అందానికే అసూయ పుట్టే అందం ఆమెది. ‘మోస్ట్ బ్యూటిఫుల్ ఫేస్ ఆన్ ది ఇండియన్ స్క్రీన్’ అనే ప్రశంసలు ఆమె సొంతం. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మొదలై.. ఉత్తరాదిని ఓ ఊపు ఊపిన ఆ అందాల కథానాయికే జయప్రద. ఏప్రిల్ 3, జయప్రద పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు బర్త్ డే విషెస్ చెబుతూ చిత్ర సీమలో జయప్రద సాగిన తీరును ఓసారి గుర్తుచేసుకుందాం.
డాక్టర్ అవ్వాలనుకుని యాక్టర్ అయ్యామంటారు చాలామంది నటీనటులు. జయప్రద కూడా అంతే. చిన్నప్పట్నుంచీ డాక్టర్ అవ్వాలని కలలుకన్న జయప్రద యాక్టర్ గా మారారు. 1962 ఏప్రిల్ 3న రాజమండ్రిలో జన్మించారు జయప్రద. చిన్నప్పుడే తల్లి తండ్రుల ప్రోత్సాహంతో సంగీతం, నృత్యంలో శిక్షణ తీసుకున్నారు. ఒకసారి పాఠశాల వార్షికోత్సవంలో జయప్రద నృత్య ప్రదర్శన చూసి ముగ్దుడైన ప్రముఖ నటుడు ప్రభాకర్ రెడ్డి ‘భూమికోసం’ చిత్రంలో చిన్న వేషం ఇప్పించారు. అలా.. మొదలైన జయప్రద నట ప్రస్థానం ఆ తర్వాత అప్రతిహాసంగా కొనసాగింది.
‘భూమికోసం’ చిత్రం తర్వాత బాలచందర్ తెరకెక్కించిన ‘అంతులేని కథ’, బాపు తీసిన ‘సీతాకళ్యాణం’ చిత్రాలు నటీమణిగా జయప్రదని చిత్రసీమలో నిలబెట్టాయి. ‘మోస్ట్ బ్యూటిఫుల్ ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమా’ అని దిగ్ధర్శకుడు సత్యజిత్ రే ఊరికేనే అనేశారా? బాపుగారి ‘సీతాకళ్యాణం’లో జయప్రద లో అద్భుతమైన గ్రేస్ కనిపిస్తుంది. పిల్లతెమ్మెర లాంటి పల్చటి అందం తళుక్కున మెరుస్తూ ఉంటుంది. సీతగా కళ్లతోనే భావాలు పలికించే తీరు కమనీయం.
జయప్రద లో ఉన్న అందమైన నటిని ప్రేక్షకుల ముందు ఆవిష్కరించిన చిత్రం మాత్రం నిస్సందేహంగా ‘సిరిసిరిమువ్వే’. నృత్య కళకి అంకితమైన ఓ మూగ అమ్మాయి హృదయ వేదనను జయప్రద చాలా చక్కగా పలికించారు. పాటల్లో జయప్రద నటన ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో. ముఖ్యంగా గోదారల్లే…వెన్నెలా గోదారల్లే పాటలో తనలో ఉన్న మ్యాజిక్ అర్ధం అవుతుంది. జయప్రద చాలా చిన్న వయసులోనే డాన్స్ నేర్చేసుకుంది. ఆ కారణంగానే తన ముఖంలో భావాలు అద్భుతంగా పలుకుతాయి. సైకిలాజికల్ ఇబ్బంది ఉన్న పాత్రలో సైతం చక్కటి నటనను కనపరిచారు జయప్రద. నిజానికి ‘భద్రకాళి’లో జయ చేసిన పాత్ర అప్పటికి తనకు వయసుకు మించిన పాత్రే.
జయప్రద తెరంగేట్రం చేసే నాటికి జయసుధ హీరోయిన్ గా నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉంది. జయప్రద ఎంట్రీ ఇస్తూనే స్టార్ హీరోల సరసన ఛాన్సులు కొట్టేసింది. అల్లరిపిల్లగా మొదలై…సమస్యలను అర్ధం చేసుకునే స్థాయికి ఎదిగిన పాత్రలో జయప్రద మోస్ట్ గ్లామరస్ గా కనిపిస్తుంది ‘అడవిరాముడు’ సినిమాలో. పాటల టేకింగ్ లో రాఘవేంద్రరావు తనదైన మార్క్ చూపించిన చిత్రం కూడా అడవిరాముడే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘అడవి రాముడు’, తాతినేని రామారావు తీసిన ‘యమగోల’ చిత్రాలు జయప్రదకు కమర్షియల్ ఇమేజ్ తీసుకొస్తే.. కె.విశ్వనాథ్ రూపొందించిన ‘సిరిసిరిమువ్వ’ నటీమణిగా ఓ మెట్టుని ఎక్కించింది.
