సందీప్ కు సరే.. ప్రభాస్ కు ఓకేనా..

ఇప్పుడు సినిమా టెక్నీషియన్స్ లో మ్యూజిక్ డైరెక్టర్స్ పాత్ర బాగా పెరిగింది. ముఖ్యంగా మాస్ హీరోలు, యాక్షన్ ఓరియంటెడ్ మూవీస్ అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోన్ బ్యాక్ బోన్ అవుతోంది. అందుకే ఆ విషయంలో ది బెస్ట్ నే ప్రిఫర్ చేస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్స్ రెమ్యూనరేషన్స్ ను కూడా ఖాతరు చేయడం లేదు. వాళ్లు ది బెస్ట్ ఇస్తారు అనుకుంటే ఎంత అడిగితే అంత ఇచ్చేయడానికి నిర్మాతలూ సిద్ధంగా ఉంటున్నారు.

ఈ మధ్యే వచ్చిన జైలర్ కు ఆర్ఆర్ ఎంత ప్లస్ అయిందో.. భోళా శంకర్ కు ఆర్ఆర్ అంత మైనస్ అయింది. ఇలాంటి ఉదాహరణలు రాకుండా ఉండాలంటే ది బెస్ట్ వైపే వెళ్లాలి. ఈ విషయంలో నిర్మాతలు వెనకాడటం లేదు. ఇక ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమా అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ విషయంలో కొన్ని కండీషన్స్ ఉంటాయి కదా.. ఈ విషయంలో ఎందుకో సందీప్ రెడ్డి వంగా తీసుకున్న నిర్ణయం ఆయన ఫ్యాన్స్ కు నచ్చినట్టు లేదు.


ప్రభాస్ ప్రస్తుతం కల్కి సినిమా షూటింగ్ లో ఉన్నాడు. దీని తర్వాత మారుతి డైరెక్షన్ లో వచ్చే రాజా డీలక్స్ ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ తర్వాత సందీప్ రెడ్డి వంగాతో ” స్పిరిట్” అనే టైటిల్ తో సినిమా కమిట్ అయి ఉన్నాడు. సందీప్ ప్రస్తుతం యానిమల్ అనే సినిమా చేస్తున్నాడు. రణ్ బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 1న విడుదల చేయబోతున్నాడు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాతే స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. ప్రీ ప్రొడక్షన్ పూర్తయ్యేలోగా ప్రభాస్ కూడా మారుతి సినిమా పూర్తి చేసి ఉంటాడు. సో.. కాస్త అటూ ఇటూగా చూసినా.. ఈ మూవీ 2024 జూన్ నుంచి స్టార్ట్ అవుతుందనుకుంటున్నారు.


అయితే ఈ చిత్రానికి సంగీత దర్శకుడుగా హర్షవర్ధన్ రామేశ్వర్ ను తీసుకున్నాడు సందీప్. అతను అర్జున్ రెడ్డికి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంత హైలెట్ అయిందో అందరికీ తెలుసు. అందుకే ఆ చిత్ర హిందీ రీమేక్ కబీర్ సింగ్ కు కూడా అతన్నే ఎంచుకున్నాడు. ఇక్కడా ఆర్ఆర్ కే పరిమితం అయ్యాడు హర్షవర్ధన్. అలాంటి మ్యూజీషియన్ ను ప్రభాస్ స్పిరిట్ చిత్రానికి తీసుకుంటున్నాడు సందీప్ రెడ్డి వంగా.


అర్జున్‌ రెడ్డి తర్వాత హర్షవర్ధన్ చేసిన విజేత, సాక్ష్యం, ప్రెజర్ కుక్కర్, టాప్ గేర్, రావణాసుర వంటి చిత్రాలేవీ ఆకట్టుకోలేదు. అఫ్‌ కోర్స్ ఆ సినిమాలు పోవడం వల్ల అతని ప్రతిభ కూడా తెలియలేదు. అయినా ఇక్కడ విజయమే ప్రామాణికం కదా.. అందుకే హర్షవర్ధన్ కు అవకాశం ఇవ్వడాన్ని ప్రభాస్ ఫ్యాన్స్ హర్షించలేకపోతున్నారు.

అయినా ఏ సంగీత దర్శకుడిలో ఏ ప్రతిభ ఉందో తెలియాలంటే ముందు అవకాశం ఇవ్వాలి కదా.. అతనిపై నమ్మకం లేకపోతే సందీప్ కూడా చాన్స్ ఇవ్వడు కదా.. పైగా ఇప్పుడు తెలుగులో అనిరుధ్, జివి ప్రకాష్‌ కుమార్ లాగా హీరోల ఇమేజ్ కు తగ్గట్టుగా ఎలివేషన్స్ ఇచ్చే మ్యూజీషియన్స్ లేరు. హర్షవర్ధన్ ప్రూవ్ చేసుకుంటే ఫ్యూచర్ లో అందరికీ ఉపయోగపడతాడు. ఒకవేళ మిస్ ఫైర్ అయితే మార్చడానికి అరక్షణం కూడా ఆలోచించడు సందీప్.. అది మాత్రం నిజం. అయితే అసలు ఈ ఛాయిస్ ప్రభాస్ కు ఇష్టమా కాదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Related Posts