అసలు సిసలు అల్టిమేట్ స్టార్ అజిత్ కుమార్

తమిళ చిత్ర పరిశ్రమలోని అగ్ర కథానాయకుల్లో అజిత్‌ పేరు ప్రముఖంగా చెప్పుకోవాలి. మాస్‌ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న అల్టిమేట్ స్టార్ అజిత్ కుమార్. 1971, మే 1న జన్మించాడు అజిత్ కుమార్ సుబ్రహ్మాణ్యం. అతని తండ్రి సుబ్రహ్మాణ్యం తమిళనాడు తంజావూరుకు చెందిన వాడు. తల్లి మోహిని కోల్ కత్తాకు చెందినది. అయితే..
ఆశ్చర్యకరంగా అజిత్ పుట్టి, పెరిగింది మన హైదరాబాద్ లోనే. సికింద్రాబాద్ చుట్టు పక్కలే అజిత్ కుమార్ పెరిగాడు. అజిత్ ని ఫ్యాన్స్ కాదల్ మన్నన్, అల్టిమేట్ స్టార్, తల అంటూ ముద్దుపేర్లతో పిలచుకుంటారు.

పదోతరగతి వరకు మాత్రమే చదివినా, అనేక భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు అజిత్. ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ ద్వారా రాయల్ ఎన్ ఫీల్డ్ కంపెనీలో మెకానిక్ గా పనిచేయడానికి అప్రెంటీస్ గా చేరాడు అజిత్. ఆరు నెలలు పనిచేసిన తర్వాత అక్కడ మానేశాడు. ఏదైనా వైట్ కాలర్ జాబ్ మాత్రమే చేయాలని నిర్ణయించుకున్న అజిత్.. ఆ తర్వాత చాలా జాబ్స్ చేశాడు. బిజినెస్ డెవలపర్ గా, గార్మెంట్ ఎక్స్ పోర్టింగ్ కంపెనీలో అప్రెంటీస్ గా.. రకరకాల ఉద్యోగాలు చేశాడు. ముగ్గురు స్నేహితులతో కలిసి టెక్స్ టైల్ బిజినెస్ కూడా మొదలుపెట్టాడు. అయితే.. సిల్వర్ స్క్రీన్ పై అల్టిమేట్ స్టార్ అవ్వాలని రాసుంటే.. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి.

తన బిజినెస్ లో భాగంగా కొన్ని మోడలింగ్ అసైన్ మెంట్స్ చేశాడు అజిత్. ఆ సమయంలో ఫేమస్ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ కంట్లో పడ్డాడు. అప్పుడు హెర్కులస్ సైకిల్ అండ్ మోటార్ కంపెనీ అడ్వర్ టైజ్ మెంట్ షూట్ చేస్తున్న పి.సి. శ్రీరామ్ సూచనల మేరకే అజిత్ నటుడిగా మారాలకున్నాడు.

తొలుత ‘ఎన్ వీడు ఎన్ కనవర్‘ చిత్రంలో చిన్న పాత్రలో కనిపించిన అజిత్ కి.. ఎస్పీ బాలసుబ్రహ్మాణ్యం తనయుడు చరణ్ రూపంలో పెద్ద అవకాశం లభించింది. ఎస్.పి. చరణ్ కి అజిత్ క్లాస్ మేట్. అలా.. బాలసుబ్రహ్మణ్యం రికమెండేషన్ తో తెలుగు చిత్రం ‘ప్రేమ పుస్తకం‘లో హీరోగా అవకాశాన్ని అందుకున్నాడు. గొల్లపూడి మారుతిరావు తనయుడు శ్రీనివాస్ దర్శకుడిగా ఈ చిత్రం ప్రారంభమయ్యింది. అయితే.. ఈ సినిమా చిత్రీకరణ మధ్యలోనే గొల్లపూడి శ్రీనివాస్ చనిపోవడంతో.. ఈ సినిమాని గొల్లపూడి మారుతీరావు పూర్తిచేశారు.

