కొమురం భీముడా.. కొర్రాసు నెగడోలే మండాలి కొడుకా

ఆర్ఆర్ఆర్.. ప్రపంచ వ్యాప్తంగా సినిమా ప్రేమికులు ఎదురుచూస్తోన్న చిత్రం. రాజమౌళి డైరెక్షన్ లో తెలుగులో మాస్ హీరోలుగా వెలుగుతోన్న రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్. జనవరి 7న విడుదల కాబోతోన్న ఈ చిత్రం నుంచి ప్రమోషన్స్ పరంగా ఇండియన్ సినిమా హిస్టరీయే కొత్త పాఠాలు నేర్చుకోవాలి అన్నట్టుగా దూసుకుపోతున్నాడు రాజమౌళి. లేటెస్ట్ గా ఆర్ఆర్ఆర్ నుంచి ఎన్టీఆర్ పాత్రకు ఆయన పుట్టిన నేల ఉత్తేజాన్ని రగిలిస్తుంది అన్న అర్థం వచ్చేలా ఓ పాటను విడుదల చేశారు. సుద్దాల అశోక్ తేజ రాసిన ‘కొమురం భీముడో కొమురం భీముడో కొర్రాసు నెగడోలే రగలాలి కొడుకో’అంటూ సాగే ఈ గీతానికి కీరవాణి చేసిన సంగీతం, కాలభైరవ గానం రోమాంఛితంగా ఉండబోతున్నాయి అనేలా ఉంది. ఇక ఆ పాటలో ఎన్టీఆర్ నటనను ఊహించుకుంటే చాలు.. ఆ ఫీలింగ్ డబుల్ అవుతుంది. పాట ఆరంభంలోనే ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో కొమురం భీముడా.. నువ్వు పుట్టిన గోండు నేల నీతో ఏదో చెబుతుంది చూడు అనే మాటల తర్వాత ప్రారంభమైన పాట ఆద్యంతం గొప్ప లిరిక్స్ తో మెస్మరైజింగ్ గా ఉంది. ముఖ్యంగా ఇది భీమ్ పాత్రలోని ఎమోషనల్ యాంగిల్ ను నెక్ట్స్ లెవల్లో ప్రెజెంట్ చేసే పాటలా కనిపిస్తోంది.

‘కాలువైపారే నీ గుండె నెత్తురు.. నేలమ్మా నుదుటి బొట్టైతుందీ సూడూ.. అమ్మా కాళ్ల పారాణైతుందీ సూడూ.. తల్లి పెదవుల నవ్వై మెరిసిందీ సూడూ’అనే పాటలోని లైన్లు చూస్తే వీరి ప్రాణత్యాగం సమయంలో ఈ పాట వస్తుందని ఊహించొచ్చు.ఎటొచ్చీ ఈ గీతం తెలంగాణ ప్రాంతంలో రెగ్యులర్ గా వినిపించే ఓ జానపద పాట శైలిలోనే ఉంది. ట్యూన్ కూడా చాలాసార్లు ఇక్కడి జానపదాల్లో విన్నదే. అయినా ఆ పాత్ర నేటివిటీకి సరిగ్గా సరిపోతుంది కాబట్టి.. సహజంగానూ కనిపిస్తోంది.


అలాగే కాలభైరవ గానంలో ఒకసారి ‘భీముడో’అని కొన్నిసార్లు ‘బీముడో’అని వినిపిస్తోంది. కావాలనే పాడారా లేక భీకి ఒత్తు వదిలేశారా అనేది వాళ్లే చెబితే బావుంటుంది. మొత్తంగా ఈ పాట తర్వాత ఇక ఇలాంటిదే రామ్ చరణ్ నుంచీ మరోటి వస్తుందనుకోవచ్చు. మరి అది ఎలా ఉంటుందో కానీ.. ఓవరాల్ గా కొమురం భీముడో మాత్రం కుమ్మేసే పాటలానే ఉంది.

Related Posts