నాగ చైతన్య ఒకే సారి రెండు సినిమాలు..

అక్కినేని నాగ చైతన్య సినిమాలు ఈ మధ్య వరుసగా పోతున్నాయి. అతను ఎంతో నమ్మకం పెట్టుకున్న కథలు కూడా ఆకట్టుకోవడం లేదు. కరోనాకు ముందు వరుస విజయాలతో మంచి దూకుడుగా కనిపించాడు. ఆ తర్వాత వచ్చిన లాల్ సింగ్ చద్దా, థ్యాంక్యూతో పాటు రీసెంట్ గా వచ్చిన కస్టడీ కూడా పోయింది. ముఖ్యంగా కస్టడీ విషయంలో చైతన్య చాలా కాన్ఫిడెంట్ గా కనిపించాడు.

ఈ మూవీతో బ్లాక్ బస్టర్ కొడుతున్నా అని అన్ని ఇంటర్వ్యూస్ లోనూ ఘంటా పథంగా చెప్పాడు. బట్.. ఫస్ట్ హాఫ్‌ ఓకే అనిపించినా.. సెకండ్ హాఫ్ పూర్తిగా తేలిపోవడంతో ప్రేక్షకులు ఫ్లాప్ గా తేల్చారు. తర్వాతి ప్రాజెక్ట్ కోసం కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఈ గ్యాప్ మంచిదే అన్నట్టుగా ఒకేసారి రెండు సినిమాలకు కమిట్ అయ్యాడు.


రీసెంట్ గా గీతా ఆర్ట్స్2 బ్యానర్ లో చందు మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందని కన్ఫార్మ్ అయింది. ఇది రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ తో రాబోతోన్న కథ. శ్రీకాకుళ సముద్రంలో చేపలు పట్టే వారి కథ. చేపల వేటకు వెళ్లే వీళ్లు సముద్ర జలాల్లో నుంచి పాకిస్తాన్ సైన్యానికి చిక్కుతారట. అందులో ఆ బోట్ నడిపే వ్యక్తి పాత్రలో చైతన్య కనిపిస్తాడని చెబుతూ వస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందే ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళుతుంది.


ఇక మరోటి మజిలతో తనకు మెమరబుల్ హిట్ ఇచ్చిన శివ నిర్వాణ దర్శకత్వంలో ఉంటుంది. ఈ కాంబోలో సినిమా కూడా రీసెంట్ గానే ఫిక్స్ అయింది. ప్రస్తుతం శివ నిర్వాణ ఖుషీ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదల కాబోతోంది. ఆ తర్వాత చైతన్య సినిమా స్టార్ట్ చేస్తాడు. అయితే ఈ రెండు సినిమాలకూ ఒకేసారి షూటింగ్ జరగబోతోంది.

చైతన్య కూడా అందుకు తగ్గట్టుగా తన డేట్స్ ను కూడా ఇవ్వబోతున్నాడట. అంటే ఒకేసారి రెండు సినిమాల షూటింగ్స్ జరుగుతాయన్నమాట. అన్నీ కుదిరితే వీటిలో చందూ మొండేటి సినిమా వచ్చే సమ్మర్ లో విడుదలవుతుంది. ఆ తర్వాత శివ నిర్వాణ సినిమా వస్తుంది. మరి ఈ రెండు సినిమాలతో అయినా నాగ చైతన్య విజయాలు అందుకుంటాడేమో చూడాలి.

Related Posts