కల్వకుంట్ల కవిత బయోగ్రఫీ

కల్వకుంట్ల కవిత. భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు.. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు, శోభ దంపతులకు కరీంనగర్ పట్ణణంలో జన్మించారు. కవిత స్టాన్లీ బాలికల పాఠశాలలో విద్యనభ్యసించారు. ఆ తర్వాత వి.ఎన్.ఆర్ విజ్ఞాన జ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుండి ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ పొందారు. పై చదువులకోసం 2001లో అమెరికా వెళ్లి.. అక్కడ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీని పొందారు.

అదే సమయంలో కవిత.. దేవనపల్లి అనిల్ కుమార్ ను వివాహమాడారు. ఆయన ఒక మెకానికల్ ఇంజనీరు. వీరికి ఆదిత్య, ఆర్య అనే ఇద్దరు కుమారులున్నారు. కొన్నాళ్ల పాటు అమెరికాలో సాప్ట్ వేర్ ఇంజినీర్ గానూ పనిచేశారు కవిత. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో తండ్రి కేసీఆర్ కు చేదోడు వాదోడుగా ఉండడానికి 2006లో భారతదేశానికి తిరిగి వచ్చారు.

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు హామీపై వెనక్కి వెళ్ళినందుకు కేంద్ర ప్రభుత్వంపై తన తీవ్ర అసమ్మతితో కేసీఆర్ కేంద్ర మంత్రివర్గం నుండి రాజీనామా చేశారు. దీంతో మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమయింది. ఆ సమయంలో కవిత కూడా తెలంగాణ ఉద్యమంలోకి వచ్చారు. ప్రజలను ప్రభావితం చేసే సమస్యలపై అవగాహన కోసం, కవిత తెలంగాణలోని మారుమూల గ్రామాల్లో పర్యటించారు. 2006లో ఆమె నల్గొండ జిల్లాలోని కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని.. అక్కడి పేద పిల్లలకు ఉచిత విద్యనందించి స్థానిక ప్రజలకు ఎంతో సహకరించారు.

కొన్ని తెలుగు చలన చిత్రాలలో తెలంగాణ భాష, సంస్కృతిని అవహేళనకు గురి అవుతుందనే ఆందోళన అప్పట్లో ఎక్కువగా ఉండేది. ఆ విషయం గురించి అప్పటి
నంది అవార్డుల ప్రదానోత్సవంలో తీవ్ర నిరసన తెలియజేశారు కవిత. అలాగే.. 2010వ సంవత్సరంలో ఎన్టీఆర్ ‘అదుర్స్‘ సినిమా తెలంగాణలో విడుదల అయినపుడు వ్యతిరేకించి ప్రముఖంగా వార్తలలో నిలిచారు. ‘అదుర్స్‘ సినిమాలోని నిర్మాణ వర్గం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకిస్తున్నందున ఆ చిత్రం విడుదల విషయంలో అభ్యంతరాలు తెలిపారు కవిత.

తెలంగాణ కళలు, సంస్కృతిపై జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు తెలియజేయడంకోసం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న ప్రజా ఉద్యమం నుండి ప్రేరణ పొంది 2006 ఆగస్టులో తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేశారు కవిత. ఈ సంస్థ అధికారికంగా 2007 నవంబరులో నమోదు చేయబడింది.

ఇక తెలంగాణ ప్రజల హృదయాలను కలిపే ప్రత్యేకమైన పండుగలలో బతుకమ్మ పండుగ ఒకటి. బతుకమ్మను పెద్ద ఎత్తున జరుపుకుంటూ, అన్ని వర్గాల ప్రజలనూ అందులో పాల్గొనేలా చేయడంలో కవిత ఎంతో కృషి చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం శాంతియుత పోరాటంలో మహిళలు, యువత, సమాజంలోని పెద్ద వర్గాల మద్దతును సమీకరించడంలో తెలంగాణ జాగృతి కీలక పాత్ర పోషించింది.

2009 నుండి 2014 వరకు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్రను పోషించారు కవిత. 2014లో జరిగిన 16 వ లోక్‌సభకు నిజామాబాదు నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు. ప్రత్యర్థిపై 1 లక్షా 16 వేల 184 వోట్ల మెజార్టీతో కవిత గెలుపొందారు. పార్లమెంటులో కవిత.. ఎస్టిమేట్స్ కమిటీ, వాణిజ్యంపై స్టాండింగ్ కమిటీ, కన్సల్టేటివ్ కమిటీ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖలో సభ్యురాలిగా పనిచేశారు. కామన్వెల్త్ మహిళా పార్లమెంటేరియన్స్, ఇండియా రీజియన్ స్టీరింగ్ కమిటీకి నామినేట్ చేయబడ్డారు. అధికారికంగా కంబోడియా, లావోస్‌, బెల్జియంలోని బ్రస్సెల్స్‌ వంటి ప్రాంతాలను సందర్శించారు.

అయితే.. ఆ తర్వాత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ పై ఓడిపోయారు. ఎమ్.పి.గా ఓడిపోయిన తర్వాత 2020 అక్టోబరులో జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో పోటీ చేసి 672 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు కవిత. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా 2021 మార్చి 18న మండలి సమావేశాలకు హాజరయ్యారు. శాస‌న‌మండ‌లిలో ఎమ్మెల్సీగా స్థానిక సంస్థల‌ సమస్యలపైన మాట్లాడారు.

ఆ తర్వాత తెలంగాణ శాసనమండలికి 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత పేరును టిఆర్ఎస్ అధిష్టానం ఖరారు చేసింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికై రెండవసారి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు.

తెలంగాణ యువతకు ఉపాధి అందించడానికి చొరవ తీసుకున్న కవిత.. తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ జాగృతి స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేసి వివిధ అంశాలలో విద్యార్థులకు శిక్షణ ఇప్పించారు. తెలంగాణ జాగృతి ద్వారా దశాబ్ద కాలంపాటు తెలంగాణతో పాటు ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ వేడుకలను నిర్వహించారు.

కవిత కార్మిక, కార్మిక సంఘాలలో చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలిగా, తెలంగాణ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ కి గౌరవాధ్యక్షురాలిగానూ పనిచేశారు. అలాగే.. స్కౌట్స్ అండ్ గైడ్స్‌ తెలంగాణ రాష్ట్ర చీఫ్ కమిషనర్‌గా 2015లో తొలిసారి ఎన్నికయ్యారు. రాష్ట్ర ప్రధాన కమిషనర్‌గా నియమితులైన కవిత దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలిగా, భారతదేశంలోనే రెండవ మహిళా రాష్ట్ర ప్రధాన కమిషనర్ గా రికార్డు నెలకొల్పారు.

కవిత తన స్వగ్రామమైన తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా, నందిపేట్ మండలం, సీ.హెచ్.కొండూర్ గ్రామంలో తన సొంత ఖర్చుతో శ్రీరాజ్యలక్ష్మీ సమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని నిర్మించారు.

ఢిల్లీలో రాజకీయంగా దుమారం రేపిన లిక్కర్ పాలసీ స్కాం‌ంలో 2022లో తొలిసారి కవిత పేరు వినిపించింది. గత ఏడాదిలో రెండుసార్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు హాజరయ్యారు కవిత. తాజాగా కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అరెస్ట్ చేసి, తదుపరి విచారణ కోసం ఢిల్లీకి తీసుకెళ్లారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ-మనీల్యాండరింగ్ కేసులో సంబంధాలపై ఆమెను ప్రశ్నించనున్నారు.

Related Posts