ఈ ఏడాది బాక్సాఫీస్ బద్దలు కొట్టే చిత్రాలు

టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా లెవెల్ లో ఈ ఏడాది రాబోతున్న క్రేజీ మూవీస్ లో ముందుగా పలకరించేది ప్రభాస్ ‘కల్కి’. తెలుగు సినిమాల్లోనే కాదు.. ఇండియన్ మూవీస్ లో కూడా ఇప్పటివరకూ టచ్ చేయని ఓ యూనిక్ స్టోరీతో ‘కల్కి’ చిత్రాన్ని రూపొందిస్తున్నాడట డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఈ సినిమాకోసం ఓ కొత్త ప్రపంచాన్నే సృష్టిస్తున్నాడు. 2898 ఎడి బ్యాక్ డ్రాప్ తో రాబోతున్న ఈ మూవీలో అప్పటి కాలానికి సంబంధించిన వ్యక్తులను, వస్తువులను సరికొత్తగా డిజైన్ చేస్తున్నాడు. అలాగే.. ఈ సినిమాలో గతానికి సంబంధించిన కథ కూడా ఉండబోతుందట.

‘కల్కి’ చిత్రం మే లో ప్రేక్షకుల ముందుకు వస్తుంటే.. ఆగస్టులో ఆడియన్స్ ను అలరించడానికి రాబోతున్న మూవీ ‘పుష్ప 2’. ఇప్పటికే పుష్ప పార్ట్ 1 తో పాన్ ఇండియా హిట్ అందుకున్న అల్లు అర్జున్.. సీక్వెల్ తో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ సీక్వెల్ ను మరింత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడట. దేవిశ్రీప్రసాద్ తన మ్యూజిక్ తో మరోసారి మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా ఆగస్టు 15న ‘పుష్ప 2’ విడుదలకు ముస్తాబవుతోంది.

సెప్టెంబర్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ వస్తోంది. ఈ సినిమాతో వింటేజ్ పవన్ కళ్యాణ్ ను ఆవిష్కరించే ప్రయత్నంలో ఉన్నాడు డైరెక్టర్ సుజీత్. ఈ సినిమాలో పవర్ స్టార్ స్టైల్స్, స్వాగ్ అన్నీ సరికొత్తగా ఉండబోతున్నాయట. ఇప్పటికే ప్రచార చిత్రాలతో ‘ఓజీ’పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాకోసం పవన్ కళ్యాణ్ కొన్ని రోజులు డేట్స్ కేటాయిస్తే షూటింగ్ పూర్తవుతోందట. డి.వి.వి. ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణంలో రూపొందుతోన్న ‘ఓజీ’ సెప్టెంబర్ 27న విడుదల తేదీ ఖరారు చేసుకుంది.

అక్టోబర్ 10న దసరా కానుకగా వస్తోంది ఎన్టీఆర్ ‘దేవర’. ఆద్యంతం సముద్రం నేపథ్యంలో ఓ సరికొత్త విజువల్ ట్రీట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు డైరెక్టర్ కొరటాల శివ. బెస్ట్ టెక్నికల్ టీమ్ వర్క్ చేస్తున్న ఈ మూవీలో విలన్ గా బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ ఆలీ ఖాన్ కనిపించబోతున్నాడు. హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది. ఇప్పటికే చాలాభాగం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ‘దేవర’ సైమల్టేనియస్ గా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తిచేసుకుంటుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

మే నుంచి అక్టోబర్ వరకూ విడుదల తేదీలు ఖరారు చేసుకున్న ఈ నాలుగు బడా పాన్ ఇండియా మూవీస్ మాత్రమే కాకుండా.. ఈ ఏడాది ద్వితియార్థంలోనే రానున్న మరో క్రేజీ మూవీ ‘గేమ్ ఛేంజర్’. గ్రేట్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నాడు.

చరణ్ ద్విపాత్రాభినయంతో అలరించడానికి సిద్ధమవుతోన్న ఈ సినిమాలో కియరా అద్వానీ, అంజలి కథానాయికలుగా కనిపించబోతున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. త్వరలోనే ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన రానుందట

Related Posts