చంద్రమోహన్ ఇకలేరు..

సీనియర్ నటులు, కథనాయకులు చంద్రమోహన్ ఈ రోజు తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో 9.45 గంటలకు హృద్రోగంతో కన్ను మూశారు. ఆయన వయసు 82 ఏళ్ళు. ఆయనకు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోమవారం హైదరాబాద్ లో అంత్యక్రియలు జరుగుతాయి.

చంద్రమోహన్ కృష్ణా జిల్లాకు చెందిన పమిడిముక్కల గ్రామంలో 1942, మే 23న జన్మించారు. మల్లంపల్లి చంద్రశేఖరరావు. చదువు పూర్తయిన తర్వాత కొంతకాలం ఏలూరులో ఉద్యోగం చేశారు. అటుపై సినిమాలపై వ్యామోహంతో మద్రాస్ కు చేరుకున్నారు. అయితే అందర్లా ఎక్కువగా సినిమా కష్టాలు లేకుండానే ఆఫర్స్ తగిలాయి చంద్రమోహన్ కు. మొదటి సినిమా రంగుల రాట్నం.

1966లో ‘రంగుల రాట్నం’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు చంద్రమోహన్. సన్నగా రివటలా ఉండే అతనిది చూడగానే ఆకట్టుకునే రూపం కావడంతో చాలా తక్కువ టైమ్ లోనే ఎక్కువ మందికి చేరువయ్యారు. పైగా పరిశ్రమలో కొన్ని బంధుత్వాలు కూడా కలిసొచ్చాయి. దీంతో నాటి స్టార్ హీరోల సినిమాల్లో సహాయ పాత్రల నుంచి రెండో హీరోపాత్రల వరకూ ఎదిగారు.

సహాయ పాత్రల నుంచి ప్రధాన పాత్రలకు వచ్చిన తర్వాత చంద్రమోహన్ లక్కీ స్టార్ గా మారిపోయారు. అతని పక్కన నటించిన చాలామంది హీరోయిన్లు స్టార్ హీరోయిన్లయ్యారు. అప్పట్లో ఇండస్ట్రీకి కొత్తగా వస్తున్న ప్రతి హీరోయిన్ కల.. ఒక్కసారైనా చంద్రమోహన్ సరసన నటించాలని. అలా ‘సిరిసిరిమువ్వ’తో జయప్రద, ‘పదహారేళ్ల వయసు’తో శ్రీదేవి చంద్రమోహన్ తోనే హీరోయిన్లుగా పరిచయమయ్యారు. ఆ తర్వాత టాప్ హీరోయిన్స్ గా ఓ వెలుగువెలిగారు.

చంద్రమోహన్ కు దర్శకుడు కె.విశ్వనాథ్ దూరపు చుట్టం. ఆ పరిచయంతోనే సినిమాల్లోకి వచ్చారట. ఏదైతేనేం.. తర్వాత తన సొంత ప్రతిభతోనే నిలదొక్కుకున్నారు. ఎన్ని సినిమాలు చేసినా పాత్ర పాత్రకి వైవిధ్యం చూపుతూ రాణించాడు. ఈ విషయంలో చంద్రమోహన్ కి సాటి ఎవ్వరూ లేరంటారు ప్రముఖ దర్శకుడు రేలంగి నరసింహారావు. పాత్రకు తగ్గ ఆహార్యం, వాచకంపై స్పష్టమైన అవగాహన చంద్రమోహన్ సొంతం.

నేటి తరానికి చంద్రమోహన్ కామెడీ ఫాదర్ గానో, క్యారెక్టర్ ఆర్టిస్టుగానో మాత్రమే తెలుసు. కానీ అతను ‘ఒక్క అడుగు పొడుగు ఎక్కువగా ఉండి ఉంటే’ ఎప్పుడో సూపర్ స్టార్ అయిపోయేవాడని అప్పట్లో చాలామంది హీరోలు, దర్శక నిర్మాతలే కితాబునిచ్చేవారట. నిజమే.. అతనికి హైట్ చాలా వరకూ మైనస్ గా మారింది. అయితేనేం నటుడిగా ఎవరికీ తీసిపోనంత వెయిట్ అతని సొంతం.

చంద్రమోహన్ స్టార్ హీరోగా ఇమేజ్ సంపాదించారు. కానీ మరీ పెద్ద రేంజ్ కాదు. దీనికి తోడు అతనికి ఉన్న లక్కీ హ్యాండ్ ఇమేజ్ తో ఎంతో మంది అప్ కమింగ్ హీరోయిన్లు అతనితో నటించేవారు. అలాంటి వారిలో జయప్రద, శ్రీదేవి, మంజుల, తాళ్లూరి రామేశ్వరి, రాధిక, జయసుధ, ప్రభ, విజయశాంతి లాంటి హీరోయిన్లు చాలామందే ఉన్నారు. వీరంతా చంద్రమోహన్ తో నటించిన తర్వాతే స్టార్ హీరోయిన్లయ్యారు. ఓ రకంగా ఇలాంటి క్రెడిట్ ఇండియన్ సినిమా హిస్టరీలో మరే హీరోకూ లేదేమో..

తెలుగు తెర చంద్రుడు – చంద్రమోహన్ బర్త్ డే స్పెషల్ – Movie Volume

కామెడీ హీరోగానూ తిరుగులేని పాత్రలు చేశారు. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ తో చేసిన సినిమాలు పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాయి. అలాగే చిరంజీవితోనూ కొన్ని సినిమాల్లో ప్రధాన పాత్రలు చేశాడు. అలాగే తనూ సోలోగానూ ఆకట్టుకున్నడు. ఏం చేసినా చంద్రమోహన్ డిక్షన్ డిఫరెంట్ గా ఉండేది. పాత్రను ఆ డిక్షన్ తోనే పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేసేవారు..

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన తర్వాత చంద్రమోహన్ చేసిన ఎన్నో పాత్రలు ఉదాత్తంగా కనిపించాయి. అత్యంత రియలిస్టిక్ నటనతో ఎన్నో సినిమాలకు బ్యాక్ బోన్ గా నిలిచారు. హీరోగా తన ఇమేజ్ కనిపించకుండా క్యారెక్టర్ మాత్రమే ఎలివేట్ అయ్యేలా చంద్రమోహన్ నటనకు ఎన్నో సినిమాలు ఉదాహరణలుగా నిలిచాయి.

చంద్రమోహన్ లాంటి ఆర్టిస్టు మళ్లీ తెలుగు తెరకు దొరుకుతాడా అంటే కష్టమనే చెప్పాలి. ముఖ్యంగా కుర్ర హీరోల తండ్రిగా ఆయన చేసిన అల్లరి.. ఇప్పటి తరం వారికి బాగా గుర్తుంటుంది. ఎన్నో సినిమాల్లో కామెడీ హీరో అన్న తన పాత ఇమేజ్ ను గుర్తుకు తెస్తూ యంగ్ స్టర్స్ కు ఫాదర్ పాత్రల్లో అదరగొట్టారు.

Related Posts