భైరవద్వీపం రీ రిలీజ్

నందమూరి బాలకృష్ణ మాస్ హీరోగా తిరుగులేని ఫాలోయింగ్ ఉన్నా.. ఆయన టచ్ చేసినన్ని జానర్స్ ఇంకెవరూ టచ్ చేయలేదంటే అతిశయోక్తి కాదు. మాస్, క్లాస్, యాక్షన్, ఫ్యాక్షన్, ఫిక్షన్, ఫాంటసీ, పౌరాణికం, జానపదం ఇలా అన్ని జానర్స్ లోనూ సినిమాలు చేసి అదరగొట్టాడు బాలయ్య.

విశేషం ఏంటంటే.. ఆయన చేసిన అన్ని జానర్స్ లోనూ అద్భుతమైన విజయాలు అందుకున్నాడు. అలా ఆయన చేసిన జానపద సినిమాల్లో ఒకటి భైరవద్వీపం ఒకటి. సింగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రోజా హీరోయిన్. పూర్ హీరో, రాణితో ప్రేమలో పడటం.. మాంత్రికుడు ఆమెను ఎత్తుకుపోవడం.. ప్రాణాలకు తెగించి తన ప్రేయసిని కాపాడుకోవడం.. ఆ తర్వాత తనూ ఓ రాజకుమారుడినే అని తెలుసుకోవడం.. ఈ ఫార్ములాలోనే వచ్చినా.. భైరవద్వీపం తెలుగులో చాలా గ్యాప్ తర్వాత వచ్చిన జానపదం కావడంతో అప్పట్లో బ్లాక్ బస్టర్ అయింది.

1994 ఏప్రిల్ 14న విడుదలైన భైరవద్వీపం తెలుగు ఫాంటసీ మూవీస్ లోనే ఓ ల్యాండ్ మార్క్ గా నిలిచిపోయింది. రోజా గ్లామర్, రంభ ఐటెమ్ సాంగ్, బాబూమోహన్ కామెడీ, కేఆర్ విజయ ప్రెజెన్స్ మాంత్రికుడు పాత్రలో నటించిన విజయరంగరాజు.. ఇలా అన్ని విషయాల్లోనూ స్పెషల్ అనిపించుకున్న ఈ చిత్రానికి ఏకంగా 9 నంది అవార్డులు రావడం విశేషం. ముఖ్యంగా తన కెరీర్ మొత్తం ఎన్నో ప్రయోగాలు చేస్తూ బ్లాక్ బస్టర్స్ అందుకున్న సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వ మాయాజాలం మైమరపిస్తుంది. అలాగే మాధవపెద్ది సురేష్‌ సంగీతం, పాటలు ఇప్పుడు విన్నా అద్భుతం అనిపిస్తాయి. ఎప్పుడు చూసినా అన్ని వయసుల వారిని ఆకట్టుకునే ఈ జానపద గాథ మరోసారి ప్రేక్షకుల ముదుకు రాబోతోంది.


యస్.. ఇప్పుడున్న రీ రిలీజ్ ట్రెండ్ లో భైరవ ద్వీపం మళ్లీ విడుదల కాబోతోంది. 4కే టెక్నాలజీకి అనుగుణంగా అప్డేట్ చేసుకుని ఆగస్ట్ 5న విడుదల కాబోతోందీ చిత్రం. ఎలా చూసినా.. పిల్లలు, పెద్దలు ఎంజాయ్ చేసే సినిమా ఇది. జానపదం కాబట్టి దీనికి టైమ్ బౌండరీస్ ఉండవు. అందుకే ఈ సారి ఫ్యామిలీస్ అంతా కలిసి కూడా వెళ్లి చూసే సినిమా అవుతుంది. మరి ఈ రీ రిలీజ్ లో ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూద్దాం.

Related Posts