బాలచందర్ ‘అంతులేనికథ, మన్మధలీల’ సినిమాల్లో గ్లామర్ తో పాటు బాధ్యతాయుత పాత్రల్లో కనిపిస్తారు జయప్రద. వీటికి భిన్నంగా మరణానికి చేరువైన ఓ యువతి పాత్రలో నటించి మెప్పించారు. కాలం నా తాళం కనుమూస్తే శూన్యం అంటూ సాగే ఆ చిత్రం పేరు అందమైన అనుభవం. మనకు తెల్సిన జయప్రదే…ఈ చిత్రంలో చాలా కొత్తగా కనిపిస్తారు.
జయప్రద అంటే కళాతపస్వి కె.విశ్వనాథ్ కు ప్రత్యేకమైన అభిమానం. తనకు ఏం కావాలో చేసి చూపించి మరీ చేయించుకునేవారాయన. విశ్వనాథ్ మనసెరిగి నటించే వారు జయప్రద. అందుకే ‘సాగరసంగమం’లో మాధవి పాత్ర జయసుధతో చేయించాలని నిర్మాత ఏడిద పట్టుపట్టినా…విశ్వనాథ్ అంగీకరించలేదు.
సాంఘిక చిత్రాల్లోనే కాకుండా పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాల్లోనూ తనదైన నటనతో కనువిందు చేసిన సొగసరి జయప్రద. తన అందానికి క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అందరి మన్ననలు అందుకున్న నటీమణి జయప్రద. పాత్ర ఏదైనా.. అందులో ఒదిగి నటించడమే ఆమెకు తెలుసు. తెలుగులో దాదాపు అప్పటి అగ్ర కథానాయకులందరితో కలిసి నటించారు జయప్రద. ముఖ్యంగా యన్టీఆర్-జయప్రద కాంబినేషన్ అదుర్స్ అనేంతగా మాస్ ప్రేక్షక నీరాజనం అందుకుంది.
ఏఎన్నార్ తో కలిసి నటించిన ‘మేఘసందేశం’ చిత్రంలో జయప్రద పాత్ర ఎంతో ప్రత్యేకమైంది. ఈ చిత్రంలో నాగేశ్వరరావు ప్రియురాలిగా ఆమె నటనాట్యాభినయాలు నభూతో అనాల్సిందే. జయప్రద కెరీర్ లోనే ప్రత్యేకమైన పాత్ర ‘మేఘసందేశం’ చిత్రంలో చేశారు. చెలిమియే కరువై వలపే అరుదై అందరూ ఉండీ ఒంటరిగా మిగిలిపోయే పరిస్థితి అనేక జీవితాల్లో కనిపిస్తుంది. ఆ దాహం తీర్చే మనిషి కనిపించినప్పుడు మనసు వద్దన్నాఅటు పరుగులు తీస్తుంది. ఒక ఆత్మీయ బంధాన్ని ఏర్పరుచుకుంటుంది. అలాంటి బంధాన్ని ఆవిష్కరించే పాత్రలో ‘మేఘసందేశం’లో కనిపిస్తారు జయప్రద.
జయప్రద హీరో కృష్ణ తో కలిసి ఎక్కువ చిత్రాల్లో నటించారు. ‘ఊరికి మొనగాడు’, ‘ముందగుడు’, ‘సింహాసనం’ వంటి సినిమాలు వీరి కలయికలో సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇక.. శోభన్ బాబుతో జయప్రదది సెపరేట్ కెమిస్ట్రీ. వీరిద్దరి కలయికలో ‘స్వయంవరం’, ‘దేవత’ వంటి హిట్ చిత్రాలు వచ్చాయి. ఇంకా.. కృష్ణంరాజుతో ‘తాండ్ర పాపారాయుడు’, ‘రంగూన్ రౌడీ’, ‘సీతారాములు’.. చిరంజీవితో ’47 రోజులు’, ‘వేట’.. కమల్ హాసన్ తో ‘సాగర సంగమం’ వంటి చిత్రాలలో నటించారు జయప్రద.
తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఉత్తరాదికి వెళ్లి అక్కడ విజయకేతనం ఎగరవేసిన కథానాయికల్లో ముందు వరుసలో నిలుస్తుంది జయప్రద. కె.విశ్వనాథ్ ‘సర్గమ్’ చిత్రంతో హిందీ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు జయప్రద. తెలుగులో వచ్చిన ‘సిరిసిరిమువ్వ’ కు ‘సర్గమ్’ రీమేక్. ఆ తరువాత అమితాబ్, జితేంద్ర, ధర్మేంద్ర వంటి అగ్రనటులతో నటించి ఉత్తరాదిన సైతం తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దాదాపు ఎనిమిది భాషలలో తన నటనతో ప్రేక్షకులను ముగ్దులను చేశారు జయప్రద. సినిమాలతో పాటు రాజకీయాలలోనూ తనదైన ముద్రవేశారు. కొన్నాళ్లుగా సెకండ్ ఇన్నింగ్స్ కోసం ప్రయత్నిస్తున్నా.. సరైన పాత్రలు పడకపోవడంతో కాస్త వెనకబడి ఉన్నా.. తనదైన ఛరిష్మాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచే ఉంటారు జయప్రద. ఈరోజు జయప్రద పుట్టినరోజు సందర్భంగా అందాల తారకు మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతుంది తెలుగు 70 ఎమ్.ఎమ్.