‘విశ్వంభర’లో చిరంజీవి డబుల్ ధమాకా..!

మెగాస్టార్ చిరంజీవికి డ్యూయల్ రోల్స్ కొత్తేమీ కాదు. గతంలో చాలా సినిమాల్లో ద్విపాత్రాభినయంతో దుమ్మురేపాడు చిరు. ఇక.. రీ-ఎంట్రీలో ‘ఖైదీ నంబర్ 150’లోనూ రెండు పాత్రల్లో కనిపించి.. ఫ్యాన్స్ ను ఖుషీ చేశాడు. ఇప్పుడు మళ్లీ ‘విశ్వంభర’ కోసం మెగాస్టార్ డ్యూయల్ రోల్ తో మురిపించబోతున్నాడనే ప్రచారం జోరుగా సాగుతోంది.

చిరంజీవి హీరోగా వశిష్ట తెరకెక్కిస్తున్న ‘విశ్వంభర’ ఆద్యంతం సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందుతోంది. ఈ మూవీలో చిరు మార్క్ కామెడీ ఉంటూనే.. యాక్షన్ ఘట్టాలు సాంకేతిక పరంగా అత్యున్నత స్థాయిలో ఉంటాయట. ముఖ్యంగా.. ‘విశ్వంభర’ ఇంటర్వెల్ ఎపిసోడ్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ అయితే గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంటుందట. ఆ సీక్వెన్స్ లోనే చిరంజీవికి సంబంధించి మరో క్యారెక్టర్ రివీల్ అవుతుందనేది ఫిల్మ్ నగర్ టాక్.

మొత్తంమీద.. వెండితెరపై వింటేజ్ చిరంజీవిని ఆవిష్కరిస్తూనే.. సిస్టర్ సెంటిమెంట్ తో సోషియో ఫాంటసీగా ‘విశ్వంభర’ని తీర్చిదిద్దుతున్నాడట వశిష్ట. చిరంజీవికి జోడీగా త్రిష నటిస్తుంది. ఈ సినిమాని యు.వి.క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఆస్కార్ విజేత కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. వచ్చే సంక్రాంతి కానుకగా ‘విశ్వంభర’ విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts