సొంత ఊరి మట్టితో మొక్కలు నాటిన మోహన్ బాబు

విలక్షణ నటుడుగా గొప్ప గుర్తింపు తెచ్చుకున్నాడు మోహన్ బాబు. విలన్ పాత్రలు చేసినా విజిల్స్ వేయించుకున్న ఏకైన నటుడు ఆయన. ఏ పాత్ర చేసినా అద్భుతమైన వాచకంతో అదరగొడతాడు. కొన్నాళ్లుగా ఫ్యామిలీ మొత్తం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నా.. ఒక నటుడుగా మోహన్ బాబును రీ ప్లేస్ చేసే నటుడు ఇప్పటి వరకూ రాలేదు అనేది నిజం. ప్రస్తుతం సినిమాలకు కొంత విరామం ప్రకటించి మనవళ్లు, మనవరాళ్లతో గడుపుతున్న మోహన్ బాబు తాజాగా ఒక మంచి ఆలోచన చేశారు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మోహన్ బాబుతిరుపతిలో ఆయన స్థాపించిన మోహన్ బాబు యూనివర్శిటీ ప్రాంగణంలో మొక్కలు నాటే పనికి శ్రీకారం చుట్టారు. మొక్కలు నాటడం ఎవరైనా చేస్తారు. కానీ మోహన్ బాబు వినూత్నంగా ఆలోచించారు. మోహన్ బాబు పుట్టింది చిత్తూరు జిల్లా మోదుగుల పాళెంలో. ఆ గ్రామం నుంచి పారే స్వర్ణముఖీ నది నుంచి గుప్పెడు ఇసుక.. గ్రామస్తుల పొలాల నుంచి గుప్పెడు మట్టి తీసుకురమ్మని కోరాడట. మోహన్ బాబు కోరడమే తడవుగా వందమంది గ్రామస్తులు.. ఆయన యూనివర్శిటీకి మట్టి, ఇసుకతో వెళ్లారు. ఇందుకోసం బస్ లుకూడా ఈయనే అరేంజ్ చేయడం విశేషం. ఈ సందర్భంగా మోహన్ బాబు ఏం చెబుతున్నాడంటే..


” 77వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఎందరో మహానుభావులు దేశం కోసం తమ ధన, మాన, ప్రాణాలను త్యాగం చేసి మనకు స్వాతంత్య్రం అందించారు. ఈరోజు మనం ఇలా జీవిస్తున్నామంటే వారి త్యాగాలే కారణం.ఈ పండుగను పురస్కరించుకొని తిరుపతిలోని మోహనబాబు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించాను. ఎందుకంటే నాకు జన్మనిచ్చిన జన్మభూమి మోదుగులపాళెం. ఒక నటుడుగా, ఒక నిర్మాతగా, రాజ్యసభ సభ్యునిగా, విద్యాప్రదాతగా ఎదగడానికి నా తల్లిదండ్రులు, నా గ్రామప్రజలు మూలకారణం. పల్లెటూరు నుండి డిల్లీ పార్లమెంటు వరకు నాప్రస్తానం సాగడానికి నాకు జన్మనిచ్చిన నా పల్లెటూరే కారణం. అంతగొప్పగా ఎదగడానికి మూలమైన నా తల్లిదండ్రులను, జన్మభూమిని, ఆప్తులు, ఆత్మీయులైన మా గ్రామస్తులను ఎప్పుడూ గుర్తుచేసుకుంటూనే ఉంటాను. నా జన్మభూమిని ఎప్పుడూ మనసులో స్మరిస్తూ ఉండాలనే ఉద్దేశ్యంతో ఒక ప్రణాళికను రూపొందించు కున్నాను.

నేను స్థాపించిన విశ్వవిద్యాలయంలో మొక్కలు నాటాలనుకున్నాను. దీనికి నాజన్మభూమి అయిన మోదుగులపాళెం నుండి 100 మంది మాగ్రామస్తులను అక్కడ ప్రవహించే స్వర్ణముఖీ నది ఇసుకను ఒక గుప్పెడు, వారి పొలంలోని మట్టిని గుప్పెడు తెమ్మన్నాను. దానితో పవిత్రమైన ఈరోజు ఇక్కడ మొక్కలు నాటుతున్నాను. ఈ మాటలు చెప్పగానే మాగ్రామస్తులు ఎంతో ఉప్పొంగిపోయారు. రెండు బస్సులలో వారిని ఇక్కడికి పిలిపించాను. వారు తెచ్చిన ఇసుక, మట్టితో 100 మొక్కలు నాటించాను. అవి పెరిగి పెద్దవైతే వాటిని చూసిన ప్రతిసారీ నాకు నాతల్లిదండ్రులు, నాజన్మభూమి అందులోని మాగ్రామస్తులు గుర్తుకు రావాలన్నదే నా ఆశ ఆకాంక్ష. ఈ 77వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా మొక్కలు నాటాలనే సంకల్పం రావడానికి నాతల్లిదండ్రులైన స్వర్గీయ శ్రీ మంచు నారాయణస్వామి నాయుడు, స్వర్గీయ శ్రీమతి లక్ష్మమ్మ గార్ల ఆశీస్సులే కారణమని భావిస్తున్నాను.

ఇట్లు
మోహన్ బాబు.

ఓ రకంగా మోహన్ బాబు ఎప్పుడు ఆ మొక్కలు చూసినా ఈ తతంగం అంతా గుర్తొస్తుంది. తన గ్రామస్తులు గుర్తొస్తారు. ఈ మొక్కలు పెరుగుతున్నది తన మాతృభూమి మట్టితో అన్నదీ గుర్తొస్తుంది. ఇలా పుట్టిన గడ్డను నిత్యం స్మరించుకోవడం అంటే గొప్ప గెస్చరే కదా..

Related Posts