తొలి సినిమాతోనే సత్తా
రెబల్ స్టార్ కృష్ణంరాజు నటవారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంటరైన ప్రభాస్ తొలి సినిమా ‘ఈశ్వర్’ తోనే సక్సెస్ పుల్ హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు. పుల్ లెంగ్త్ మాస్ హీరోగా తొలిసినిమాలోనే ఆడియన్స్ అప్రిషియేషన్ పొందాడు. ఆరడుగులకు పైగా కటౌట్.. డ్యాన్స్, ఫైట్స్ ను అలవోకగా చెయ్యడం వంటి క్వాలిటీస్ తో.. రెండో సినిమా ‘రాఘవేంద్ర’లో నటుడిగా తన ప్రత్యేకతను చాటుకున్నాడు. అయితే.. యంగ్ రెబెల్ స్టార్ కు ‘రాఘవేంద్ర’ కెరీర్ పరంగా మైలేజ్ ఇవ్వలేకపోయింది.
స్టార్ డమ్ తీసుకొచ్చిన వర్షం
హీరోగా ప్రభాస్ కెరీర్ కు బ్రేక్ ఇచ్చిన సినిమా ‘వర్షం’. ప్రముఖ నిర్మాత యం.ఎస్.రాజు నిర్మించిన ‘వర్షం’ ప్రభాస్ కెరీర్ లో ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచిపోయింది. శోభన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్-త్రిష పెయిర్ కు మంచి క్రేజ్ ఏర్పడింది. ప్రభాస్ హీరోయిజానికి తోడు.. గోపీచంద్ విలనిజం బాగా పండడంతో ‘వర్షం’ సూపర్ హిట్ గా నిలిచింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం కూడా ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ కు ఎంతగానో హెల్పయింది.
ఫలించని ప్రయోగాలు.. ఛత్రపతికి శ్రీకారం..
‘వర్షం’ తరవాత సీనియర్ డైరెక్టర్ బి.గోపాల్ తో చేసిన ‘అడవిరాముడు’ సినిమా ప్రభాస్ కెరీర్ కు ప్లస్ కాలేదు. ఆ తర్వాత వచ్చిన కృష్ణవంశీ ‘చక్రం’ ప్రభాస్ ను నటుడిగా మరో మెట్టు ఎక్కించినా.. విజయాన్ని మాత్రం అందించలేకపోయింది.
వరుసగా రెండు ఫ్లాపుల తర్వాత వచ్చిన చిత్రమే ‘ఛత్రపతి’. ‘బాహుబలి సిరీస్ వంటి ప్రభంజనానికి పదేళ్ల ముందే ప్రభాస్-రాజమౌళి కలయికలో వచ్చిన చిత్రమిది. తల్లీకొడుకుల సెంటిమెంట్ తో వచ్చిన ఈ సినిమాలో అమ్మ ప్రేమ కోసం ఆరాటపడే శివాజీగా.. తనను నమ్ముకున్న వాళ్ల కోసం ఛత్రపతిగా ప్రభాస్ చెలరేగి నటించాడు. ‘ఛత్రపతి’ తర్వాత ప్రభాస్ ని వరుసబెట్టి ఫ్లాపులు పలకరించాయి.
‘పౌర్ణమి, యోగి, మున్నా’ ఆడియన్స్ ని ఏమాత్రం అలరించలేకపోయాయి. పూరి జగన్నాథ్ తో చేసిన ‘బుజ్జిగాడు’ కాస్త ఫర్వాలేదనిపించినా.. ‘ఏక్ నిరంజన్’ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.
అభిమానులందరికీ డార్లింగ్
కరుణాకరన్ రూపొందించిన ప్రేమకథా చిత్రం ‘డార్లింగ్’.. ప్రభాస్ ను తెలుగు ప్రేక్షకులకు డార్లింగ్ ను చేసింది. ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ను సరికొత్త లుక్ లో ఆడియన్స్ కు పరిచయం చేశాడు కరుణాకరన్. ఈ మూవీతో ప్రభాస్-కాజల్ జోడికి మంచి పేరొచ్చింది. ‘డార్లింగ్’ తర్వాత ‘మిస్టర్ పర్ ఫెక్ట్’తో మరో విజయాన్నందుకున్న ప్రభాస్ కి.. లారెన్స్ రూపొందించిన ‘రెబెల్’తో పెద్ద ఫ్లాప్ తప్పలేదు. ఇక.. యంగ్ రెబెల్ స్టార్ కెరీర్ ను మరోసారి పూర్తిస్థాయిలో మార్చిన చిత్రం ‘మిర్చి’. కొరటాల శివ దర్శకుడిగా పరిచయమైన ‘మిర్చి’ సంచలన విజయాన్ని సాధించింది.
‘బాహుబలి’కి ముందు ఆ తర్వాత
ఒకప్పుడు ప్రభాస్ తెలుగునాట ఎందరికో అభిమాన కథానాయకుడు. ఆ తరువాత టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరు. నేడు అంతర్జాతీయ స్థాయిలో ప్రభాస్ పేరు మారుమోగుతోంది. ‘బాహుబలి సీరిస్ తో ప్రభాస్ ఆ స్థాయిని సాధించాడు. తెలుగు, తమిళ, హిందీ భాషలవారిని మాత్రమే కాకుండా, మండేరియన్, జపనీస్ భాషల్లోనూ బాహుబలి సీరిస్ అనువాదమై అనూహ్య విజయం సాధించింది.
‘బాహుబలి’ సిరీస్ తర్వాత ప్రభాస్ కి మళ్లీ ఆ రేంజ్ హిట్ పడలేదు. ‘సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్’ అభిమానుల అంచనాలను అందుకోలేకపోయాయి. ప్రస్తుతం ప్రభాస్ నుంచి వస్తోన్న ‘సలార్, కల్కి 2898 ఎ.డి’ సినిమాలు పాన్ వరల్డ్ రేంజులో అలరించడానికి సిద్ధమవుతున్నాయి. మరోవైపు మారుతి డైరెక్షన్ లోనూ ఓ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమాల తర్వాత కూడా సందీప్ రెడ్డి వంగా వంటి కొంతమంది దర్శకులు లైన్లో ఉన్నారు.
ప్రభాస్ పేరు చెబితే చాలు అటు అభిమానులు.. ఇటు పరిశ్రమలోని వారు డార్లింగ్ అన్న పదాన్ని ఉచ్చరించకుండా ఉండలేరు. అంతలా అందరికీ డార్లింగ్ గా మారిపోయాడు ప్రభాస్. అందుకే తమ డార్లింగ్ మరింత బాగుండాలంటూ అభిమానులు ప్రభాస్ పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటూ సంతోషిస్తున్నారు. ఇక సినీజనం తమ డార్లింగ్ మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తున్నారు.