దేవిశ్రీ ప్రసాద్ జీవిత కల నెరవేరింది

సంగీత సాగరాన్ని మధించి, అమృతం లాంటి పాటలను అందించిన సంగీత జ్ఞాని ఇళయరాజా. సుమనోహర స్వరాలతో మదిమదినీ పులకింప చేసిన స్వరబ్రహ్మ అతను. సంగీతానికి కొత్త ఒరవడిని నేర్పాడాయన. స్వరాల జల్లుల్లో ప్రతి సంగీతాభిమానిని తడిపి ముద్ద చేసాడు. అలా ఇళయరాజా సంగీత ప్రభావంతో సంగీత దర్శకులుగా మారిన వారు ఎంతోమంది. అలాంటి వారిలో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఒకడు.

మాస్ట్రో ఇళయరాజా వద్ద శిష్యరికం చేయకపోయినా.. ఇసైఙ్ఞాని కి ఏకలవ్య శిష్యుడు దేవిశ్రీప్రసాద్. ఈ విషయాన్ని ఎన్నోసార్లు బాహటంగా చాటాడు. తన స్టూడియోలో ప్రత్యేకించి ఇళయరాజా ఫోటోని పెట్టుకున్నాడు. లేటెస్ట్ గా దేవిశ్రీ ప్రసాద్ జీవిత కల నెరవేరింది. మాస్ట్రో ఇళయరాజా తన స్టూడియోకి రావాలనేదే డి.ఎస్.పి. లైఫ్ టైమ్ డ్రీమ్ అట. అది తాజాగా నెరవేరినట్టు తెలిపాడు రాక్ స్టార్.

చిన్నప్పట్నుంచీ ఇళయరాజా సంగీతం వింటూ పెరిగిన తనకు.. సంగీత దర్శకుడిగా మారడానికి కూడా అతనే పెద్ద ఆదర్శం అంటూ ఓ స్పెషల్ నోట్ రాశాడు డి.ఎస్.పి. తన గురువు మాండలిన్ శ్రీనివాస్ పుట్టినరోజున తాను దైవంగా భావించే ఇళయరాజా తన స్టూడియోకి వచ్చినట్టు రాజాతో దిగిన ఫోటోలను షేర్ చేశాడు.

Related Posts