మహా ఛలాకీ నటి రాధిక బర్త్ డే స్పెషల్

తెలుగులో జయత్రయం.. జయసుధ, జయప్రద, జయచిత్ర విజయయాత్ర పూర్తయ్యాక…శ్రీదేవి బాలీవుడ్ కి తరలివెళ్లాక…ఎర్లీ ఎయిటీస్ లో ఊపందుకుంటున్న కుర్ర హీరోల పక్కన ఓ చలాకీ హీరోయిన్ అవసరమయ్యింది. ఆ అవసరాన్ని తీర్చడానికి తెలుగు తెర మీద కాలుపెట్టింది రాధిక.

ప్రభావవంతమైన నటనా ప్రతిభతో ఓ వెండితెరపై ఉరకలెత్తిన ఉత్సాహం. చలాకీదనానికి కేరాఫ్.. ఏ పాత్రలోనైనా అవలీలగా ఒదిగిపోయిన ప్రతిభ.. నాటి యంగ్ జనరేషన్ హీరోలకు పోటీగా ఎన్నో సినిమాల్లో మెరిసిన తార.. వెరసి రాధిక. బూరెబుగ్గలు చారెడేసి కళ్లతో చూడగానే ఆకట్టుకునే రాధిక ఎన్నో విజయవంతమైన సినిమాల్లో అద్భుతమైన పాత్ర పోషించింది.. హీరో ఎవరైనా రాధిక ఉంటే ఆమె పాత్రలు ప్రత్యేకంగా నటన డామినేటింగ్ గానే సాగింది.ఈ సోమవారం రాధిక పుట్టిన రోజు సందర్భంగా ఆమె సినీ యానాన్ని ఓ సారి గుర్తు చేసుకుందాం..

తమిళ విలన్ ఎమ్.ఆర్.రాధ కూతురుగా తెరంగేట్రం చేసిన రాధిక తొలి చిత్రం భారతీరాజా కిజక్కు పోగుం రైల్. తెలుగులో తొలిసారి చేసిన చిత్రం క్రాంతికుమార్ న్యాయం కావాలి. రాధిక తెరంగేట్రం చేసింది 1978లో. అలాగే చిరంజీవి తొలి చిత్రం కూడా అదే సంవత్సరం విడుదలైంది.రాధిక తొలి తమిళ చిత్రం హీరో సుధాకర్. సుధాకర్ రూమ్మేట్ చిరంజీవి రాధిక తొలి తెలుగు చిత్రం హీరో. ఇది కాకతాళీయంగా జరిగినా…చిరంజీవితో అత్యధిక చిత్రాల్లో నటించిన హీరోయిన్ గా మాత్రం రికార్టు సొంతం చేసుకుంది.

రాధిక కేవలం గ్లామర్ గాళ్ గానే కాదు. పెర్ఫామర్ గానూ గుర్తింపు పొందింది. తన తొలి చిత్రం న్యాయం కావాలి చూసిన చాలా మంది డైరక్టర్లు రాధికలో అద్భుతమైన ఈజ్ ఉన్న నటి ఉందని కనిపెట్టేశారు. కిరాయి రౌడీలు లాంటి సినిమాల్లో గ్లామర్ పాత్రలు చేస్తూనే బాపుగారి రాధా కళ్యాణంలో అద్భుతమైన పెర్ఫామెన్స్ తో అదరగొట్టింది.


