చిన్న సినిమాల మధ్య పెద్ద పోటీ

తెలుగులో వారం వారం కొత్త సినిమాల సందడి కొనసాగుతూనే ఉంది. గత కొన్ని నెలలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఒక్కో వారం రెండు, మూడు సినిమాలు విడుదలవుతూనే ఉన్నాయి. అయితే.. ఈవారం మాత్రం చిన్న సినిమాలదే హవా. పేరుకు చిన్న చిత్రాలే అయినా.. ఒక్కో సినిమాది ఒక్కో ప్రత్యేకత. అందుకే.. రేపు రాబోతున్న చిన్న సినిమాల మధ్య పెద్ద పోటీయే నెలకొంది. ఆ చిత్రాలే ‘కీడా కోలా, పొలిమేర 2, నరకాసుర’.

ముందుగా ‘కీడా కోలా’ చిత్రం విషయానికొస్తే.. టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ రూపొందించిన సినిమా ఇది. తొలి చిత్రం ‘పెళ్లి చూపులు’తోనే జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్నాడు తరుణ్. ఆ తర్వాత యూత్ ఫుల్ కంటెంట్ తో ‘ఈనగరానికి ఏమైంది’ తీసి మంచి ప్రశంసలు పొందాడు. కాస్త గ్యాప్ తర్వాత మళ్లీ తన మార్క్ కథాంశంగా ‘కీడా కోలా’ని తీర్చిదిద్దాడు. ’30 వెడ్స్ 21′ ఫేమ్ చైతన్య రావు ప్రధాన పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమాలో రవీంద్ర విజయ్, విష్ణు, రాగ్ మయూర్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇంకా.. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఈ సినిమాలో మరో పూర్తిస్థాయి పాత్రతో వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాడు. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కూడా కీ రోల్ లో నటించాడు. ఇప్పటికే ప్రచార చిత్రాలతో ‘కీడా కోలా’పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

రేపే విడుదలవుతోన్న మరో చిత్రం ‘పొలిమేర 2’. డైరెక్ట్ ఓటీటీలో రిలీజైన ‘మాఊరి పొలిమేర’ చిత్రానికి ఇది సీక్వెల్. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల ప్రధాన తారాగణం కాగా.. ఈ చిత్రంలో బాలాదిత్య, రాకేందు మౌళి ఇతర పాత్రలు ముఖ్య పోషించారు. డా.అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో గౌరికృష్ణ ఈ సినిమాని నిర్మించారు. మొదటి భాగం మంచి విజయాన్ని సాధించడంతో ‘పొలిమేర 2’పై అంచనాలు భారీగానే ఉన్నాయి.

‘పలాస’ సినిమాతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు రక్షిత్ అట్లూరి’. ‘పలాస’ తరహాలోనే ఈ యంగ్ హీరో నటించిన మరో విలక్షణమైన సినిమా ‘నరకాసుర’. రక్షిత్ కి జోడీగా అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ నటించారు. సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్స్ లో డాక్టర్ అజ్జా శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమాకి సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకుడు. ముందుగా పాన్ ఇండియా అనుకున్నప్పటికీ కేవలం తెలుగులోనే ఈ సినిమాని విడుదల చేస్తున్నారు.

ఈ మూడు సినిమాలతో పాటు ‘విధి’ సినిమా కూడా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇంకా.. నవంబర్ 4న శివరాజ్ కుమార్ అనువాద చిత్రం ‘ఘోస్ట్’ కూడా ఆడియన్స్ ముందుకు వస్తోంది. మరి.. ఈ వారం విడుదలవుతోన్న చిత్రాలలో ఏ ఏ చిత్రాలు ఏ రీతిన అలరిస్తాయో చూడాలి.

Related Posts