మరో ‘బేబి‘ని పట్టుకొచ్చిన మాస్ మూవీ మేకర్స్

మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై వచ్చిన ‘బేబి‘ సినిమా ఎలాంటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయిన వైష్ణవి చైతన్య కి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ సినిమా విడుదలైన తర్వాత ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది వైష్ణవి. మెగాస్టార్ చిరంజీవి అయితే ఈ ముద్దుగుమ్మను ఏకంగా అభినవ సావిత్రి అంటూ పొగిడేశారు.

సినిమాల్లోకి రాకముందు వైష్ణవి యూట్యూబ్ లో పెద్ద స్టార్. వైష్ణవి నటించిన ‘ది సాప్ట్ వేర్ డెవలపర్‘ బాగా హిట్టయ్యింది. ఇప్పుడు వైష్ణవి తరహాలోనే మరో యూట్యూబర్ ని హీరోయిన్ గా తీసుకొస్తున్నారు ‘బేబి‘ మేకర్స్. ‘బేబి‘ డైరెక్టర్ సాయి రాజేష్, ప్రొడ్యూసర్ ఎస్.కె.ఎన్. సంయుక్తంగా నిర్మిస్తున్న కొత్త సినిమా ద్వారా యూట్యూబర్ దేత్తడి హారిక హీరోయిన్ గా పరిచయమవుతుంది.

యూట్యూబ్ లో దేత్తడి ఛానెల్ తో ఫుల్ ఫేమస్ అయ్యింది అలేఖ్య హారిక. ఆ తర్వాత ‘బిగ్ బాస్‘కి వెళ్లి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇక సినిమాల విషయానికొస్తే ‘వరుడు కావలెను, శ్రీకారం‘ చిత్రాల్లో చిన్న పాత్రల్లో మెరిసిన హారిక ఇప్పుడు పూర్తిస్థాయి హీరోయిన్ గా నటిస్తున్న సినిమా ఇదే. ఈ సినిమాలో సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్నాడు. సుమన్ పాతూరి దర్శకుడు. నాగచైతన్య ముఖ్య అతిథిగా హాజరైన ఈ సినిమా ఈరోజే ముహూర్తాన్ని జరుపుకుంది.

‘కొన్ని ప్రేమ కథలు జీవితకాలం వెంటాడుతాయి‘ అనే కొటేషన్ తో.. సంతోష్ శోభన్, హారిక లిప్ కిస్ తో విడుదలైన ఈ సినిమా పోస్టర్ ఆకట్టుకుంటుంది. పోస్టర్ ను బట్టి ఈ సినిమా కూడా ‘బేబి‘ తరహాలో ఇంటెన్స్ లవ్ స్టోరీగా ఉండబోతున్నట్టు అర్థమవుతోంది. ‘బేబి‘ ఫేమ్ విజయ్ బుల్గానిన్ ఈ సినిమాకీ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. మొత్తంమీద.. వైష్ణవి చైతన్య తరహాలో దేత్తడి హారిక కూడా ఈ మూవీతో హీరోయిన్ గా మంచి స్టార్ డమ్ దక్కించుకుంటుందేమో చూడాలి.

Related Posts