నాగ చైతన్య పై 100 కోట్లా

కొన్నాళ్లుగా ఏ ఇండస్ట్రీలో అయినా బడ్జెట్ కు భయపడటం లేదు నిర్మాతలు. కాకపోతే కథ బలంగా ఉండేలా చేసుకుంటున్నారు. కొందరు నిర్మాతలు మాత్రం బలమైన కథ దొరికితేనే భారీ బడ్జెట్ కు వెళుతున్నారు. కొందరు మాత్రమే ఏవీ చూసుకోకుండా దర్శకుడు అడిగిన బడ్జెట్ ఇచ్చి ‘చెక్’ లు కాల్చుకుంటున్నారు. అయితే ఎంత బడ్జెట్ పెట్టాలన్నా కథ మాత్రమే కాదు ఆ హీరో, దర్శకుడికీ మార్కెట్ ఉండాలి. లేకపోయినా భారీ బడ్జెట్ అంటున్నారు అంటే నిర్మాతకు కథపై నమ్మకం ఉందని అర్థం. ఆ కథను సదరు దర్శకుడు బాగా తెరకెక్కిస్తాడు అనే కాన్ఫిడెన్స్ ఉంటేనే ముందుకు వెళతారు.

అలాగే వెళుతున్నాడు అల్లు అరవింద్. తన సెకండ్ బ్యానర్ లో ఇప్పుడు ఓ భారీ చిత్రానికి శ్రీకారం చుడుతున్నాడు. ఈ బ్యానర్ లో నాగ చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోంది. శ్రీకాకుళంలోని సముద్రం బ్యాక్ డ్రాప్ లో కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందబోతోన్న చిత్రం ఇది. మత్స్యకారుల జీవితంలోని ఒక సాహసోపేతమైన సంఘర్షణను ఈ చిత్రంలో చూపించబోతున్నారట. చేపలు పట్టేందుకు సముద్రంలోకి వెళ్లే షిప్ ను నడిపించే వ్యక్తి పాత్రలో నాగ చైతన్య కనిపించబోతున్నాడంటున్నారు.


వీళ్లు చేపలు పడుతూ అప్పుడప్పుడూ ఇతర దేశాల సముద్ర జలాల్లోకి అడుగుపెడతారు. అప్పుడు ఆ దేశాల వాళ్లు అరెస్ట్ చేస్తారు. సరైన ఆధారాలు చూపించకపోతే తమ దేశ చట్టాలప్రకారం శిక్షలు కూడా వేస్తారు. అలా నాగ చైతన్య టీమ్ కూడా పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశిస్తుందట. మరి అక్కడి నుంచి వీళ్లు ఎలా తప్పించుకున్నారు. తిరిగి తమ సొంత వారిని చేరుకునేందుకు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారు అనేది కథ అంటున్నారు. అంటే ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ ఎక్కువగా అవసరం అవుతాయి. మేకింగ్ కూడా గ్రాండ్ స్కేల్ లో ఉంటుందట.

అందుకే బడ్జెట్ భారీగా అవసరం అవుతుందని టాక్. హీరో ఫ్లాపుల్లో ఉన్నా దర్శకుడు కార్తికేయ2తో ప్యాన్ ఇండియన్ మార్కెట్ లోకి అడుగుపెట్టాడు కాబట్టి ఈ కథ ఎంత డిమాండ్ చేసినా పెట్టేందుకు అవసరమైతే 100 కోట్లైనా వెనక్కి తగ్గను అంటున్నాడ అల్లు అరవింద్. ఓ రకంగా ఇది నాగ చైతన్య, చందు మొండేటిలకు చాలా పెద్ద వ్వవహారం. ఈ వ్యవహారంలో వీళ్లు ఎంత పెద్ద విజయం సాధిస్తారో మరి.

Related Posts