెంపర్.. ఇలా ఏ పాత్ర చూసినా మరో పాత్రకు సంబంధం ఉండదు. అసలు తన హీరోలే డిఫరెంట్. డైలాగ్ తోనే సీన్ చెప్పడం పూరీకి మాత్రమే తెలిసిన విద్య.

ఒక్క చిన్న మాటతో హీరోయిజాన్ని ఇట్టే ఎలివేట్ చేస్తాడు. ఈ విషయంలో పూరీ తర్వాతే ఎవరైనా. ఆ విషయం స్టార్ డైరెక్టర్స్ కూడా ఒప్పుకున్నారు. అందుకే కొత్త శతాబ్దిలో తెలుగు సినిమాకు సంబంధించి పూరీ జగన్నాథ్ ఓ సెన్సేషన్. ఎంతటి వెలుగైనా.. ఓ చిన్న మబ్బు తునక అడ్డుపడితే మసకబారుతుందని.. పూరీ కూడా ట్రాక్ తప్పాడు. ఒకే తరహా కథతో వరుసగా సినిమాలు చేశాడు.

దీంతో ఒకప్పుడు అతని హీరోలు ఎలా ఉంటే ఆహా ఓహో అన్నారో.. మొహం మొత్తిన తర్వాత హాహాకారాలు చేశారు. పూరీ ఇంక మారడా.. అంటూ కమెంట్స్ చేశారు. ఓ దశలో పూరీ సినిమా అంటే వెరీ రొటీన్ అనే నిర్ధారణకు వచ్చారు. ఆ దశ నుంచి అనూహ్యంగా ఇస్మార్ట్ శంకర్ తో హిట్ అందుకున్నాడు. అలాగని అదేమీ అద్భుతమైన కథ కాదు. గొప్ప డైలాగ్సూ లేవు.

కాకపోతే ఈ సినిమా వచ్చిన టైమ్ లో తెలుగు సినిమా మాస్ మూవీస్ కు దూరంగా ఉంది. కంప్లీట్ గా క్లాస్ సినిమాలు హల్చల్ చేస్తున్న టైమ్. అందుకే బ్రెయిన్ లోనుంచి చిప్ మార్చిన సిల్లీ కథ అయినా అప్పుడు పాస్ అయిపోయింది. హిట్ కొట్టేశారు. తర్వాత లైగర్ తో దేశవ్యాప్తంగా ఓ క్రేజ్ ను క్రియేట్ చేశాడు. విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన ఈ సినిమాతో ప్యాన్ ఇండియన్ మార్కెట్ లోకి కూడా అడుగుపెట్టాడు. లైగర్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందనుకున్నారు.

బట్ ఫస్ట్ షోకే డిజాస్టర్ గా డిక్లేర్ అయింది. దాంతో పాటు పూరీ అస్సలేం మారలేదు అన్న సంకేతాలను బలంగా ఇచ్చిందీ మూవీ. ఈ కారణంగానే పూరీతో సినిమా అంటే ఏ హీరో కూడా ముందుకు రాలేదు. దాదాపు యేడాది నిరీక్షణ తర్వాత ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ అంటూ వస్తున్నారు.


లేటెస్ట్ గా డబుల్ ఇస్మార్ట్ మూవీ ఓపెనింగ్ జరిగింది. అయితే ఈ సారి విజయం సాధించడం అంత సులువు కాదు. పూరీ ఇమేజ్ పూర్తిగా డామేజ్ అయింది. పైగా వస్తున్నది కొత్త కథతో కాదు. ఇస్మార్ట్ శంకర్ లో ఏవైతే అప్పుడు విమర్శకులు మైనస్ పాయింట్స్ గా తేల్చారో.. ఆ పాయింట్ మీదే ఈ కథ రూపుదిద్దుకుటుంది. ఓ జులాయి, ఆవారా క్యాండేట్.. పోలీస్ డిపార్ట్ మెంట్ లోకి కేవలం ఓ చిప్ ద్వారా ఎంటర్ అవడం అసాధ్యం. అది పూరీ హీరోలే చేయగలుగుతారు అనడానికి లేదిప్పుడు.

ప్రేక్షకులు తెలివి మీరారు. ఇలాంటి సిల్లీ స్టోరీస్ అంటే ఏ మాత్రం ఆసక్తి చూపించడం లేదు. అంతెందుకు బలమైన కంటెంట్ కాకపోతే ఫ్రీగా చూపిస్తామని బోర్డ్ లు పెట్టినా ఆ వైపు కూడా చూడటం లేదు. దీనికి స్టార్ హీరోలే మినహాయింపు కాదు. అందుకే పూరీ జగన్నాథ్ ఈ సారి మ్యాజిక్ చేయాలంటే తనదైన పెన్ పవర్ వాడాలి. ఎంత సేపూ సూక్తులు చెప్పడమే కాకుండా.. ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ను కూడా చూపించాలి. సిల్లీ హీరోలే అయినా సినిమాటిక్ లిమిట్స్ దాటకుండా కనిపించాలి.ఇటు చూస్తే రామ్ పరిస్థితీ అంతంత మాత్రమే. ఒక్క హిట్ అంటే మూడు నాలుగు ఫ్లాపులు పడుతున్నాయి. ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ‘స్కంద’ అనే సినిమాతో ప్యాన్ ఇండియన్ ఆడియన్స్ కు పరిచయం కాబోతున్నాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయితేనే డబుల్ ఇస్మార్ట్ కు కాస్త ఊరట. లేదంటే డబుల్ లాస్ కు కూడా ప్రిపేర్ అయి ఉంటేనే బెటర్.

Related Posts