పేరుకు ‘పెళ్లి పుస్తకం‘ మొదటి సినిమా అయినా.. అజిత్ హీరోగా విడుదలైన తొలి చిత్రం మాత్రం ‘అమరావతి‘. అజిత్, సంఘవి జంటగా సెల్వ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. తమిళంలో రూపొందిన ‘అమరావతి‘ చిత్రం సమయంలోనే అజిత్ కి మేజర్ యాక్సిడెంట్ జరిగింది. నటనతో పాటు రేసింగ్ లోనూ ప్రవేశం ఉంది అజిత్ కి. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో ఓ రేసింగ్ కి వెళ్లి యాక్సిడెంట్ కి గురయ్యాడు. దీంతో అజిత్ కొన్ని నెలల పాటు బెడ్ కే పరిమితమయ్యాడు. అలా.. ‘అమరావతి‘ చిత్రంలో అజిత్ పాత్రకు మరో విలక్షణ నటుడు విక్రమ్ డబ్బింగ్ చెప్పాల్సి వచ్చింది.

యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత కొన్నాళ్ల పాటు సపోర్టింగ్ రోల్స్ లోనే అలరించాడు అజిత్. ఈకోవలోనే అప్పుడప్పుడే హీరోలుగా ఎదుగుతున్న విజయ్, విక్రమ్ వంటి నటులతోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇక.. అజిత్ కి తొలి కమర్షియల్ హిట్ 1995లో విడుదలైన ‘ఆశై‘ సినిమాతో లభించింది. మణిరత్నం నిర్మాణంలో వసంత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీతో అజిత్ ఇక తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు.

తమిళ వారికి మాత్రమే కాదు అజిత్ ని తెలుగు వారికి కూడా బాగా దగ్గర చేసిన చిత్రం ‘కాదల్ కొట్టై‘. అగస్త్యన్ దర్శకత్వంలో అజిత్, దేవయాని జంటగా నటించిన ఈ సినిమా తెలుగులో ‘ప్రేమలేఖ‘ పేరుతో అనువాదమై ఒరిజినల్ కి మించిన రీతిలో విజయాన్ని సాధించింది. దేవా సంగీతంలో వచ్చిన ఈ సినిమా పాటలన్నీ చార్ట్ బస్టర్సే. ఇప్పటివరకూ వచ్చిన ప్రేమకథా చిత్రాల్లో ‘ప్రేమలేఖ‘కి ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది.

‘కాదల్ కొట్టై‘ తర్వాత రొమాంటిక్ హీరోగా వరుస సినిమాలతో తమిళ ప్రేక్షకుల్ని మురిపించాడు అజిత్. ఈకోవలోనే వచ్చిన చిత్రం ‘వాలి‘. ఈ సినిమాతో ఎస్.జె.సూర్యని దర్శకుడిగా పరిచయం చేశాడు. ‘వాలి‘ చిత్రం తెలుగులోనూ అనువాద రూపంలో అలరించింది.

అజిత్ 25వ చిత్రం ‘అమర్ కాలమ్‘. శరణ్ డైరెక్షన్ లో రూపొందిన ఈ మూవీలో అజిత్ కి జోడీగా షాలిని నటించింది. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైంది. ఆ తర్వాత కొన్ని రోజులకే వీరు వివాహం చేసుకున్నారు. ‘అమర్ కాలమ్‘ అజిత్ ని కమర్షియల్ హీరోగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాయే ఆ తర్వాత తెలుగులో ‘లీలీ మహల్ సెంటర్‘గా రీమేక్ అయ్యింది.

‘ముగవరీ, దీనా, సిటిజెన్, విలన్, వరలారు‘ వంటి సినిమాలు అజిత్ లోని కమర్షియాలిటీని బయటకు తీసుకొచ్చాయి. గతంలో రజనీకాంత్ నటించిన ‘బిల్లా‘ చిత్రాన్ని అదే పేరుతో రీమేక్ చేసి తమిళనాట సరికొత్త కలెక్షన్ల రికార్డులను తిరగరాశాడు అజిత్. ఆ తర్వాత అజిత్ నటించిన సినిమాలన్నీ దాదాపు హిట్టే. ఒక సినిమాకి మించి మరొకటి అన్నట్టుగా అజిత్ చిత్రాలు వసూళ్లలో రికార్డులు సృష్టిస్తూ వస్తున్నాయి.

