అబ్బాయ్ కి పోటీగా బాబాయ్

పాన్ ఇండియా సినిమాల ప్రభంజనం మొదలైన తర్వాత వారం వారం బాక్సాఫీస్ వద్ద పోటీ మామూలుగా ఉండడం లేదు. ప్రతీ వారం ఇంచుమించు మూడు, నాలుగు సినిమాలు థియేటర్లలోకి వస్తూనే ఉన్నాయి. అందుకే.. భారీ బడ్జెట్ తో రూపొందే సినిమాలకోసం నెలల ముందుగానే విడుదల తేదీలను ప్రకటిస్తున్నారు. అయినా.. బాక్సాఫీస్ క్లాషెస్ అనివార్యమవుతున్నాయి. లేటెస్ట్ గా టాలీవుడ్ లో నందమూరి బాబాయ్, అబ్బాయ్ ల మధ్య బాక్సాఫీస్ వార్ కన్ఫమ్ అనే ప్రచారం జోరందుకుంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటింగ్ ప్రాజెక్ట్ ‘దేవర‘. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ చిత్రంలోని మొదటి భాగం వచ్చే యేడాది ఏప్రిల్ 5న విడుదలకానుంది. సమ్మర్ సీజన్ కలిసొస్తుందనే ఉద్దేశ్యంతో పాన్ ఇండియా వైడ్ గా ఆ డేట్ ను ప్రకటించారు మేకర్స్. అయితే.. ‘దేవర‘ రాబోతున్న వారం రోజులు ముందుగా నటసింహం బాలకృష్ణ 109వ సినిమా థియేటర్లలోకి దిగబోతుందట.

టాలీవుడ్ సీనియర్స్ లోనే కాదు.. నేటితరం స్టార్ హీరోస్ కి మిన్నగా వరుస విజయాలతో సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు నటసింహం బాలకృష్ణ. ‘భగవంత్ కేసరి‘ బ్లాక్ బస్టర్ తర్వాత బాలయ్య.. బాబీ దర్శకత్వంలో తన 109వ సినిమాని చేస్తున్నాడు. నిన్నటినుంచే ఈ చిత్రం పట్టాలెక్కింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మిస్తున్న ఈ సినిమాని జెట్ స్పీడులో కంప్లీట్ చేయడానికి సన్నాహాలు చేస్తుందట టీమ్. వచ్చే యేడాది వేసవి కానుకగా మార్చి 29న బాలకృష్ణ-బాబీ సినిమాని తీసుకురావడానికి ప్లాన్ చేస్తుందనేది ఫిల్మ్ నగర్ టాక్. ఆ విధంగా ఒక్క వారం గ్యాప్ లోనే బాలకృష్ణ 109, ఎన్టీఆర్ ‘దేవర‘ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయన్నమాట. అయితే.. బాలయ్య సినిమా రిలీజ్ డేట్ పై ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.

Related Posts