ఇక అల్లు అర్జున్ ను ఆపతరమా..

ఐకన్ స్టార్ అల్లు అర్జున్ ఉత్తమ నటుడుగా జాతీయ పురస్కారం వచ్చిన తర్వాత అతని రేంజ్ డబుల్ అవుతుందని చెప్పాలి. ఈ సినిమాకు ముందు అల వైకుంఠపురములో సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు. కాకపోతే ఆ క్రేజ్ లో ఎక్కువ శాతం పాటలదే ఉంది. అయినా అతని డ్యాన్సులు ఆకట్టుకున్నాయి. పుష్ప ది రైజ్ తో కంట్రీ మొత్తం ఆకట్టుకున్నాడు.

ముఖ్యంగా నటన, స్లాంగ్, మేనరిజం, ఊతపదం.. ఇవన్నీ చాలా చాలా పాపులర్ అయ్యాయి. నిజంగా ఓ స్టార్ హీరో ఇలాంటి సాహసం చేయడం మొదట ఆశ్చర్యం అనుకున్నారు కానీ సాహసం చేశాడు కాబట్టే ఇవాళ 70యేళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఉత్తమ నటుడు అవార్డ్ అందుకున్న మొదటి హీరోగా చరిత్ర సృష్టించాడు అల్లు అర్జున్. ఇప్పటికే పుష్ప ది రైజ్ బ్లాక్ బస్టర్ అయి ఉంది. ఈ నేషనల్ అవార్డ్ తో ఇక పుష్ప 2కు వచ్చే క్రేజ్ మామూలుగా ఉండదు అనుకోవచ్చు.


ఈ నేషనల్ అవార్డ్ ను ఊహించారా అన్నట్టుగా ఈ రెండో పార్ట్ మొదలు కావడానికి చాలా టైమ్ తీసుకున్నారు మేకర్స్. ముఖ్యంగా కథలో అనేక మార్పులు చేశారు. ఫస్ట్ పార్ట్ లో వచ్చిన విమర్శలను గట్టిగానే పరిగణలోకి తీసుకున్నట్టుగా ఉన్నారు. ఆ క్రమంలోనే రెండో భాగం విషయంలో అలాంటి కమెంట్స్ రాకుండా ఉండాలని.. కథ విషయంలో చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకే ఓ దశలో అసలు ఈ మూవీ ఉంటుందా అనే డౌట్స్ కూడా క్రియేట్ చేశారు. మొత్తంగా ప్రారంభం అయింది. ఇంకా మార్పులు చేయాల్సి వస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించరు అంటున్నారు.


నేషనల్ అవార్డ్ వల్ల కేవలం అల్లు అర్జున్ కు మాత్రమే కాదు.. ఈ మూవీ బిజినెస్ వెయిట్ కూడా పెరుగుతుందనేది నిజం. పుష్ప ది రూల్ బిజినెస్ ను ఆపడం ఎవరి తరం కాదు. అటు మేకర్స్ కూడా ఈ మూవీ బిజినెస్ విషయంలో ఈ సారి స్ట్రాంగ్ గా నే ఉంటారు. ఎటూ దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంది కాబట్టి.. ఆ స్థాయిలోనే బిజినెస్ కూడా జరుగుతుంది. ఈ అవార్డ్ తో పాటు అతని సినిమాల లైనప్ చూస్తుంటే ఇక టాలీవుడ్ లో అల్లు అర్జున్ ను ఆపతరమా అనిపిస్తే ఆశ్చర్యం ఏం లేదు.

Related Posts