బాలీవుడ్ హీరోలు విలన్స్ గా మెప్పిస్తారా?

టాలీవుడ్ ఇప్పుడు బాలీవుడ్ కి ఏమాత్రం తీసిపోని రీతిలో దూసుకెళ్తోంది. అందుకే ఒకప్పుడు తెలుగు చిత్ర సీమను చిన్న చూపు చూసిన బాలీవుడ్ స్టార్స్ ఏరికోరి తెలుగు సినిమాలలో నటించడానికి సై అంటున్నారు. ఈవరుసలో ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్స్ ముందుండగా ఇప్పుడు బాలీవుడ్ హీరోస్ కూడా ఒక్కొక్కరిగా టాలీవుడ్ కి క్యూ కడుతున్నారు.

సినిమాల సంఖ్యా పరంగానే కాదు.. బడ్జెట్ పరంగానూ, స్టార్ స్టేటస్ పరంగానూ, బిజినెస్ పరంగానూ, ఇండియాలోనే నంబర్ వన్ ఇండస్ట్రీగా దూసుకెళ్తుంది టాలీవుడ్. ఈకోవలోనే అన్ని ఇండస్ట్రీల చూపు తెలుగు చిత్ర సీమపైనే ఉంది. నేటితరం బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ శ్రధ్దా కపూర్, అలియా భట్ వంటి వారు ఇప్పటికే తెలుగు సినిమాలలో నటించగా.. మరో ఇద్దరు బీటౌన్ స్టార్స్ దీపిక పదుకొనె, జాన్వీ కపూర్ త్వరలో తెలుగు సినిమాలతో అలరించడానికి రెడీ అవుతున్నారు. హీరోయిన్సే మాత్రమే కాదు బాలీవుడ్ హీరోలు కూడా ఒక్కొక్కరుగా టాలీవుడ్ కి పరిచయమవుతున్నారు.

బాలీవుడ్ లో హీరోగా పలు సూపర్ హిట్స్ అందించిన సైఫ్ ఆలీ ఖాన్.. ఇప్పుడు తెలుగు సినిమాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాడు. ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ శ్రీరాముడుగా నటించిన ‘ఆదిపురుష్‘ మూవీలో లంకేశుడిగా కనిపించిన సైఫ్.. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘దేవర‘ మూవీలో ప్రధాన ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో భైర పాత్రలో విలనిజాన్ని ప్రదర్శించబోతున్నాడు.

మరో బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ కూడా టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నాడు. నటసింహం బాలకృష్ణ-అనిల్ రావిపూడి కాంబోలో రూపొందుతోన్న ‘భగవంత్ కేసరి‘ చిత్రంలో రాహుల్ సంఘ్వీ పాత్రలో కనిపించబోతున్నాడు. దసరా కానుకగా అక్టోబర్ 19న ‘భగవంత్ కేసరి‘ విడుదలకు ముస్తాబవుతోంది.

బాలీవుడ్ లో ‘గుప్త్, సోల్జర్, హౌప్ ఫుల్ 4‘ వంటి సూపర్ హిట్స్ అందుకున్న బాబీ డియోల్.. పవన్ కళ్యాణ్ పీరియాడ్ డ్రామా ‘హరిహర వీరమల్లు‘తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. మొఘలుల కాలం నాటి కథతో క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కీలకమైన ఔరంగజేబ్ పాత్రలో కనిపించబోతున్నాడట బాబీ డియోల్. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు‘ షూట్ లో పాల్గొన్నాడు బాబీ. కానీ పవన్ పాలిటిక్స్ తో బిజీగా ఉండడంతో ‘హరి హర వీరమల్లు‘ షూటింగ్ కి కొంతకాలంగా బ్రేకొచ్చింది.

మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ‘ మూవీతో మరో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ తెలుగు తెరకు పరిచయమవుతున్నాడు. ఇప్పటికే ఇమ్రాన్ కూడా ‘ఓజీ‘ సెట్స్ లో పాల్గొన్నాడు. ఇక వెంకటేశ్ ‘సైంధవ్‘ మూవీలో మరో బాలీవుడ్ స్టార్ నవజుద్దీన్ సిద్ధిఖీ విలన్ గా కనిపించబోతున్నాడు. ‘సైంధవ్‘ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా విడుదలకు ముస్తాబవుతోంది.

బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ కూడా ‘డబుల్ ఇస్మార్ట్‘తో టాలీవుడ్ ఆడియన్స్ ను పలకరించబోతున్నాడు. రామ్-పూరి జగన్నాథ్ కాంబోలో ‘ఇస్మార్ట్ శంకర్‘కి సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ మూవీలో సంజయ్ దత్ ‘బిగ్ బుల్‘ రోల్ లో కనువిందు చేయబోతున్నాడు. సంజయ్ దత్ గతంలో నాగార్జున ‘చంద్రలేఖ‘ సినిమాలో కేమియోలో మురిపించాడు.

బాలీవుడ్ వెటరన్ హీరో అమితాబ్ బచ్చన్.. అక్కినేని ‘మనం‘ మూవీలో అతిథిగా మురిపించి.. ఆ తర్వాత చిరంజీవి ‘సైరా‘లో ఎక్స్ టెండెడ్ కేమియోలో కనిపించాడు. ఇక.. ఇప్పుడు ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె‘తో ఫుల్ లెన్త్ రోల్ లో అలరించడానికి సిద్ధమయ్యాడు బడా బచ్చన్.

మొత్తంమీద బాలీవుడ్ టు టాలీవుడ్ అంటోన్న ఈ స్టార్స్ లో.. ఎవరెవరు ఇక్కడ సక్సెస్ ఫుల్ కెరీర్ కొనసాగిస్తారో చూడాలి.

Related Posts