హడావిడీ లేదు.. ఆడియన్స్ వస్తారా

ఒక సినిమా సడెన్ గా వాయిదా పడిందంటే అంచనాలు మారతాయి. ఏదైనా తేడా జరుగుతుందా అనే అనుమానం వస్తుంది. ఇది అందరికీ తెలుసు. అదే ప్రీ పోన్ అయిందంటే సినిమాపై వాళ్లకు ఎంత నమ్మకమో కదా అనుకుంటారు. ఈ రెండు సందర్భాల్లోనూ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడమో, దాటడమో చేయాలి. లేదంటే రిజల్ట్ తేడా కొడుతుంది.

ఈ నెల 28న విడుదల కాబోతోన్న సినిమాలు చూస్తే అదే అనిపిస్తుంది. ఈ రెండు సినిమాల్లో స్కంద ప్రీ పోన్ అయ్యి మళ్లీ పోస్ట్ పోన్ అయింది. చంద్రముఖి2 సడెన్ గా పోస్ట్ పోన్ అయింది. ఒక రకంగా వాయిదా పడిందంటే ప్రమోషన్స్ కు మరింత ఎక్కువ టైమ్ దొరుకుతుంది. బట్ ఈ రెండు సినిమాలూ ఆ విషయంలో వీక్ గానే ఉన్నాయి. అంటే కంటెంట్ స్ట్రాంగ్ గా ఉందా అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రెండు సినిమాల ట్రైలర్స్ కూడా పరమ రొటీన్ గానే ఉన్నాయి.


రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో శ్రీ లీల, సాయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా మొదలైన స్కంద సినిమాను ముందుగా దసరా బరిలో విడుదల చేయాలనుకున్నారు. ఆ మేరకు అందరికంటే ముందే డేట్ అనౌన్స్ చేశారు కూడా.

అదే టైమ్ కు బాలయ్య భగవంత్ కేసరి కూడా ఉండటంతో కాంపిటీషన్ ఎందుకు అని బోయపాటి ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 15కు ప్రీ పోన్ చేశాడు. అంటే ముందుగానే వస్తోందంటే గ్యారెంటీగా ఏదో మ్యాజిక్ ఉంటుందనుకున్నారు. అయినా ట్రైలర్ వరకూ ఈ సినిమాపై అంచనాలు పెంచడంలో మూవీ టీమ్ ఫెయిల్ అయింది. ట్రైలర్ తో బోయపాటి మార్క్ సినిమా అని అర్థమైంది.

అయితే సెప్టెంబర్ 15 నుంచి కూడా సడెన్ గా 28కి వాయిదా వేశారు. ఆ రోజు రావాల్సిన సలార్ పోస్ట్ పోన్ కావడమే అందుకు కారణం. కానీ వీరు పోస్ట్ పోన్ చేయడంలో ఏ రీజన్ కనిపించలేదు అనే చెప్పాలి. పైగా సెప్టెంబర్ 15న పోటీగా ఉన్నవి అప్పటికి డబ్బింగ్ సినిమాలే. అయినా స్కంద వాయిదా పడటం చాలామందిని ఆశ్చర్యపరిచింది.


ఇక సెప్టెంబర్ 15నే విడుదల కావాల్సిన చంద్రముఖి2ను కూడా సడెన్ గా 28కి వాయిదా వేశారు. రాఘవ లారెన్స్, కంగనా రనౌత్, మహిమా నంబియార్, వడివేలు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని మరోసారి పి వాసు తెరకెక్కించాడు. ఈ రెండు డేట్స్ చూస్తే చంద్రముఖి.. స్కందను వెంటాడినట్టు కనిపించింది. దీంతో మరోసారి వీరి మధ్యే పోటీ కనిపించింది.

ఈ రెండు సినిమాల రాకతో అప్పటికే ఆ డేట్ కు తమ సినిమాలు అనౌన్స్ చేసిన రూల్స్ రంజన్, మ్యాడ్ చిత్రాలు అక్టోబర్ 6కు వెళ్లిపోయాయి. వీళ్లెందుకు వాయిదా వేశారు అనేది వారికే తెలుసు. అయితే దొరికిన టైమ్ ను వాడుకుని మంచి ప్రమోషన్స్ చేసి ఆడియన్స్ లో అటెన్షన్ తెచ్చుకున్నారా అంటే అదేం కనిపించడం లేదు.

ఒక రకంగా రెండూ పెద్ద సినిమాలే. కానీ అందుకు తగ్గ అంచనాలు కనిపించడం లేదు. అసలు ఈ చిత్రాలు వస్తున్నట్టుగా బజ్ కూడా కనిపించడం లేదు. అసలే టాప్ హీరోల సినిమాలకే టాక్ ను బట్టి టికెట్స్ బుక్ చేసుకుంటోన్న కాలంలో అవకాశం ఉన్నా ప్రమోషన్స్ చేయకుండా డల్ గా ఉన్నారంటే అది సినిమా ఫలితంపై ప్రభావం చూపిస్తుందన్న విషయం వీరికి తెలియదా అనుకోవచ్చు.


మరోవైపు స్ట్రాంగ్ కంటెంట్ ఉంది కాబట్టే కామ్ గా ఉన్నారు అనే టాక్ కూడా ఉంది. అఫ్ కోర్స్ ఆ విషయం ఆడియన్స్ కు తెలిసి ఓపెనింగ్స్ భారీగా ఉండాలన్నా కూడా ప్రమోషన్సే కదా కీలకం. ఏదేమైనా ఈ రెండు సినిమాలు వాయిదా పడటమే ఆశ్చర్యం అంటే.. రెండిటిపైనా పెద్దగా బజ్ లేకపోవడం విశేషం. మరి ఈ మైనస్ ను దాటుకుని ఫస్ట్ డే పబ్లిక్ టాక్ తో సూపర్ హిట్ అనే మాట తెచ్చుకుంటారా లేక ఆడియన్స్ ఎక్స్ పెక్ట్ చేసినట్టే అవుతుందా అనేది చూడాలి.

Related Posts