శ్మశానంలో ‘గీతాంజలి-2‘ టీజర్ లాంఛ్

2014లో తక్కువ బడ్జెట్‌ తో రూపొంది మంచి విజయాన్ని సాధించిన చిత్రం ‘గీతాంజలి‘. అంజలి టైటిల్ పాత్రలో నటించిన ఈ సినిమాకి సీక్వెల్ గా రూపొందుతోన్న చిత్రమే ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’. శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, సత్య, షకలక శంకర్, అలీ, బ్రహ్మాజీ, రవి శంకర్, రాహుల్ మాధవ్ ఇతర ప్రధాన పాత్రధారులు. కోన ఫిల్మ్స్ కార్పొరేషన్, ఎం.వి.వి.సినిమాస్ బ్యానర్స్‌ పై కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

‘గీతాంజలి-2’ చిత్రం అంజలికి ఎంతో ప్రత్యేకమైనదని చెప్పాలి. ఎందుకంటే అంజలి నటిస్తున్న 50వ చిత్రమిది. హారర్ కామెడీ జోనర్ లో కోన వెంకట్ రాసిన కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘నిన్నుకోరి, నిశ్శబ్దం‘ సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేసిన శివ తుర్లపాటి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

ఇప్పటికే రిలీజైన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది‘ ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ ను విభిన్నంగా విడుదల చేయబోతున్నారు. హారర్ జోనర్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా టీజర్ ను.. ఓ శ్మశానవాటికలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 24 రాత్రి 7 గంటలకు హైదరాబాద్ బేగంపేట శ్మశానంలో ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ టీజర్‌ ను విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన విడుదల చేసింది చిత్రబృందం.