అజిత్ ఒక దర్శకుడితో పనిచేస్తే.. మళ్లీ మళ్లీ అదే దర్శకుడితో వర్క్ చేయడానికి ఆసక్తి చూపిస్తుంటాడు. ఈకోవలోనే డైరెక్టర్ శివతో వరుసగా ‘వీరమ్, వేదాళమ్, వివేగం, విశ్వాసం‘ వంటి నాలుగు సినిమాలు చేశాడు. ఆ తర్వాత హెచ్. వినోద్ తో ‘నేర్కొండ పార్వై, వలిమై, తునీవు‘ వంటి సినిమాలు చేశాడు.

సినిమాల కౌంట్ విషయంలో మన తెలుగు అగ్ర కథానాయకుల ఇంకా 30 లలోనే ఉంటే.. తమిళ స్టార్ హీరో అజిత్ మాత్రం 60లు దాటేశాడు. కెరీర్ స్టార్టింగ్ లో ఏడాదికి ఎక్కువ సినిమాలు విడుదల చేసిన అజిత్.. ఈమధ్య కాస్త స్పీడు తగ్గించాడని చెప్పొచ్చు.

ఇక.. తమిళనాట ఒకప్పుడు రజనీకాంత్-కమల్ హాసన్ చిత్రాల మధ్య హోరాహోరీ పోరు సాగేది. ఇప్పుడు అదే రీతిన అజిత్-విజయ్ మధ్య బాక్సాఫీస్ వార్ జరుగుతోంది. వీరిద్దరి ఫ్యాన్స్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంటుంది. సామాజిక మాధ్యమాల వేదికగా విజయ్-అజిత్ ఫ్యాన్స్‌ ట్రోల్స్‌తో పెట్రేగిపోతుంటారు. ఫ్యాన్స్‌ పరిస్థితి అలాగుంటే.. ఈ అగ్ర కథానాయకులు మాత్రం ఎప్పుడూ స్నేహభావంతోనే మెలుగుతుంటారు. గతంలో వీరిద్దరూ కలిసి ‘రాజావిన్ పర్వాయిలే‘ అనే చిత్రంలో కలిసి నటించారు.

తెరపైనే కాదు.. తెరవెనుక కూడా సాహసాలు చేయడంలో కోలీవుడ్ అల్టిమేట్ స్టార్ అజిత్ రూటే సెపరేటు. కేవలం నటనారంగంలోనే కాకుండా.. వివిధ రంగాలలో ఎంతో ఉన్నత స్థానాలు సంపాదించిన ఘనత అజిత్ సొంతం. అంతర్జాతీయ స్థాయిలో ఫార్ములా ఛాంపియన్ షిప్స్ లో ప్రొఫెషనల్ రేసర్ గా పాల్గొన్న అజిత్.. చెన్నై రైఫ్ల్స్ క్లబ్ లో షూటర్ గానూ ట్రైనింగ్ తీసుకున్నాడు. పాకశాస్త్రంలో మంచి ప్రావీణ్యత కూడా ఈ స్టైలిష్ హీరో సొంతం. అలాగే పైలట్ లైసెన్స్ కూడా పొందిన అజిత్.. మద్రాస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో హెలికాప్టర్ టెస్ట్ పైలట్ అండ్ యు.ఎ.వి. సిస్టమ్ అడ్వైజర్ గా ఉద్యోగాన్ని కూడా పొందాడు.

ప్రస్తుతం మగిల్ తిరుమేని దర్శకత్వంలో ‘విడా ముయిర్చి‘ మూవీలో నటిస్తున్నాడు అజిత్. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ‘విడా ముయిర్చి‘ అజిత్ 62వ సినిమా. ఈ సినిమా తర్వాత తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ లో తన 63వ చిత్రాన్ని చేయబోతున్నాడు. ‘మార్క్ ఆంటోని‘ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ‘గుడ్ బ్యాడ్ అగ్లీ‘ అనే టైటిల్ ఖరారు చేశారు.

Related Posts