పచ్చని ఊరుపై ఆరని చిచ్చు పెట్టిన ‘మంగళవారం’

మంగళవారం.. ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి డైరెక్ట్ చేస్తోన్న సినిమా. ఆర్ఎక్స్ 100 తర్వాత చేసిన మహా సముద్రం బాగా నిరాశపరిచింది. దీంతో మరో ప్రొడక్షన్ హౌస్ కూడా అతనితో సినిమా చేయడానికి సాహించలేదు. ఆ స్థాయిలో నిరాశపరిచాడు. బట్ కాస్త ఆలస్యమైనా.. మళ్లీ ఆర్ఎక్స్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో ‘మంగళవారం’ అనే సినిమాతో వస్తున్నాడు.

లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల చేశారు. ఈ పాట ఒక్కసారిగా ఆడియన్స్ ను ఆ ఊరి మూడ్ లోకి తీసుకువెళ్లిందంటే అతిశయోక్తి కాదు. చాలా రోజుల తర్వాత అమ్మవారి నేపథ్యంలో పూర్తి స్థాయి పాటగా కనిపిస్తోందీ సాంగ్. ఇకపై అన్ని జాతర్లలోనూ ఖచ్చితంగా వినిపించే పాట అవుతుందనుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి కాంతార ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం చేస్తున్నాడు అన్నప్పుడు చాలామంది చాలా ఎక్స్ పెక్ట్ చేశారు. ఆ ఎక్స్ పెక్టేషన్స్ కు ఏ మాత్రం తగ్గకుండా.. ఇంకా చెబితే డబుల్ అయ్యేలా ఫస్ట్ సాంగ్ తోనే సత్తా చాటాడు. ఆ పాటను అజయ్ భూపతి చిత్రీకరించిన విధానం, కొరియోగ్రఫీ కూడా ఎక్కడా మోతాదుకు మించకుండా ఓ రకమైన వైబ్రంట్ ఫీలింగ్ ను తెచ్చాయి.


ఇక అమ్మవారి పాటే అయినా సినిమా కథను కూడా ఎలివేట్ చేసేలా.. “పచ్చా పచ్చని ఊరుమీద పడినది పాడుకన్ను.. ఆరని చిచ్చే పెట్టే పోతాదే.. ఆపేవాడు లేనే లేడు అంతా బూడిదే.. తెల్లా తెల్లటి గోడ మీద ఎర్రటి అక్షరాలు వెన్నులో వణుకుపుట్టిస్తున్నాయో.. రాసేవాడు వీడో వాడో.. ఎవరో తెలియదే.. మరణం తప్పదిక ప్రతీ మంగళారం.. చెమటలు పట్టిస్తది ఒక్కో చావు మేళం.. వేట మొదలైందిరా ఇవ్వాల్సిందే ప్రాణం.. తప్పుకుని పోదామన్నా ఎంతో దూరం పోలేవు.. ” అంటూ సాగే ఈ సాహిత్యం చూస్తే ఈ సినిమా కథ కూడా తెలుస్తుంది.


ఇక తన శైలికి భిన్నంగా ఈ పాటను భాస్కరభట్ల రాశాడు అంటే కాస్త ఆశ్చర్యంగా ఉంది. అతను రాసినవన్నీ దాదాపు ఫంకీ టైప్ సాంగ్. ఇది అతని స్టైల్ కు డిఫరెంట్ గా కనిపిస్తోంది. ఈ పాటను పాడింది కూడా తెలుగు గాయకుడు కాదు.. తమిళనాడుకు చెందిన విఎమ్ మహాలింగంతో ఈ పాటను పాడించారు.అతని వాయిస్ లోని ఫైర్ ఈ పాటకు కొత్త అందాన్ని తెచ్చిందనే చెప్పాలి. మొత్తంగా ఈ పాటతో ఈ సారి తను జనాలను వణికించబోతున్నాను అనే వార్నింగ్ బెల్ మోగించాడు అజయ్ భూపతి.

Related Posts