రాధికలో అద్భుతమైన ప్లెక్స్ బులిటీ ఉంది. అమాయకత్వం నిండిన పల్లెటూరి అమ్మాయిగా పట్నం వచ్చిన పతివ్రతలు లో ఎంతగా ఆకట్టుకుందో…అలాగే ఆత్మగౌరవం పుష్కలంగా ఉన్న మహిళగానూ మెప్పించింది.అయితే అప్పటి వరకూ చేసిన పాత్రలకు భిన్నంగా విశ్వనాథ్ స్వాతిముత్యంలో ఎంతో గొప్ప పరిపక్వమైన నటన ప్రదర్శించింది రాధిక. అందుకే ఈ పాత్రల్లోనూ ఆమెను అంతే గొప్పగా రిసీవ్ చేసుకున్నారు ఆడియన్స్.ఒక దశలో నటనకు ప్రాధాన్యత ఉన్న హీరోయిన్ రోల్ ఉందంటే ఖచ్చితంగా రాధికనే ప్రిఫర్ చేసేవారు డైరక్టర్లు. అలా తను అద్భుతమైన చిత్రాలు చేసింది తెలుగులో. వాటిలో కోదండరామిరెడ్డి శోభన్ బాబు కాంబినేషన్ లో వచ్చిన బావమరదళ్లు ఒకటి. అందులో సుహాసిని అక్క పాత్రలో రాధిక నటన క్రిటిక్స్ ను మెప్పించింది.

పెర్ఫామెన్స్ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూనే రఫ్ అండ్ టఫ్ కారక్టర్లలో మెప్పించగలగడం బహుశా సౌత్ ఇండియన్ స్క్రీన్ మీద రాధికకే సాధ్యమైందేమో. ఒక వైపు బాపు, విశ్వనాథ్, సింగీతం లాంటి డైరక్టర్లతో చేస్తూనే దొంగమొగుడులో చిరంజీవితో తలబడే రౌడీ కారక్టర్ లో ఫుల్ మాస్ లుక్స్ తో కనిపించి హడావిడి చేసేసింది రాధిక.


ముఖ్యంగా చిరంజీవితో రాధికది సూపర్ హిట్ కాంబినేషన్.. పాత్రలను బట్టి వీరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయేది. అందుకే వీరి కాంబోలో సినిమా అంటే మాగ్జిమం ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అనుకున్నారు నాటి ప్రేక్షకులు. అలాగే రియల్ లైఫ్ లోనూ వీరిది గొప్ప బంధమే. అంటే సినిమాల్లోగా చిలిపి తగాదాలు, వెలకట్టలేని స్నేహం, కుటుంబాల మధ్యా మంచి రాపో ఉండటంతో చిరు, రాధిక ఎవర్ గ్రీన్ హాట్ ఫేవరెట్ అయ్యారు చాలామందికి.

చిరంజీవి లాంటి యంగ్ హీరోతో చేస్తూనే వెటరన్ హీరో అక్కినేనితోనూ జోడీ కట్టింది రాధిక. అదీ సక్సస్ ఫుల్ మూవీనే. రాధికకు నల్లపిల్ల అని ఓ నిక్ నేమ్ ఉండేది. నిజానికి అప్పటికి తెర మీద చాలా మంది హీరోయిన్స్ తో పోలిస్తే రాధిక గ్లామర్ పరంగా కాస్త తక్కువ స్థాయనే చెప్పాలి. కానీ ఒక పాత్రను స్క్రీన్ మీద తను పోట్రెయిట్ చేసే విధానం మాత్రం అద్భుతం. అనితరసాధ్యం. జంధ్యాల తీసిన మూడుముళ్లులో మరో అద్భుతమైన కారక్టర్ చేసింది రాధిక. కారక్టర్ ను అర్ధం చేసుకుని పూర్తిగా అందులోకి పరకాయ ప్రవేశం చేయగలగడం రాధికలో ఉన్న ప్రత్యేకత. ఇదే ఆమెను ఎంతోమంది ప్రేక్షకులకు చాలా దగ్గర చేసింది. అలాగని కేవలం అక్కడే పరిమితం కాలేదు. గ్లామర్ రోల్స్ కూ న్యాయం చేసింది. రాధిక చేసిన ఎన్నో గొప్ప కారక్టర్లలో తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చిన పాత్ర పల్నాటి పౌరుషంలో కృష్ణంరాజు చెల్లెలి పాత్ర. అద్భుతమైన ఎమోషన్స్ తో తన పెర్ఫామెన్స్ వావ్ అనిపించే రేంజ్ లో సాగుతుంది.

