దసరా సినిమాలన్నీ సేఫేనా?

దసరా కానుకగా తెలుగు నుంచి ‘భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు’.. తమిళం నుంచి అనువాద రూపంలో ‘లియో’ సినిమాలు గ్రాండ్ లెవెల్ లో రిలీజయ్యాయి. వీటిలో ‘భగవంత్ కేసరి’కి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే.. ‘టైగర్ నాగేశ్వరరావు, లియో’ చిత్రాలకు మిక్స్ డ్ రివ్యూస్ దక్కాయి. అయితే.. ఫైనల్ గా ఈ మూడు ప్రాజెక్ట్స్ సేఫ్ జోన్ లోనే ఉన్నాయనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్.

ముందుగా ‘లియో’ సినిమా గురించి చూస్తే.. ఈ సినిమాకి వచ్చిన రివ్యూస్ కి.. కలెక్షన్స్ కి మధ్య చాలా పొంతన కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.450 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ‘లియో’ తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వసూళ్లు దక్కించుకుంది. ఈ చిత్రాన్ని తెలుగులో సితార ఎంటర్ టైన్ మెంట్స్ రిలీజ్ చేయడంతో థియేటర్ల సంఖ్య కూడా భారీగానే దక్కింది. మొత్తానికి తెలుగులో ‘లియో’ ప్రాఫిట్ ప్రాజెక్ట్ గానే మిగిలిందట. రూ.16 కోట్లకు ఈ చిత్రం తెలుగు రైట్స్ దక్కించుకుంటే.. రూ.22 కోట్లకు పైగానే షేర్ వసూలు చేసిందట.

‘టైగర్ నాగేశ్వరరావు’ కూడా సేఫ్ ప్రాజెక్టేననేది ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. పాన్ ఇండియా లెవెల్ లో ‘కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2’ వంటి భారీ విజయాలందుకున్న అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించడంతో.. పాన్ ఇండియా సర్కిల్స్ లో ‘టైగర్ నాగేశ్వరరావు’పై రిలీజ్ కు ముందే పాజిటివ్ బజ్ ఏర్పడింది. దానికి తోడు మాస్ మహారాజ రవితేజా కూడా తన డబ్బింగ్ మూవీస్ తో హిందీ సర్కిల్స్ లో బాగా తెలిసినవాడు కావడంతో.. ఈ చిత్రం నాన్ థియేట్రికల్ హక్కులకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. అలా.. రిలీజ్ కు ముందే ‘టైగర్ నాగేశ్వరరావు’ అన్ని భాషల్లోనూ రూ.65 కోట్లు వరకూ నాన్ థియేట్రికల్ రూపంలో దక్కించుకుందట. మరోవైపు.. భారీ కాన్వాస్ తో రూపొందిన ఈ సినిమాని అనుకున్న బడ్జెట్ లోనే ఇంచుమించు పూర్తి చేయడం.. దసరా బరిలో విడుదలవ్వడంతో థియేట్రికల్ రన్ కూడా బాగానే రావడంతో ఫైనల్ గా ‘టైగర్ నాగేశ్వరరావు’ సేఫ్ ప్రాజెక్ట్ అని చెబుతున్నారు.

‘భగవంత్ కేసరి’ గురించి మరో భిన్నమైన కథనం వినిపిస్తుంది. ఈ సినిమా విడుదలైన తొలి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే.. బాలయ్య సినిమాల్లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందిన సినిమా కావడంతో.. రికవరీ కాస్త లేటుగా జరుగుతోందట. ఇప్పటివరకూ వచ్చిన కలెక్షన్స్ తో దాదాపు బ్రేక్ ఈవెన్ కి దగ్గరగా వచ్చిన ‘భగవంత్ కేసరి’.. మరికొన్ని రోజుల్లో ప్రాఫిట్ జోన్ లోకి రానున్నట్టు ట్రేడ్ టాక్. మొత్తంమీద.. ఈ ఏడాది దసరా తెలుగు చిత్ర పరిశ్రమకు మంచి విజయాలే అందించిందని చెప్పొచ్చు.

Related Posts