అట్లీ నెక్ట్స్ హీరో తెలుగు నుంచేనా

అట్లీ ప్రూవ్ చేసుకున్నాడు. ఒక్కో సినిమాతో ఎదుగుతూ.. బాలీవుడ్ వరకూ వెళ్లాడు. సౌత్ వారికి పాత కథే అయినా ప్రభావవంతంగా చెప్పగలిగాడు. జవాన్ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దేశవ్యాప్తంగా తిరుగులేని టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ సినిమా పఠాన్ రికార్డ్స్ ను బద్ధలు కొడుతుందనే విశ్లేషణలు ఎప్పుడో మొదలయ్యాయి. అంటే వెయ్యి కోట్లు కలెక్షన్స్ దాటాలి. ఈ ఊపు, టాకూ చూస్తోంటే అదేమంత కష్టం కాదు అంటున్నారు చాలామంది. కంప్లీట్ సౌత్ ఫ్లేవర్ తో బాలీవుడ్ సినిమా తీసి బ్లాక్ బస్టర్ కొట్టాడు అట్లీ. నిజానికి షారుఖ్ ఖాన్ కూడా బ్లైండ్ గా అట్లీకి సరెండర్ అయ్యాడు. అతను చెప్పిందంతా చేసినట్టు కష్టపడ్డాడు. ఇటు అట్లీ తనను తాను నమ్ముకున్నాడు కాబట్టి.. ఈ బ్లాక్ బస్టర్ టాక్ సాధ్యం అయింది. మరి ఇంత పెద్ద హిట్ కొట్టిన దర్శకుడి వెంట హీరోలు పడకుండా ఉంటారా..? బట్ అతను మాత్రం ఓ తెలుగు హీరో కోసం చూస్తున్నాడు.


అట్లీ తెలుగులో ఎన్టీఆర్ తో సినిమా చేయాల్సి ఉంది. మైత్రీ మూవీస్ బ్యానర్ ఈ కాంబినేషన్ ను సెట్ చేసింది. బట్ ఈ ప్రాజెక్ట్ ఎందుకో వర్కవుట్ కాలేదు. అసలు ఉంటుందా లేదా అనేది కూడా చెప్పలేం. ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో ఉన్నాడు. అతనితోనే చేయాలి అంటే 2026 వరకూ ఆగాల్సి ఉంటుంది. బట్ ఆ లోగానే అట్లీ.. అల్లు అర్జున్ తో సినిమా చేయాలనుకుంటున్నాడు. ఈ వార్త కొన్ని రోజులుగా బలంగా వినిపిస్తోంది. ఆల్రెడీ ఐకన్ స్టార్ కు ఓ లైన్ చెప్పాడనీ.. ఆ లైన్ నచ్చినా.. అతను జవాన్ రిజల్ట్ కోసం వేచి చూడాలనుకున్నాడు. జవాన్ వచ్చింది. సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.


ఏ స్టార్ అయినా.. తను చేయబోయే దర్శకుడి ముందు సినిమా ఫలితం కోసం చూస్తాడు. కొంతమంది మాత్రమే వాటితో పనిలేకుండా ప్రాజెక్ట్ సెట్ చేసుకుంటారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అట్లీ జవాన్ రిజల్ట్ కోసం చూశాడు. తను అనుకున్న దానికంటే గట్టి సౌండే వినిపిస్తోంది. సో.. ఇక ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అనే వార్తలు టాలీవుడ్ లో స్ట్రాంగ్ గా వినిపిస్తున్నాయి. అట్లీ తరహా హీరో ఎలివేషన్స్ లో అల్లు అర్జున్ నెక్ట్స్ లెవల్ మాస్ మూవీ చేస్తాడేమో చూడాలి.

Related Posts