రాధిక సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నింటిలో సినిమాలు చేసింది. తెలుగు,తమిళ్లో సూపర్ హిట్ సినిమాలు చేసిన రాధిక, మలయాళ,కన్నడలోనూ హిట్ మూవీస్ చేసింది. కన్నడ స్టార్ విష్ణు వర్ధన్ తోనూ, మలయాళీ స్టార్స్ మమ్ముట్టి,మోహన్ లాల్ తోనూ కలిసి నటించి అక్కడి ప్రేక్షకులను మెప్పించింది.
సౌత్ తో పాటు బాలీవుడ్ ‘అస్లీ నక్లీ’,లాల్ బాద్ షా లాంటి సినిమాల్లోనూ నటించిన రాధిక, ప్రొడ్యూసర్ గానూ మారింది. తన భర్త శరత్ కుమార్ హీరోగా జీతన్,తలైమగన్ లాంటి సినిమాలు నిర్మించింది. అయితే ఈ సినిమాలు ఎక్కువగా ఆడకపోవడంతో రాధికకు నష్టాలు తప్పలేదు. అయినా ఈ నష్టాలను పట్టించుకోకుండా తన భర్తతో కలిసి ఇదుఎన్నమాయం, పాంబు సత్తై సినిమాలు నిర్మిస్తోంది.

హీరోయిన్ గా సౌత్ ఇండియన్ స్టార్స్ అందరితో కలిసి నటించిన రాధిక, ఇప్పుడు యంగ్ స్టర్స్ కు మదర్ క్యారెక్టర్స్ చేస్తోంది. గ్లామర్ రోల్స్ తో ఆనాటి కుర్రాళ్లను ధియేటర్స్ కు రప్పించిన రాధిక, ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ తో స్టోరీకి అదనపు బలాన్ని చేకుర్చుతూ సెకండ్ ఇన్నింగ్స్ ని ఫుల్ స్పీడ్ గా రన్ చేస్తోంది.
నెమ్మదిగా కారక్టర్ రోల్స్ లోనూ రాధిక మెప్పించింది. వాటిలోనూ మాసు క్లాసు రెండూ చేసేసింది. ఆ మధ్య వచ్చిన కార్తీ శకుని చిత్రంలో మాస్ పాత్రలో మెప్పించిన రాధిక అంతకుముందు విశ్వనాథ్ తీసిన స్వాతికిరణంలో మమ్ముట్టి భార్య పాత్రలో జీవించింది. కారక్టర్ రోల్స్ లో కూడా తనకంటూ ఓ ప్రత్యేకత నిలబెట్టుకుంది.

ఒక వైపు సినిమాలు మరో వైపు టీవీ సీరియళ్లతో బిజీగానే ఉంటోంది రాధిక.దక్షిణాదిలో ఎనభైల్లో వచ్చిన ప్రతిభావంతమైన నటుల జాబితాలో రాధిక పేరు ఖచ్చితంగా ఉంటుంది. చాలాకాలం పాటు తెలుగు, తమిళ భాషల్లో అగ్రనటిగానూ వెలుగొందిన రాధిక ఇప్పుడు చేస్తోన్న పాత్రలూ బలమైనవే. కాకపోతే కాస్త చూజీగా ఉంటూ.. అభిమానులకు బెస్ట్ పర్ఫార్మెన్స్ నే చూపిస్తోంది. ఆ బెస్ట్ పర్ఫార్మెన్స్ మరింత బెస్ట్ గా సాగాలని కోరుకుంటూ రాధికకు తెలుగు 70ఎమ్ఎమ్ తరఫున పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుదాం..

              - బాబురావు. కామళ్ల

Related Posts