మలయాళం సినిమా సెట్లోకి అడుగుపెట్టిన స్వీటీ

‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి‘ తర్వాత అందాల అనుష్క నటించే తెలుగు సినిమాలపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే.. విలక్షణ దర్శకుడు క్రిష్ డైరెక్షన్ లో అనుష్క ఓ సినిమా చేయబోతుందనే ప్రచారం ఉంది. ఇదిలా ఉంటే తాను కమిటైన ఫస్ట్ మలయాళం మూవీ ‘కథనార్‘ సెట్స్ లోకి అడుగుపెట్టింది అనుష్క.

మలయాళం స్టార్ జయసూర్య హీరోగా అనుష్క హీరోయిన్ గా ‘కథనార్‘ సినిమా రూపొందుతోంది. తొమ్మిదో శతాబ్దం నాటి కేరళ కథాంశంతో ‘కథనార్‌- ది వైల్డ్‌ సోర్సెరర్‌’ ను రోజిన్‌ థామస్‌ తెరకెక్కిస్తున్నారు. తాజాగా అనుష్క ఈ మూవీ షూటింగ్ లో పాల్గొన్నట్టు దర్శకుడు రోజిన్ థామస్ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. ‘అనుష్క శెట్టి ‘కథనార్‌‘లో భాగం అయ్యారు. ఆమెతో కలిసి వర్క్‌ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది‘ అంటూ మెస్సేజ్ పెట్టాడు డైరెక్టర్.

‘కథనార్‘ సినిమాలో నీలి అనే దేవదాసి పాత్రలో కనిపించనుందట అనుష్క. కేరళ జానపద పాటల్లో నీలి పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆ జానపదాల్లో ఆమెను అందమైన దేవత రూపంలో ఉండే దెయ్యంగా అభివర్ణిస్తారు. ఈనేపథ్యంలో.. ఈ చిత్రంలో అనుష్క ఘోస్ట్ రోల్ లోనూ కనిపించబోతుందనే ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాని వచ్చే యేడాది.. 14 భాషల్లో విడుదల చేసేలా దర్శకనిర్మాతలు ప్రణాళిక చేస్తున్నారు.

Related Posts