నటీనటులు: సత్యదేవ్, లక్ష్మణ్ మీసాల, కృష్ణ బురుగుల, అర్చన అయ్యర్, అతీరా రాజ్, రఘు కుంచె, నంద గోపాల్, తారక్, సత్యం తదితరులు
సినిమాటోగ్రఫి: సన్నీ కూరపాటి
సంగీతం: కాలభైరవ
నిర్మాత: కృష్ణ కొమ్మాలపాటి
సమర్పణ : కొరటాల శివ
దర్శకత్వం: వి.వి.గోపాలకృష్ణ
విడుదల తేది: 10-05-2024
కంటెంట్ బలంగా ఉన్న సినిమాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ వస్తోన్న సత్యదేవ్.. తాజాగా ‘కృష్ణమ్మ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో కృష్ణ కొమ్మాలపాటి నిర్మించిన ఈ సినిమాకి వివి గోపాల కృష్ణ దర్శకుడు. బెజవాడ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ‘కృష్ణమ్మ‘ ఎలా ఉంది? అనే విశేషాలు ఈ రివ్యూలో చూద్దాం.
కథ
బెజవాడ ఇంచిపేట ప్రాంతానికి చెందన భద్ర (సత్యదేవ్), శివ (కృష్ణ తేజ రెడ్డి), కోటి (మీసాల లక్ష్మణ్) అనాధలు. చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతారు. భద్ర, కోటి గంజాయి స్మగ్లింగ్ వంటి పనులు చేస్తుంటే.. శివ చిన్న ప్రింటింగ్ ప్రెస్ రన్ చేస్తుంటాడు. ఇద్దరు మిత్రుల్ని స్మగ్లింగ్ మానేయమని చెబుతూ ఉంటాడు. ఈ ముగ్గురూ తమకంటూ ఓ కుటుంబం ఉండాలని ఆశ పడతారు. ఈ క్రమంలోనే మీనా (అతీరా రాజ్)తో శివ ప్రేమలో పడతాడు. ఆమెను భద్ర సొంత చెల్లిగా భావిస్తుంటాడు. అయితే అనుకోకుండా స్నేహితులు ముగ్గురూ చేయని నేరానికి జైలు కెళ్తారు. దీంతో.. వారి జీవితాలు చిన్నాభిన్నం అవుతాయి. అసలు ఈ ముగ్గురూ ఎందుకు అరెస్ట్ అయ్యారు? వాళ్లపై మోపిన నేరమేమిటి? అందులోంచి బయటపడ్డారా? లేదా? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ
కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకుడు వి.వి. గోపాలకృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఎవరో చేసిన నేరాన్ని అమాయకులపై నెట్టడం.. ఆ కేసులో ఇరుక్కొని జీవితాన్ని పాడు చేసుకోవడం వంటివి ఇదివరకే కొన్ని సినిమాల్లో చూశాం. అలాగే.. కొంతమంది అనాథలు కలిసి పెరగడం, అందులో ఒకరు ప్రేమలో పడటం వంటి సీన్లు ఇంతకు ముందు కొన్ని సినిమాల్లో చూసినవే.
లీడ్ యాక్టర్స్ భద్ర, శివ, కోటి పాత్రల పరిచయం.. వాళ్ల మధ్య జరిగే చిన్న చిన్ని గొడవలు.. మళ్లీ కలుసుకోవడాలు ఇలా ‘కృష్ణమ్మ‘ ఫస్టాఫ్ అంతా నెమ్మదిగా సాగుతుంది. ఇంటర్వెల్ కి ముందు భద్ర తన మిత్రులతో కలిసి గంజాయి స్మగ్లింగ్‌కు సిద్ధమవడం.. దాన్ని తీసుకొచ్చే క్రమంలో పోలీసులకు దొరికిపోవడం.. అదే సమయంలో అనుకోకుండా ఓ హత్యాచారం కేసును తమపై వేసుకోవడంతో కథలో వేగం పెరుగుతోంది. ఇక అక్కడ నుంచి సెకండాఫ్ అంతా సీరియస్ టోన్ లో వెళుతోంది.
కథలో కొత్తదనం లేకపోయినా.. కథనంలో మాత్రం రా అండ్ రస్టిక్ ఫీల్ తీసుకురావడంలో దర్శకుడు వి.వి.గోపాలకృష్ణ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. అయితే.. చేయని నేరానికి శిక్ష అనుభవించిన వారి రివెంజ్ డ్రామాని ఇంకా ఒళ్లు జలదరించేలా డైరెక్టర్ ఆన్ స్క్రీన్ పై ఆవిష్కరిస్తే ‘కృష్ణమ్మ‘ మరో రేంజ్ కు చేరేది.
నటీనటులు, సాంకేతిక నిపుణులు
టాలీవుడ్ యంగ్ హీరోస్ లో బెస్ట్ పెర్ఫామర్స్ లిస్ట్ లో సత్యదేవ్ ఖచ్చితంగా ఉంటాడు. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోగల సత్యదేవ్ భద్ర క్యారెక్టర్ కి సరిగ్గా సరిపోయాడు. భద్ర పాత్రలో తన మేకోవర్, తాను పలికే విజయవాడ యాస బాగున్నాయి. క్లైమాక్స్ ఎపిసోడ్ లో అయితే సత్యదేవ్ తన నట విశ్వరూపం చూపించాడు. భద్ర కి స్నేహితులుగా నటించిన లక్ష్మణ్, శివ కూడా తమ సహజ నటనతో ఆకట్టుకున్నారు. మీనా పాత్రలో అతిరా అందంగా కనిపించింది.
సాంకేతిక నిపుణుల విషయానికొస్తే.. కాలభైరవ నేపథ్య సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కృష్ణానది కూడా ఈ సినిమాలో భాగమే. అసలు టైటిలే అది. ఇక.. కృష్ణానదీ తీరాన్ని ఛాయగ్రాయకుడు అందంగా చూపించాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరగా
మొత్తంగా.. ‘కృష్ణమ్మ‘ ఓ రివెంజ్ డ్రామా. మొదటి భాగం నెమ్మదిగా సాగినా.. ద్వితియార్థంలోని ఎమోషన్స్, డ్రామా ఆకట్టుకుంటాయి. సత్యదేవ్ నటన, సెకండాఫ్ లోని ట్విస్ట్స్, క్లైమాక్స్ సన్నివేశాలు ‘కృష్ణమ్మ‘కు ప్లస్ పాయింట్స్.
రేటింగ్ : 2.75/ 5