బ్లాక్ బస్టర్ అంటున్నా.. నమ్మడం లేదు

బ్లాక్ బస్టర్ వచ్చిందా.. అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు చాలామంది. అలా ఉంది పరిస్థితి. వారు అంటే ఎవరూ అనుకుంటున్నారు కదా.. ఇంకెవరు బాలీవుడ్ వారు. కొన్నాళ్లుగా హిట్ అనే మాటే మర్చిపోయారు. ఎప్పుడో కానీ ఓ బ్లాక్ బస్టర్ పడటం లేదు బాలీవుడ్ కు. అందుకే తాజాగా కరణ్ జోహార్ సినిమా బ్లాక్ బస్టర్ అంటే అనుమానంగానే చూస్తున్నారు.

రణ్‌వీర్ సింగ్, అలియాభట్ జంటగా నటించిన రాకీ ఔర్ రాణీ ప్రేమ్ కహానీ అనే సినిమా ఈ శుక్రవారం విడుదలైంది. ఎప్పుడూ నిర్మాణ బాధ్యతలే చూసుకుంటూ అప్పుడప్పుడూ దర్శకత్వం చేస్తున్న కరణ్‌ జోహార్ డైరెక్ట్ చేసిన సినిమా. వారి సొంత బ్యానర్ ధర్మ ప్రొడక్షన్స్ లోనే వచ్చింది. ప్రధాన జోడీతో పాటు జయాబచ్చన్, షబానా అజ్మీ, ధర్మేంద్ర వంటి వింటేజ్ స్టార్స్ కూడా నటించిన ఈ చిత్రం మన తెలుగు బొమ్మరిల్లుకు దగ్గరగా ఉంటుంది. ఓ ప్రేమజంట ప్రేమను ఇళ్లల్లో ఒప్పుకోరు. దీంతో ఒకరింట్లో ఒకరు ఉండి ఆయా ఫ్యామిలీస్ ను మెప్పించాలనుకుంటారు. ఆ పాయింట్‌ తో వచ్చిన ఈ మూవీ ఈ శుక్రవారం విడుదలైంది.


అయితే సినిమాకు అన్ని ప్రాంతాల నుంచి ఏకంగా 4,5 రేటింగ్స్ తో రివ్యూస్ పడుతున్నాయి. సరిగ్గా ఇక్కడే చాలామందికి డౌట్ వచ్చింది. ఈ మూవీ ట్రైలర్ ను ఎవరూ అద్భుతం అనలేదు. పాటలు సైతం ఆహా ఓహో అనిపించుకోలేదు. ట్రైలర్ లో చూపించిన సంఘర్షణ ఇప్పటికే వచ్చిన ఎన్నో బాలీవుడ్ సినిమాల్లో ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నదే. అయినా ఈ చిత్రానికి ఆ రేటింగ్స్ కనిపించడంతో ఇవన్నీ పెయిడ్ రివ్యూస్ అని స్పష్టంగా అర్థం అవుతుందనే కమెంట్స్ వినిపిస్తున్నాయి.


ఇలాంటి మానిప్యులేటెడ్ రివ్యూస్ చేయించడంలో కరణ్ జోహార్ ఎక్స్ పర్ట్. దానికి తోడు ఇది అతనే డైరెక్ట్ చేయడంతో మరింత జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాడు అంటున్నారు. కాకపోతే కొన్ని ప్రాంతాల నుంచి నిజంగానే మంచి రివ్యూస్ కూడా వస్తున్నాయి. బాలీవుడ్ టాప్ క్రిటిక్ గా చెప్పుకునే తరణ్ ఆదర్శ్ కూడా ఏకంగా 4 రేటింగ్ ఇచ్చాడీ సినిమాకు. అన్ని ఎమోషన్స్ అద్భుతంగా సెట్ అయ్యాయి అంటూ సింగిల్ వర్డ్ రివ్యూగా “టెరిఫిక్” అనేశాడు. దీంతో అతనిపైనా సెటైర్స్ పడుతున్నాయి. ఏదేమైనా మొదటి నుంచి నిజాయితీగా ఉండి ఉంటే కరణ్ జోహార్ కు వచ్చిన ఈ రేటింగ్స్ ను కంట్రీ మొత్తం మెచ్చుకునేదే. అతను ఫేక్ రివ్యూస్ క్రియేట్ చేయడంలో ఎక్స్ పర్ట్ కాబట్టే స్వయంగా తన సినిమాకే ఆ సమస్య ఎదుర్కొంటున్నాడు. మరి నిజంగానే ఈ సినిమా బ్లాక్ బస్టరా కాదా అనేది వీకెండ్ తర్వాత కానీ తేలదు.

Related Posts