మలయాళం సిరీస్ కు మహేష్ బాబు ఎమోషనల్ రివ్యూ

సహజత్వానికి పెద్ద పీట వేసే మలయాళం సినిమాలు, సిరీస్ లు తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈ లిస్టులో లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకొచ్చిన వెబ్ సిరీస్ ‘పోచర్’. నిమిషా సజయన్ , రోషన్ మాథ్యూ , దివ్యేంద్రు భట్టాచార్య ముఖ్య పాత్రలు పోషించిన ‘పోచర్’ సిరీస్ కి రిచీ మెహతా దర్శకత్వం వహించారు. కేరళ అడవుల నేపథ్యంలో నడిచే ఈ కథను 8 ఎపిసోడ్స్ గా అమెజాన్ ప్రైమ్ ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చింది. ఫిబ్రవరి 23 నుంచి అమెజాన్ ప్రైమ్ లో ‘పోచర్’ స్ట్రీమ్ అవుతోంది.

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ఎక్స్ క్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ‘పోచర్’ సిరీస్.. కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. 2015 నేపథ్యంలో సాగే ఈ సిరీస్ లో కేరళ ఫారెస్టుకి సంబంధించిన రేంజ్ ఆఫీసర్ గా మాల పాత్రలో నిమిషా సజయన్ నటించింది. అడవిలోని వన్య మృగాలను రక్షించాలనే కారణంతో ఆమె ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గా మారుతోంది.

అడవిలో ఏనుగులను ఎవరు చంపుతున్నారు? ఏనుగు దంతాల రవాణా ఎక్కడి నుంచి సాగుతోంది? అవి ఎక్కడికి చేరుకుంటున్నాయి? అసలు ఏనుగు దంతాల అక్రమ రవాణా వెనకున్నదెవరు? వాళ్లను పట్టుకునే ప్రయత్నంలో మాల టీమ్ కి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? విధి నిర్వహణలో తమకి ఎదురయ్యే అవాంతరాలను వాళ్లు ఎలా అధిగమిస్తారు? అనేదే ‘పోచర్’ కథ. ఆద్యంతం ఫారెస్ట్ నేపథ్యంలోని అద్భుతమైన లొకేషన్స్ లో సాగే ‘పోచర్’ సిరీస్ కి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. ఈ సిరీస్ మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులో ఉంది.

లేటెస్ట్ గా ఈ సిరీస్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి సూపర్బ్ కాంప్లిమెంట్స్ వచ్చాయి. ‘ఏనుగులను అలా ఎలా చంపేస్తారు..? అలా చేస్తున్నప్పుడు వారి చేతులు వణకవా..? అలా చేసే వారిలో హ్యుమానిటీ ఉండదా..? ఈ సిరీస్ చూస్తున్నప్పుడు నా మైండ్ లో ఇవే క్వశ్చన్స్ రన్ అయ్యాయి. ఈ జెంటిల్ జెయింట్స్ ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు పోరాడాలి’ అంటూ ఈ సిరీస్ కి తన ఎమోషనల్ రివ్యూ అందించాడు మహేష్. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related Posts